Friday, November 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమూసీకి ముప్పు..!

మూసీకి ముప్పు..!

- Advertisement -

మరమ్మతులు, నిర్వహణ పట్ల నిర్లక్ష్యం
క్రస్ట్‌ గేట్లు, డ్యాం గోడలు లీకేజీ
పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం
టెండర్లు పిలిచినా.. ఎవరూ ముందుకు రాని వైనం
రూ.4 కోట్ల ప్రతిపాదనలు

నవతెలంగాణ- నకిరేకల్‌
1954లో సోలిపేట గ్రామం వద్ద మూసీనదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 1963లో పూర్తి చేశారు. నాటి నుంచి 1987 వరకు ఎడమవైపు 41కిలోమీటర్లు, కుడివైపు 38 కిలో మీటర్ల పొడవునా మొత్తం 42 గ్రామాల రైతులకు 43 వేల ఎకరాలకు సాగునీరు అందేేది. స్కావర్‌ గేట్లను కాంక్రీట్‌తో శాశ్వతంగా మూసేసిన తర్వాత ఆయకట్టు 33వేల ఎకరాలకు పడిపోయింది. మూసీ ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి ఏటా సుమారు రూ.25 లక్షలు ఖర్చవుతోంది. గేట్‌ లీకేజీలు, జనపనార, గ్రీజు ఆయిల్‌ తదితరాలకు సుమారు రూ.13 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రాజెక్టు డ్యాంపై కరెంటు నిర్వహణ కోసం రూ.12 లక్షల వరకు వ్యయమవుతున్నది. గతంలో ప్రతి రాష్ట్ర బడ్జెట్‌లోనూ మూసీ నిర్వహణ కోసం నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులు ప్రతిపాదనలు పంపిస్తేనే నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్వహణ కష్టంగా మారింది.

టెండర్లు పిలిచినా.. ఫలితం శూన్యం..
మూసీ ప్రాజెక్టుకు 30 స్కావర్‌, క్రస్ట్‌, రెగ్యులేటర్‌ గేట్లు ఉన్నాయి. వీటిలో 10 స్కావర్‌ గేట్లను శాశ్వతంగా మూసేశారు. ఎనిమిది క్రస్ట్‌ గేట్లలో మూడు గేట్ల నుంచి నీరు లీకేజీ రూపంలో వాగులోకి వెళ్తోంది. రెండు దశాబ్దాలుగా గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతున్నా మరమ్మతులకు నోచుకోలేదు. మూసీ ప్రాజెక్టు డ్యాం గేట్ల తర్వాతి ప్రాంతంలో డ్యాం గోడల నుంచి కూడా నీరు లీకేజీ అవుతోంది. లీకేజీల వెంబడి చెట్లు పెరిగి ఆ గోడను మరింత బలహీన పరుస్తున్నాయి. మూసీ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ మరమ్మతులు, గేట్ల లీకేజీలు, డ్యాం రక్షణ గోడలలో గౌటింగ్‌, మరమ్మతులు తదితరాలకు రూ.75 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, టెండర్ల కోసం కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. త్వరలో మళ్లీ టెండర్‌ పిలిచే అవకాశముంది.

రూ.4 కోట్ల ప్రతిపాదనలకు మోక్షమెప్పుడో..?
గతంలో అతిథులు, పర్యాటకులతో కళకళలాడిన మూసీ ప్రాజెక్ట్‌ అతిథి గృహం నేడు వెలవెలబోతోంది. ఆ గృహానికి మరమ్మతులు, గేట్లకు రంగులు, ఇతర మరమ్మతుల కోసం అధికారులు సుమారు ఐదు నెలల కిందట రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు.

స్కావర్‌ గేట్ల మూసివేతతో పెరిగిన పూడిక
మూసీ ప్రాజెక్టులోని పూడికను ఎప్పటికప్పుడూ తొలగించేందుకు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్పిల్‌వే అడుగు భాగంలో 10 స్కావర్‌ గేట్లు ఏర్పాటు చేశారు. వరద భారీగా వచ్చినప్పుడు వీటిని తెరవడం ద్వారా పూడికను దిగువకు పంపించే వీలుండేది. వీటిని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల గతంలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒక్కటైన మూసీ ప్రమాదపుటంచుల్లో కెళ్తోంది.. ఏటా పూడిక పేరుకుపోవడంతోపాటు క్రస్ట్‌ గేట్లు, డ్యాం గోడల నుంచి లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. బడ్జెట్‌ కేటాయింపుల్లేక నిర్వహణ కష్టంగా మారింది. 10 స్కావర్‌ గేట్లను శాశ్వతంగా మూసేయడంతో పూడిక తొలగింపునకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా క్రమంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గి.. ఆయకట్టు కూడా తగ్గుతోంది.

రూ.4కోట్లతో ప్రతిపాదనలు పంపించాం..
మూసీ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఇటీవల రూ.75లక్షలతో శాంక్షన్‌ ఆర్డర్స్‌ మంజూరయ్యాయి. ఎస్టిమేషన్‌ వేశాం. టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి టెండర్లు పిలుస్తాం. ప్రాజెక్టు అతిథిగృహం గేట్లకు రంగులు, తదితర మరమ్మతుల కోసం రూ.4కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలో రూ.2కోట్లు మంజూరయ్యే అవకాశముంది. –మూసీ ప్రాజెక్టు ఏఈ మధు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -