Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూనియన్‌ పెట్టుకుంటే.. ఉద్యోగం తీసేశారు

యూనియన్‌ పెట్టుకుంటే.. ఉద్యోగం తీసేశారు

- Advertisement -

– బిస్లరీ వాటర్‌ కంపెనీ యాజమాన్యం దుర్మార్గం
– నాయకుల సస్పెన్షన్‌.. బౌన్సర్లతో బెదిరింపు
– ఉద్యోగం కావాలంటే యూనియన్‌ వద్దంటూ కార్మికులతో అగ్రిమెంట్‌
– రూ.50 బాండ్‌ పేపర్‌పై సంతకాలు తీసుకున్న వైనం
– పట్టించుకోని కార్మికశాఖ అధికారులు
– కార్మిక చట్టాల రద్దుతో మితిమీరుతున్న ఆగడాలు
– అమలుకు ముందే లేబర్‌ కోడ్‌ల ఎఫెక్ట్‌
– యూనియన్‌ పెట్టుకోవడం చట్టబద్ధమైన హక్కు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

కార్మికులు తమ సమస్యల పరిష్కారం, ఐక్యత, చట్టాల రక్షణ కోసం సంఘంగా ఏర్పడతారు. కంపెనీ లేదా పని చేసే చోట యూనియన్‌ పెట్టుకోవడం చట్టబద్దమైన హక్కు. కానీ సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిస్లరీ వాటర్‌ కంపెనీలో ఇవేవీ చెల్లవంటున్నారు. యూనియన్‌ ఏర్పాటు చేసినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు. నాయకులను సస్పెండ్‌ చేశారు. యూనియన్‌ రద్దు చేసుకుంటేనే విధుల్లోకి తీసుకుంటామని బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ.50 బాడ్‌ పేపర్‌పై కార్మికులతో బలవంతంగా సంతకాలు తీసుకొని ఒప్పందం రాయించుకున్నారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ తాత్కాలికంగా అమలు కాకపోయినా వాటి ఎఫెక్ట్‌ మాత్రం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో కనిపిస్తుంది.
సంగారెడ్డి జిల్లా ఐడీఏ పాశమైలారంలో 15 సంవత్సరాల క్రితం బిస్లరీ ఇంటర్నేషన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ (వాటర్‌) ఏర్పాటు చేశారు. మొదటగా బెల్లి అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. తర్వాత బిస్లరీ కంపెనీగా మారింది. కంపెనీలో 40మంది పర్మినెంట్‌, న్యాప్స్‌ పేరిట 10 మంది, 200 మంది కాంట్రాక్టు కార్మికుల వరకు పనిచేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం తమతో వెట్టి చాకిరి చేయించుకొని కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీస వేతనాలు ఇవ్వట్లేదు. 12 గంటల డ్యూటీ చేస్తే భోజనం సౌకర్యం కల్పించాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కంపెనీలో క్యాంటిన్‌ సదుపాయంలేదు. వాటర్‌ కంపెనీ అయినా కార్మికులు తాగేందుకు నీళ్లుండవు. బయటికెళ్లి నీరు తాగాల్సి వస్తుంది. కార్మికులు అన్నం తినేందుకు కనీస వసతిలేదు.ఎంతో దుర్భరమైన పరిస్థితులున్నాయి. దాంతో తమ సమస్యల పరిష్కారం కోసం 40 మంది పర్మినెంట్‌ కార్మికులు యూనియన్‌ పెట్టుకున్నారు. బిస్లరీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) పేరిట రిజిస్ట్రేషన్‌ నెం.సీ/టీయూ/613/2025 ఏర్పాటు చేసుకున్నారు. గత అక్టోబర్‌ 28వ తేదీన తాము సీఐటీయూ యూనియన్‌ ఏర్పాటు చేసుకున్నామని యాజమాన్యానికి లెటర్‌ అందజేశారు. ఆ లెటర్‌ ఇచ్చిన వారిపై మరుసటి రోజు నుంచే యాజమాన్యం ఒత్తిడి మొదలెట్టింది.

యూనియన్‌లో ఉంటే ఉద్యోగం తీసేస్తం
బిస్లరీ కంపెనీలో కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతోపాటు వారిపై వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో యూనియన్‌ ఏర్పాటు చేసుకుంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాల పెంపు ఒప్పందాలు చేసుకోవచ్చని కార్మికులు బావించారు. అందరూ కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 28న కంపెనీలో యూనియన్‌ ఏర్పాటు చేశారు. అధి భరించలేని కంపెనీ యాజమాన్యం.. 29వ తేదీ నుంచి కార్మికులను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడింది. కంపెనీలో ఉద్యోగం ఉండాలంటే యూనియన్‌లో ఉండొద్దంటూ హుకుం జారీ చేసింది. తాము యూనియన్‌లో లేమని, యాజమాన్యాన్ని ప్రశ్నించమంటూ రాతపూర్వకంగా ఇవ్వాలని బెదిరించింది. అంతే కాకుండా యాజమాన్యం మరొక అడుగు ముందుకేసి రూ.50 బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేయాలని ఆదేశించింది. ఒక్కొక్క కార్మికుని పేరుతో యాజమాన్యమే బాండ్‌ పేపర్లు తయారు చేసి ఇచ్చింది. యూనియన్‌ ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. యూనియన్‌ ప్రధాన కార్యదర్శితో పాటు ఐదుగుర్ని సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ అయిన వారిని కంపెనీ లోపలికి రాకుండా రెండు గేట్లకు తాళాలు వేశారు. అంతే కాకుండా కంపెనీ గేట్‌ ముందు బౌన్సర్లను ఏర్పాటు చేసి కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తుంది.

సౌకర్యాల కోసమే యూనియన్‌ పెట్టాం: శేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, బిస్లరీ కంపెనీ యూనియన్‌
బిస్లరీ వాటర్‌ కంపెనీలో కార్మికులకు సౌకర్యాలు కల్పించకపోవడంతోనే యూనియన్‌ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని యాజమాన్యం జీర్ణించుకోలేకపోతుంది. వాటర్‌ కంపెనీ అయినా కార్మికులకు తాగేందుకు నీళ్లు లేవు. ఇంటి నుంచి అన్నం తెచ్చుకొని తిందామన్నా క్యాంటీన్‌ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు లేవు. రాత్రి పగలు కూడా బయటకు పోవాల్సిందే. 12 గంటల డ్యూటీ చేస్తే యాజమాన్యమే భోజన సౌకర్యం కల్పించాలి. ఓవర్‌ టైమ్‌ డ్యూటీ చేసిన కూడా భోజనం పెట్టడం లేదు. కార్మికులకు ఎలాంటి సెలవులు లేవు. పండగలు వచ్చినా, జాతీయ సెలవులు ఉన్నా తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సిందే. డ్యూటీకి రాకపోతే బెదిరింపులకు గురిచేస్తారు. వీటిని అడిగేందుకు యూనియన్‌ పెట్టుకుంటే యాజమాన్యం నాతో పాటు ఐదుగుర్ని సస్పెండ్‌ చేసింది. దీనిపై సీఐటీయూ ఆద్వర్యంలో న్యాయపోరాటం చేస్తాం.

వేధింపులకు గురిచేస్తున్న యాజమాన్యం : నాగరాజు, యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
యూనియన్‌ పెట్టుకున్నామనే సాకుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతుంది. ఎలాంటి సెలవులు లేకుండా 365 రోజులు పనిచేయిస్తారు. సౌకర్యాలు కల్పించాలని అడిగితే ఇష్టముంటే డ్యూటీ చేయండి లేదంటే మానేయాలంటూ బెదిరిస్తారు. యూనియన్‌ పెట్టుకున్నామని మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించారు. మిగతా కార్మికులను బెదిరిస్తున్నారు.

యూనియన్‌ పెట్టుకుంటే కార్మికులను తొలగించడం దుర్మార్గం : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం
కంపెనీలో కార్మికులు యూనియన్‌ పెట్టుకుంటే విధుల్లోంచి తొలగించడం దుర్మార్గం. యూనియన్‌ పెట్టుకున్నారనే సాకుతో యూనియన్‌ ప్రధాన కార్యదర్శితో పాటు ఐదుగుర్ని ఉదోగ్యం నుంచి తొలగించారు. ఉపాధ్యక్షుడికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి వివరణ ఇవ్వాలని హెచ్చరించారు. యూనియన్‌లో లేమంటూ కార్మికుల నుంచి రూ.50 బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేయాలంటూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనిపై లేబర్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. యాజమాన్యం తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. లేనిచో ఉద్యమం తీవ్రతరం చేస్తాం.

యూనియన్‌ పెట్టుకోవడం కార్మికుల చట్టబద్దమైన హక్కు.. : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
కార్మికులు తమ సౌకర్యాలు, హక్కుల రక్షణ కోసం యూనియన్‌ పెట్టుకునేందుకు చట్టబద్దమైన హక్కుంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తెచ్చింది. దాన్ని వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. కంపెనీలు మాత్రం యదేచ్ఛగా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. కొన్ని కంపెనీలో కార్మికులు యూనియన్‌ పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారు. బిస్లరీ కంపెనీలో యూనియన్‌ పెట్టుకున్నారనే పేరుతో నాయకులను తొలగించడం సరైంది కాదు. యూనియన్‌లో ఉన్నారని ఉద్యోగం నుంచి తొలగిస్తే చూస్తూ ఊరుకోం. సీఐటీయూ తరపున కార్మికులకు అండగా ఉంటాం. యాజమాన్యం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -