వివోఏల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మప్ప
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
దరూర్ మండలం రేవులపల్లి గ్రామ వివో ఏ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐకేపి వివోఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయు అనుబంధం) జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి సంఘాల తిమ్మప్ప అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరూర్ మండలం రేవులపల్లి గ్రామ వివో ఏ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వి ఓ ఏ ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
శుక్రవారం రేవులపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించకుండా అడ్డుకోవడమే కాక రైతులకు సైతం ఇబ్బందులు కలిగించారని అన్నారు. గతంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వహణ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వివో ఏ పై దుష్ప్రచారం చేస్తున్నారని కొనుగోలు సెంటర్ నిర్వహణ కేవలం వివోఏ ఆధ్వర్యంలోనే నడవదని ఐకెపి కి సంబంధించిన అధికారులు, మహిళా సంఘాల బాధ్యుల సమక్షంలో సెంటర్ల నిర్వహణ జరుగుతుందని గత సంవత్సరంలో జరిగిన సెంటర్ నిర్వహణకు సంబంధించి అధికారులు ఆడిట్ కూడా నిర్వహించారని ఆడిట్ లో అవినీతి జరిగినట్లుగా ఎలాంటి ఆరోపణలు రాలేదని సెంటర్ నిర్వహణ పారదర్శకంగా జరిగిందని, కానీ ఇప్పుడు కావాలనే దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు వివో ఏ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా అబద్ధమని అన్నారు.
వివో ఏ దళితుడు అయినందున కులం తక్కువ వాడితో మేము ఎలా కలిసి ఉండాలి అనే అక్కసుతో కొందరు కుట్రపన్ని ఇలా ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చట్టపరంగా ముందుకు వెళ్తామని సంఘం ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు. వివో ఏ పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ వివోఏ కు వ్యక్తిగతంగా పరువు నష్టం కలిగించేలా మీడియాలో అబద్ధాలు మాట్లాడుతూ వ్యక్తిగత పరువుకు భంగం కలిగించడం సరైనది కాదని హితవు పలికారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏమైన పొరపాట్లు జరిగి ఉంటే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేతనాలు రాకున్నా ప్రభుత్వ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నామని అటువంటి తమపై కక్ష కట్టి రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి సంఘాల తిమ్మప్పతోపాటు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు లక్ష్మన్న, జావేద్ తదితరులు పాల్గొన్నారు.



