నందిత దాస్… జన్ నాట్య మంచ్‌తో కలిసి వీధి నాటికలు వేస్తూ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అతితక్కువ చిత్రాలలో నటించినా అనతి కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, దర్శకురాలిగా, రచయితగా విభిన్నమైన చిత్రాలను అందించారు. కేవలం సినీ జీవితానికే పరిమితం కాకుండా పిల్లలు, మహిళల హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నారు. సమాజంలో మార్పుకోసం నిత్యం తపించే నటి ఈమె. సామాజిక సమస్యలను ప్రపంచం ముందు పెట్టేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించిన ఆమె పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా మానవిలో ఆమె పరిచయం క్లుప్తంగా…
నందిత దాస్ 1969, నవంబర్ 7న ముంబైలో పుట్టారు. ఢిల్లీలో పెరిగారు. తండ్రి జేతిన్ దాస్ కళాకారుడు, తల్లి వర్ష దాస్ రచయిత్రి. నందిత ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయ పాఠశాలలో చదువుకున్నారు. మిరాండా హౌస్ నుండి భౌగోళిక శాస్త్రంలో డిగ్రీని, స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుండి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశారు. చిన్న వయసు నుండే సమాజానికి ఏమైనా చేయాలనే తపన ఉండేది. ఆ తపనే ఆమెను సామాజిక సేవకురాలిని చేసింది. 2014లో ఆమె యేల్ వరల్డ్ ఫెలోగా ఎంపికయ్యారు. దాదాపు 4000 మంది దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేయబడిన 16 మంది వర్ధమాన ప్రపంచ నాయకులలో ఆమె ఒకరు. నందితా రిషి వ్యాలీ పాఠశాలలో కూడా ఉపాధ్యాయురాలిగా పని చేశారు.
నటనా జీవితం
నందిత తన చదువు పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని జన నాట్య మంచ్ అనే థియేటర్ గ్రూప్‌లో చేరారు. ఢిల్లీ వీధుల్లో, ఇతర ప్రదేశాలలో సామాజిక సమస్యల గురించి వీధి నాటకలు ప్రదర్శించేవారు. ఇలా నాటకాల ద్వారా ఆమె నటనా జీవితం మొదలయింది. మృణాల్ సేన్, ఆదుర్ గోపాల కృష్ణన్, శ్యాం బెన్ గాళ్, దీపా మెహతా, మణి రత్నం వంటి గొప్ప దర్శకులతో 40కి పైగా చిత్రాలలో నటించారు. మొదటి సారిగా ఆమె 1989లో ‘బ్యాంగిల్ బాక్స్’ అనే హిందీ టెలీఫిల్మ్‌లో కనిపించారు. ఆ తర్వాత అదే ఏడాది పరిణతి అనే హిందీ సినిమాలో నటించారు. ఆ తర్వాత 1995లో ‘ఏక్ తీ గూంజ్’లో గూంజ్ పాత్రలో కనిపించారు.
అనేక భాషల్లో
దీపా మెహతా దర్శకత్వం వహించిన ‘ఫైర్’ (1996), ‘ఎర్త్’ (1998 ఆమిర్ ఖాన్‌తో కలిసి), ‘బవందర్’ (జగ్మోహన్ ముంద్రా దర్శకత్వం), ‘నాలు పెన్నుంగల్’ (అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం) చిత్రాలలో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన భారతీయ-బ్రిటిష్ కాలపు నాటక చిత్రం ‘బిఫోర్ ది రెయిన్స్’లో కూడా ఆమె నటించారు. నందిత ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, ఉర్దూ, మరాఠీ, ఒడియా, కన్నడ ఇలా పది భాషల్లో నటించారు.
దర్శకురాలిగా…
2008లో తొలిసారిగా ఫిరాక్ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల వల్ల భారత దేశంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం ఇది. ఈ చిత్రం దేశవిదేశాలలో అనేక ప్రశంసలు అందుకుంది. తిరిగి పదేండ్ల విరామం తర్వాత 2018లో మెట్రో అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఉర్దూ రచయిత సాదత్ హసన్ మాంటో జీవితం ఆధారంగా నిర్మింపబడింది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రసిక దుగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2018లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.
విమర్శకుల ప్రశంసలు
2019లో నందిత దాస్ ‘ఇండియాస్ గాట్ కలర్’ అనే పీఎస్‌ఏ మ్యూజిక్ వీడియోను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ‘జ్విగాటో’. దీనిని ఆమె కంపెనీ నందితా దాస్ ఇనిషియేటివ్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి చాలా విమర్శనాత్మక ప్రశంసలు అందుకుంది. 2021లో ఆమె ‘విరాటపర్వం’ చిత్రంలో కనిపించారు.
రచయితగా…
నందిత రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు. ది వీక్ కోసం ది లాస్ట్ వర్డ్ అనే నెలవారీ కాలమ్ రాశారు. 2019లో దాస్ ‘మంటో అండ్ ఐ’ అనే హార్డ్‌బౌండ్ పుస్తకాన్ని రాశారు. ఇది ఆమె ఆరేండ్ల ‘మాంటో’ సినిమా నిర్మాణ ప్రయాణాన్ని వివరిస్తుంది. అంతేకాక దాస్ జతిన్ దాస్: ఎ రెట్రోస్పెక్టివ్ 1963-2023 అనే పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో కళాకారుడిగా ఉన్న ఆమె తండ్రి ప్రదర్శన సందర్భంగా విడుదలైంది. ఈ పుస్తకంలో అతని ఆరు దశాబ్దాల కెరీర్‌ను చూడవచ్చు. ఇందులో అతని కళాకృతులు, రచనలు, కళా పండితులు, స్నేహితుల వ్యాసాలు ఉన్నాయి. తన రచనల ద్వారా నందిత తన వ్యక్తిగత ఆలోచనలకు కళాత్మక వ్యక్తీకరణలతో మిళితం చేశారు. సినిమాలకు మించి ఆకర్షణీయమైన కథనాలను సృష్టించారు. అంతే కాదు ఆమె గాయకురాలు కూడా. వాయిస్ యాక్టర్‌గా కూడా పని చేశారు. 2005, 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా రెండు సార్లు ఆమె ఉన్నారు.
సామాజిక మార్పుకై
నందితా ఇనిషియేటివ్స్ ఎల్‌ఎల్‌పీ (ఎన్‌డీఐ)ను 2016లో స్థాపించారు. దీని ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక అంశాలను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. దీని మొదటి వెంచర్ ‘మాంటో’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 2019లో వర్ణ వివక్షను ఎత్తి చూపే ‘ఇండియాస్ గాట్ కలర్’ అనే మ్యూజిక్ వీడియోను నిర్మించారు. 2020లో ‘లిజన్ టూ హార్’ అనే 7 నిమిషాల నిడివి గల లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో లాక్ డౌన్ సమయంలో మహిళలు ఎదుర్కొన్న గృహ హింస, పని భారం గురించి తెలియచేశారు.
దీనికి యూనెస్కోతో పాటు యూఎన్ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అలాగే ‘జ్విగాటో’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇది 2022లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఇలా ఆమె దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ఏదో ఒక సామాజిక సమస్యతో ముడిపడినవే. అలాగే పిల్లలు, మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కూడా ఆమె తన గొంతు వినిపిస్తున్నారు. మీటూ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా కూడా ఆమె పని చేశారు.
- పాలపర్తి సంధ్యారాణి



