బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘటన
ప్రతిపక్షపార్టీల అనుమానాలు
ఎన్నికల అధికారి సస్పెన్షన్ ఔ
పాట్నా: బీహార్‌లో పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 6న ఆ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు పడేశారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ను ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ షేర్ చేసింది. ఈ స్లిప్పులను ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాల మేరకు పడేశారు? అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యకు పాల్పడినట్టు ఆరోపించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఈసీని నిలదీసింది.
అలాగే ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రతను పెంచాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. మరోవైపు ఈ సంఘటనపై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను పరీక్షించేటప్పుడు మాక్ పోలింగ్ కోసం వినియోగించిన స్లిప్స్ అని తెలిపింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపినట్టు పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌వో)ను సస్పెండ్ చేసినట్టు వివరించింది. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైనట్టు ఈసీ స్పష్టం చేసింది.
రోడ్డుపై పోల్ స్లిప్స్ పారవేత
- Advertisement -
- Advertisement -



