Wednesday, November 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహంతకులపై చర్యలేవి?

హంతకులపై చర్యలేవి?

- Advertisement -

– ఐదురోజులైనా సామినేని హత్యపై ముందుకు సాగని పోలీసుల విచారణ
– రాజకీయ హత్యగా పేర్కొనటంలో నిరాశక్తత
– బాధితులను ఇబ్బంది పెట్టే రీతిలో ఎంక్వయిరీ
– న్యాయబద్ధ విచారణ సాగకపోతే పోలీసు కార్యాలయాలు ముట్టడిస్తాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, నున్నా
– హత్య కేసు విచారణ సాగుతున్న తీరుకు నిరసనగా ఖమ్మంలో సీపీఐ(ఎం) ప్రదర్శన

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం
సీపీఐ(ఎం) నాయకులు సామినేని రామారావు హత్య జరిగి ఐదురోజులు అవుతున్నా నిందితులను తేల్చటంలో పోలీసుశాఖ, సీపీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని హత్యల పరంపర కేవలం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలోనే ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. హంతకులను కాపాడే రీతిలో విచారణ సాగుతోందని ఆరోపించారు. నిందితులను వదిలి బాధితులను ఇబ్బంది పెట్టే రీతిలో ఎంక్వయిరీ ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా, న్యాయబద్ధంగా విచారణ సాగకపోతే పోలీసు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రామారావు హత్యకేసు విచారణ సాగుతున్న తీరుకు నిరసనగా సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కమిటీ, ఖమ్మం రూరల్‌ మండల కమిటీల ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక పాతబస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వైరా రోడ్డు మీదుగా జడ్పీ సెంటర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్‌తో కలిసి పోతినేని మాట్లాడారు. మధిర నియోజకవర్గంలో కొనసాగుతున్న హత్యల పరంపరలో భాగంగా కాంగ్రెస్‌ గూండాలు కుట్ర పన్ని రామారావును హత్యచేశారన్నారు. ఈ హత్య జరిగి ఐదురోజులు అవుతున్నా ఈ కేసు విషయంలో పోలీసుశాఖ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని విమర్శించారు. ‘నిందితులు పలానా వాళ్లు.. వాళ్లను పట్టుకుని శిక్షించండి’ అని రామారావు భార్య స్వరాజ్యం స్వయంగా పిటిషన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. నిందితులు వారందరూ గ్రామంలోనే ఉన్నా పోలీసు విచారణ మాత్రం రామారావు కుటుంబంపై మాత్రమే సాగుతోందని అన్నారు. విచారణను కాలేజీలు, స్కూళ్లు, ప్రిన్సిపాళ్లు, బంధువులు, రామారావు కుటుంబానికే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించారు. నేరస్తులను పట్టుకోవాలనే రీతిలో పోలీసులు విచారణ లేదని, వారిని కాపాడే పద్ధతిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గూండాలు ప్రజా నాయకులను చంపివేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. పందిళ్లపల్లిలో అలవాల శ్రీనివాస్‌, గోవిందాపురం(ఎల్‌)లో ఎర్రబోయిన నాగేశ్వరరావు, ఇప్పుడు పాతర్లపాడులో సామినేని రామారావును అలాగే చంపివేశారన్నారు. సీపీ సునీల్‌దత్‌ దీన్ని రాజకీయ హత్యగా పరిగణించడానికే సుముఖంగా లేరన్నారు. ఈ విషయంపై ఎవరన్నా మాట్లాడితే వారిని ముద్దాయిగా చేస్తామని ఆయన హెచ్చరిస్తున్న తీరు అభ్యంతరకరమని తెలిపారు.

అధికార పార్టీ హంతకులను తప్పించే యత్నం: నున్నా నాగేశ్వరరావు
అధికార పార్టీకి చెందిన హంతకులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఈ హత్యకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విచారణ ప్రారంభం కాకముందే రాజకీయ హత్య కాదని సీపీ ఎలా అంటారని ప్రశ్నించారు. హంతకులను పట్టుకునే దాకా సీపీఐ(ఎం) ఉద్యమాలతోనే సమాధానం చెబుతుందని అన్నారు. హత్యా నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్‌ అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి పద్మ, వన్‌టౌన్‌, టూటౌన్‌, త్రీటౌన్‌, ఖానాపురం హవేలీ, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల కార్యదర్శులు నాగుల్‌మీరా, బోడపట్ల సుదర్శన్‌, భూక్యా శ్రీనివాసరావు, దొంగల తిరుపతిరావు, ఎస్‌.నవీన్‌రెడ్డి, ఊరడి సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మీరాసాహెబ్‌, నండ్ర ప్రసాద్‌, మెరుగు సత్యనారాయణ, మెరుగు రమణ, బండారు రమేశ్‌, ఎంఏ జబ్బార్‌, తుమ్మా విష్ణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -