కోనసీమ ప్రకతి సౌందర్యాలకు పెట్టింది పేరు. పాడిపంటలతో విలసిల్లే బంగారు ధామం. ఆది రాయుడు చేను. పండే పంటలకు కొదవలేదు. భూగర్భ జలాలకు లోటు లేదు. ఫ్యాషన్ దష్ట్యా, నాగరికతకు లోనయి, పల్లెటూరి యువత పట్నాలకు, విదేశాలకు వలస బాట పడుతున్నా, పెద్దలు ఆ ఊరిని విడవటానికి ఇష్టపడరు. ఎందుకంటే గోదావరి ఒడ్డు వారికంత ప్రీతికరం.
ఆ ఊరికి అలవాటు పడిన వారు తప్తిగా జీవనం వెళ్లదీయటానికి కారణం ఉదయం వేళ సూర్యోదయం. సాయంత్రం వేళ తనువు తాకి ఆహ్లాదాన్ని కలుగ చేసే చల్లని గాలులు. ఆ ఊరిలో బతికే వారికి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆ ఊరికి పెద్ద మోతుబరి రాయుడునే! అందరికీ హితవులు చెపుతాడు కానీ, ఎగిరిపోయే యువతను మాత్రం ఆపలేడు. ”అదేమిటి రాయుడు గారూ! ఇక్కడ వ్యవసాయానికి లోటు లేదు. వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఏదో వ్యామోహంతో పిల్లలు అలా వెళ్ళిపోతుంటే మీరు చెప్పొచ్చు కదా!” అడిగాడు ఆ ఊరిలో అంతో ఇంతో బాగానే వ్యవసాయం కలిగిన విశ్వనాథం.
” చూడు విశ్వం.. ఆ పక్షులు చూడు ఎలా ఎగురుతున్నాయో? వాటికి రెక్కలు వచ్చాయి. వాటికి అలా ఎగరటమే అందం. మనం పాత తరం వాళ్ళం. ఈ ఊరిని అంటిపెట్టుకోక తప్పదు. నాకు అయితే, నా తుదిశ్వాస ఇక్కడనే వదలాలని కోరిక. అప్పటికీ అమెరికాలో ఉన్న అమ్మాయి, హైదరాబాద్‌లో ఉన్న అబ్బాయి మమ్మలిని వచ్చెయ్యమంటారు. అయితే అలా వెళ్లడం మాకు ఇష్టం లేదు” తేల్చి చెప్పాడు రాయుడు. ”నిజమే రాయుడు గారూ! నేను మీ అంత ఆసామిని కాకపోయినా, నాకూ బాగానే వ్యవసాయం ఉంది. ఒంట్లో శక్తి ఉంది. అందుకే నేనే అరక దున్నుతాను. నాకు అదో తప్తి. మా అబ్బాయి కూడా మమ్మల్ని హైదరాబాద్‌కు రమ్మంటున్నారు. ఇంకొక విషయం తెలుసా? ఈ వ్యవసాయాన్ని అమ్మెయ్యాలట! తప్పుకదూ!?” చెప్పాడు విశ్వనాధం. ”నిజమే… ఆ కత్రిమ జీవితం, జీవనం మనకు వద్దులే విశ్వం. అయినా పిల్లలు ఏడాదికో రెండుసార్లు వస్తున్నారు. కొద్ది రోజులు ఉంటున్నారు. అది చాలు..” చప్టాబండ మీద నుంచి లేస్తూ చెప్పాడు రాయుడు.
జనవరి మాసం. సంక్రాంతికి నాలుగు రోజుల ముందునుంచే ఆ ఊరు కళకళ లాడసాగింది. వలస వెళ్లిన వాళ్లు తమ తమ భార్యలతో, పిల్లలతో ఆ ఊరుకు వచ్చారు. గుంభనంగా నవ్వుకుంటున్న రాయుడిని అడిగింది కోడలు స్వప్న. ”ఏమిటి మామయ్యా? మీలో మీరే నవ్వుకుంటున్నారు..” అని. ”ఏమీ లేదమ్మా! ఈ ఊరికి ఒక సీజన్‌లో ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఇది ప్రతి ఏటా జరుగుతుంది. అప్పుడు ఈ ఊరికి పర్యాటకుల సందడి బాగా ఉంటుంది..” ఆగాడు. ”అంటే, మేం కూడా…” నవ్వసాగింది స్వప్న. ”లేదమ్మా, నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు..” నవ్వుతూనే సర్ది చెప్పబోయాడు రాయుడు. ” ఏదో మా పిల్లల చదువుల కోసం, ఈ వ్యవసాయపు లోతులు తెలియక అక్కడ ఉంటున్నాం కానీ, మా మనసంతా ఇక్కడే ఉంటుంది మామయ్యా! ఇక్కడ పలకరించే గాలి స్వచ్ఛత, నీటి శుభ్రత మాకు ఎక్కడ ఉంది?” ఆర్థ్రతగా చెప్పసాగింది స్వప్న.
”ఇక్కడ పలకరింపులు ఎంత కల్మష రహితంగా ఉంటాయో! అక్కడ ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, ఎవరు ఎటువంటి వారో తెలియదు. అదో మేడిపండు జీవితం.. మీ అబ్బాయి మిమ్మల్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ అవమన్నపుడు, నేను ఎదురు చెప్పలేక పోయాను. అయితే మాకు మీరు ఇక్కడనే ఉండాలని కోరిక. ఈ పైరగాలిని ఆస్వాదించే నెపంతో మేం ఇక్కడ వాలాలి. అదే పక్షుల్లా..” చణుకు విసిరింది స్వప్న. బయట పిల్లలు రకరకాల ఆటలు ఆడుతుంటే మురిసిపోయింది ఆమె. కొద్దికాలం అయినా ఆ సెల్ ఫోన్, కంప్యూటర్ల చెర పిల్లలకు వీడినందుకు.
పంతంగి శ్రీనివాస రావు, 9182203351



