Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంఅది ప్రభుత్వ భూమే…ప్రయివేట్‌ ఆస్తి కాదు

అది ప్రభుత్వ భూమే…ప్రయివేట్‌ ఆస్తి కాదు

- Advertisement -

అజిత్‌ పవార్‌ తనయుడి కొనుగోలుపై కొనసాగుతున్న దర్యాప్తు

ముంబయి : పూనేలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌ కొనుగోలు చేసిన 40 ఎకరాలభూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదేనని, అది ప్రైవేటు ఆస్తి కాదని రాష్ట్ర రిజిస్టేషన్ల జాయింట్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర ముథే స్పష్టం చేశారు. భూమి అమ్మకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న కమిటీకి ఆయన సహాయకారిగా వ్యవహరిస్తున్నారు. పూనేకు చెందిన ఓ వ్యక్తి, పవర్‌ ఆఫ్‌ అటార్నీ హోల్డర్‌ శీతల్‌ తేజ్వానీ ఈ భూమిని పార్థ్‌ పవార్‌, దిగ్విజయ్ పాటిల్‌లకు విక్రయిం చాడు. ఈ లావాదేవీపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ భూమికి ప్రభుత్వమే యజమాని అని డాక్యుమెంట్‌ చెబుతోందని, 2018 తర్వాత జారీ చేసిన ఆస్తి కార్డులో కూడా అదే ఉన్నదని ముథే తెలిపారు. అన్ని అంశాల పైన విచారణ జరుపుతున్నామని, వారం రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు.

పవార్‌-పాటిల్‌ భాగస్వామ్య సంస్థ అయిన అమదియా ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ మే 19న రూ.300 కోట్ల రూపాయలకు తేజ్వానీతో సేల్‌ డీడ్‌ కుదుర్చుకుంది. ఈ భూమికి యజమానులైన 272 మంది తరఫున తేజ్వానీ పవర్‌ ఆఫ్‌ అటార్నీ పొందాడు. ఇది ఎస్సీలకు (అప్పుడు మహర్‌లు) చెందిన వతన్‌ భూమి. స్వాతంత్య్రానికి ముందు రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో వతన్‌ వ్యవస్థ అమలులో ఉండేది. కొన్ని కులాలు లేదా కుటుంబాలు తాము అందించిన సేవలకు నగదుకు బదులు భూమిని లేదా రెవెన్యూ హక్కులను పొందే వారు. కాగా ఈ భూమిలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు అమదియా ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ అనుమతి కూడా పొందింది. అయితే ప్రస్తుతం ఈ భూమి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ)కి లీజుకు ఇచ్చారు.

అక్కడ ఓ బోటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని బీఎస్‌ఐ ప్రతిపాదించింది. ఈ లీజు కాలం 2038లో కానీ పూర్తి కాదు. ఆ తర్వాత ఆ భూమి తిరిగి యజమానికి చెందుతుంది. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని సేన-బీజేపీ ప్రభుత్వం ఈ కంపెనీకి స్టాంప్‌ డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు ఇచ్చింది. కూటమితో అజిత్‌ పవార్‌ చేతులు కలపడానికి రెండు నెలల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా మహర్‌ వతన్‌ భూ ఒప్పందంపై నమోదు చేసిన క్రిమినల్‌ కేసు కొనసాగుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెప్పారు. భూ ఒప్పందం కుదిరినప్పటికీ నగదు లావాదేవీ పెండింగులో ఉన్నదని తనకు తెలిసిందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని రెండు పక్షాలు కోరాయని, అయినప్పటికీ వారు చెల్లింపులు జరపాల్సిందేనని అన్నారు. ఈ కేసుతో సంబంధమున్న ఎవరినీ వదలబోమని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -