ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు, ఆఫీస్ పనితో సమయం దొరకడం లేదన్నావు. తప్పదు నాన్న.. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. కష్ట పడితేనే వృద్ధిలోకి వస్తావు. ఇది మీరు కష్టపడే వయసు.
సరే కిందటి ఉత్తరాల్లో సైబర్ క్రైమ్ గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పబోయేది ఇంచుమించు అలాంటిదే కానీ, కొంచం భిన్నం. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటికి కొరియర్లు, స్పీడ్ పోస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అనేది వచ్చాక ఇల్లు కదలకుండా కావలసింది తెప్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు బాగానే ఉంటుంది. వారికి వచ్చిన కొరియర్, లేదా తెప్పించుకున్న వస్తువుల పైన చిరునామా, ఫోన్ నెంబర్స్ రాసి ఉంటాయి. వాటిని అలాగే బైటపారేస్తారు. దీనివల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటాం. అదెలా అంటే ఈ మధ్య నా దృష్టికి ఒక సంఘట వచ్చింది. ఎవరో ఒకతను ఒక అమ్మాయికి ఫోన్ చేసేవాడు, ఆ అమ్మాయికి అతను ఎవరో తెలియదు. ఆ పేరుతో తెలిసిన వాళ్ళు లేరు. ‘ఎవరు మీరు’ అంటే ‘నేను నీకు తెలుసు’ అని ఫోన్ పెట్టేసేవాడు.
ఇలా దాదాపు రోజు ఏదో ఒక నెంబర్ నుండి ఫోన్ చేయడం, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం. ఇంటికి ఒక రోజు ఉత్తరం వచ్చింది. దాంతో ఆ అమ్మాయి చాలా భయపడి ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్ళు అతన్ని పట్టు కుందామని ప్రయత్నించినా ఫలితం లేదు. తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే అతనికి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయికి వచ్చిన ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో లిస్ట్ తీసి ఆయా ప్రాంతాలకు వెళ్లి వాకబు చేసి మొత్తానికి అతన్ని పట్టుకున్నారు. అతను చెప్పిన విషయం అందరికి కనువిప్పు కలిగించింది. కొరియర్ మీద చిరునామా ఉండటంతో ఏదో సరదాకు ఏడిపిద్దామని అనుకున్నాడట.
నీకు గుర్తుందా.. నీ చిన్నప్పుడు నాన్న ఒక సారి చెప్పారు, నోట్ బుక్స్ అమ్మేటప్పుడు వాటి మీద ఉన్న నీపేరు, స్కూల్ పేరు, తరగతి ఇవన్నీ చింపి వేయమని. ఆ రోజున నాన్న అలా చెప్పడం మంచిదే అయింది. ఇప్పుడు నువ్వు ఏది తెప్పించుకున్నా ముందు పార్శిల్ వచ్చిన కవర్స్ చింపివేస్తుంటావు. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే మన చిరునామాతో వచ్చిన ఏ పార్సెల్ కవర్ అయినా సరే పారేసే ముందు దానిమీద ఉన్న చిరునామా, ఫోన్ నెంబర్ వంటివి చింపివేసి అప్పుడు బైట పారేయండి. ఇలాంటి ఆకతాయిలకు వివాహితలు, అవివాహితలు అనేది ఉండదు. అదే వివాహిత అయితే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది. భర్త మంచివాడు అయ్యుండి, అండగా నిలబడే వాడు అయితే పర్వాలేదు. లేకుంటే తనలో తాను కుమిలి పోవల్సిందే. సరే నాన్న.. ఉంటాను. ఎటువంటి సమస్యలు ఎదురైన ధైర్యంగా ఉండటం నేర్చుకో..
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి


