క్రికెట్ అంటేనే పురుషుల ప్రపంచం. ‘అమ్మాయిలా వాళ్లేం ఆడతారు’ అంటూ కామెంట్లు చేసేవారు ఎందరో ఉన్నారు. అసలు మహిళల క్రికెట్ టీం అంటేనే చిన్నచూపు, సౌకర్యాలు కరువు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు నడిచారు. నేడు ప్రపంచ వేదికపై దేశం గర్వంగా నిలబడేలా చేశారు. మన మహిళా క్రికెట్ టీం విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో ఏండ్ల కలలను నిజం చేసింది. ఇది కేవలం 16 మంది అమ్మాయిలు సాధించిన విజయం మాత్రమే కాదు. మరెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన క్షణం. ఈ విజయానికి నేతృత్వం వహించిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ పరిచయం నేటి మానవిలో…
ఇది ఆరంభం మాత్రమే
హర్మన్‌ప్రీత్ 1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగాలో జన్మించింది. ఆమె తండ్రి హర్మిందర్ సింగ్ భుల్లర్ క్రికెట్ ఆడేవాడు. అలా తన తండ్రి క్రికెట్ ఆడడం చూసి తాను కూడా అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది. అలా మోగా జిల్లాలోని మట్టిబయళ్లలో బ్యాట్ పట్టుకుంది చిన్నారి హర్మన్. ఎంతో ఆసక్తితో క్రికెట్ ఆడుతూ, భారీ షాట్లు కొడుతున్న కూతురికి ఆటలోని ఎన్నో మెళకువలను స్వయంగా ఆయనే నేర్పించాడు. అలా తండ్రి ఆమెకు మొదటి కోచ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆమెలోని ప్రతిభను గుర్తించి స్థానిక పాఠశాలలో కోచ్ కమల్‌దీప్ సింగ్ సోధీ వద్ద చేర్పించి కోచింగ్ ఇప్పించాడు. క్రీడాకారిణిగా ఎదిగే కొద్ది ఎన్నో ఒడిదుడులుకు ఎదుర్కొంది.
పంజాబ్, రైల్వే క్రికెట్ జట్టు తరఫున ఆడిన తర్వాత హర్మన్‌ప్రీత్ 2009లో 19 ఏండ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. 2017 ఆగస్టు 29న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది. ఐసీసీ మహిళా వన్డే కప్ – 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు ఆమె వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలి రాజ్ 2022 జూన్ 8న రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను టీమిండియా మహిళా కెప్టెన్‌గా ఎంపికయ్యింది.
మధురమైన క్షణాలు
2025లో భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు భారత్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌ప్రీత్ మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. సుమారు 43 ఏండ్ల భారత అభిమానుల కలను ఆమె సారథ్యంలోని భారతజట్టు సాకారం చేసింది. ప్రపంచ కప్ గెలిచిన ఆ మధురమైన క్షణాలను ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క ప్లేయర్ సంబరాల్లో మునిగిపోయారు. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ మాత్రం నేరుగా ప్రేక్షక గ్యాలరీ వైపు పరిగెత్తింది. అక్కడ ఆమె తండ్రిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. తన కుమార్తెను ఎత్తుకుని తండ్రి ఆనందంతో ఆమెను తిప్పుతుండగా, చుట్టుపక్కల నిండిన హర్షధ్వనులు ఆత్మీయ బంధాన్ని మరింత మధురంగా మార్చాయి. ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని నిలబెట్టిన బిడ్డను చూసి ఆ తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
రాబోయే రోజుల్లో…
టీం ఇండియా గెలిచిన తర్వాత ‘విశ్వవిజేతగా నిలించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. రాత్రి, పగలూ శ్రమించిన మా జట్టుకు విశ్వవిజేతలుగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. ప్రతి ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం గురించి చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్‌లో వారిపై నమ్మకం ఉంచాం. ఇది ఆరంభం మాత్రమే మున్ముందు ఇలాంటి విజయాలు అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి. మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ఆమె పంచుకుంది.
ఆమె కెప్టెన్ అద్భుతం
ప్రపంచ కప్ లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు హర్మన్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యూహాత్మక ప్రణాళికలు వేసి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆమె సఫలమైంది. ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీతో బౌలింగ్ వేయించడమే దీనికి ఉదాహరణ. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 89 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్‌కి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్ మ్యాచ్‌లో హార్మన్‌ప్రీత్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో టీమిండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
ట్రోలింగ్‌కు బ్యాట్‌తో సమాధానం
సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్స్‌తో విజృంభించేవారు. ‘మైదానంలో ఎప్పుడూ రీల్స్ చేసుకుంటూ ఉంటే ఇక ఆడేదెప్పుడు? నిన్ను అనవసరంగా జట్టులో ఉంచారు’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేసేవారు. ఇలా ఎన్నో మాటలు పడ్డ జెమీమా రోడ్రిగ్స్ నేను వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై భారత్ అద్వితీయమైన విజయం సాధించడంలో కెప్టెన్ హార్మన్‌తో పాటు కీలకపాత్ర పోషించింది. ఆమే జెమీమా రోడ్రిగ్స్ . అసాధ్యమైన టార్గెట్‌ను ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన ఆసీస్‌పై 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆ క్షణంలో అభిమానులు తనపై చూపిన ప్రేమకు ఆమె కన్నీళ్లు కార్చేసింది. మ్యాచ్ విజయం అనంతరం మైదానమంతా కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేసింది. ఒకనాడు ఆమెను జట్టులో వద్దన్నవారే నేడు నువ్వు ఉండాల్సిందే అనే స్థాయికి ఎదిగింది. ట్రోల్ చేసే వారికి తన బ్యాట్‌తో సమాధానం చెప్పింది.
జెమీమా 2000, సెప్టెంబర్ 5న మహారాష్ట్ర, ముంబైలోని భాండప్‌లో పుట్టింది. ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు. తన నాలుగేండ్ల వయసులోనే సీజన్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. ఆటలో ఆమె మరింత రాణించేందుకు తాము ఉన్న చోట సౌకర్యాలు అంతగా లేకపోవడంతో బాంద్రా వెస్ట్‌కు కుటుంబం మారిపోయింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమెకు పాఠశాలలో కోచ్. తన అన్నలతో బౌలింగ్ చేస్తూ పెరిగింది. ఆమె ముంబైలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్‌లో చదువు కుంది. రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో సైన్స్ అండ్ కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. మొదటి నుండి ఆమెకు శిక్షణ ఇస్తున్న తండ్రి తన పాఠశాలలోనే ఒక బాలికల క్రికెట్ జట్టును తయారు చేశాడు. జెమీమా చిన్నతనం నుండే హాకీ, క్రికెట్ రెండూఆడేది.
మంచి క్రీడాకారిణిగా
జెమీమా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో దక్షిణాప్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి భారత జట్టుకి ఆమె ఎంపికయింది. అదే ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా మహిళలపై భారత మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఎంపికయింది. టోర్నమెంటుకు ముందు జట్టులో మంచి క్రీడాకారిణిగా పేరు పొందింది. టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌చే జట్టులో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికయింది.
ఎంతో యాక్టివ్
జెమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. ఫీల్డింగ్‌లో ఈమెకు మంచి నైపుణ్యం ఉంది. చాలా మంది ఈమెను జాంటీ రోడ్స్‌ను గుర్తుతెచ్చేలా నీ ప్రదర్శన ఉంది అంటుంటారు. క్రికేట్‌లోనే కాకుండా జెమీమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ కూడా ఆడుతుంది. సోషల్ మీడియాలో అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు సుమారు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గిటార్ వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం.
– సలీమ
మాకు అన్ని అర్హతలూ ఉన్నాయి
- Advertisement -
- Advertisement -



