తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన
ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలను ఎత్తేయాలి
కపాస్ యాప్ నిబంధనలు సడలించాలి : జిల్లా కలెక్టర్, అధికారులకు వినతిపత్రాలు సమర్పణ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై ఓవైపు పత్తి రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలలో అలాట్‌మెంట్, యాప్ రిజిస్ట్రేషన్, తేమ శాతం పరిమితి వంటి నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఐ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలను ఎత్తివేయాలని, యాప్ రిజిస్ట్రేషన్ వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తోంది. అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7,65,163 ఎకరాల్లో పత్తి సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల 65 వేల 163 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. నల్లగొండ జిల్లాలో 568010 ఎకరాలలో సాగు అయిందని జిల్లాలో 4 54 090 మెట్రిక్ టన్నుల పత్తి రావచ్చని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 83923 ఎకరాల్లో 503,538 క్వింటాళ్ల పత్తి, భువనగిరి యాదాద్రి జిల్లాలో 113190 ఎకరాలలో 679140 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు.
గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల మేర సీసీఐకి విక్రయించుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పరిమితిని 7 క్వింటాళ్లకు కుదించారు. మిగిలిన దిగుబడిని రైతులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.8110 ఉండగా, బహిరంగ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. తేమ 12శాతం మించితే కొనుగోలు చేయడం లేదు. నల్లరేగడి భూముల్లో కొన్నిచోట్ల ఎకరాకు 15 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తోంది. 12 క్వింటాళ్లు కొనాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు కూడా పూర్తిస్థాయిలో అవగాహన కాలేదు.
విభజించు పాలించు విధానంలో సీసీఐ నల్లగొండ జిల్లా కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల కృష్ణారెడ్డి
జిన్నింగ్ మిల్లుల వ్యవస్థలో విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని సీసీఐ అమలు చేస్తోంది. కేంద్రం కొత్త విధానాలు తెచ్చింది. ఎల్-1, ఎల్-2, ఎల్-3 విధానాలు పూర్తిగా అన్యాయం. ఇది ఇలాగే కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉంది. రైతులు పండించిన పంటను సైతం స్వేచ్ఛగా అమ్ముకోకుండా షరతులు విధించడం బాధాకరం. గతంలో ఎకరాకు 12 క్వింటాలున్న విధానాన్ని ఏడు క్వింటాళ్లకు కుదించడం హేయమైన చర్య.
రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. కానీ, గ్రామీణ రైతులలో చాలామందికి స్మార్ట్ ఫోన్లు లేవు. అందువల్ల యాప్‌లో నమోదు చేయలేకపోతున్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6 వేలకు పడిపోగా.. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టబడ్డారు.
నల్లగొండ జిల్లాలో 6476 క్వింటాళ్ల కొనుగోలు ఛాయాదేవి, మార్కెటింగ్ ఏడీ, నల్లగొండ
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 5,72 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 23 జిన్నింగ్ మిల్లులను గుర్తించి వాటిల్లో ఎల్-1కింద ఉన్న తొమ్మిది కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించాం. ఇప్పటి వరకు 6476 క్వింటాళ్లుకొన్నాం. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12శాతం ఉండటంతోపాటు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతుల స్లాట్ ఆధారంగా పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేశాం.
నిబంధన సడలించాలి
సీసీఐ పత్తి కొనుగోళ్లలో ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన సడలించాలి. నాలుగు ఎకరాల నల్ల రేగడి భూమిలో కోళ్ల పెంటను ఎరువుగా వాడటం ద్వారా గత ఏడాది ఎకరానికి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలకు పత్తి ఎర్రబడిన 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
రైతు పగిళ్ల అంజయ్య ఎలికట్టే -చిట్యాల మండలం
కపాస్ యాప్‌ను తొలగించాలి
పంటను రైతులు అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతుంటే..మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సీసీఐ పత్తి కొనుగోళ్లను ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి ఏడు క్వింటాళ్లకు తగ్గించడం దారుణం. వెంటనే సీసీఐ నిబంధనలు సడలించి కపాస్ యాప్‌ను తొలగించాలి. గతంలో మాదిరిగా పత్తిని కొనుగోలు చేయాలి.
ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు



