భారత ఉద్యోగుల తీరు
‘ఇండీడ్’ తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : భారత ఉద్యోగుల పని తీరును కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా మార్చేస్తున్నది. ఈ ఏఐ అనేది.. వారిలో జీతం, పని ఒత్తిడి అనే అంశాల కంటే ఎక్కువగా ప్రభావం చూపుతున్నది. భారత ఉద్యోగులు.. జీతం కంటే ఏఐకే ప్రాధాన్యతనిస్తున్నారు. అంటే.. ఏఐతో ఎలా స్మార్ట్‌గా పని చేయగలను అనే విషయం గురించి వారు ఆలోచిస్తున్నారు. ఇండీడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన 2025 వర్క్‌ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ గ్లోబల్ జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ చేసిన సర్వేలో 14 రంగాలకు చెందిన 3,872 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 1288 మంది ఎంప్లాయర్లు కాగా.. 2584 మంది ఎంప్లాయీస్ ఉన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 71 శాతం మంది ఉద్యోగులు ఏఐను వాడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం, కెరీర్ ప్లాన్ చేసుకోవడం కోసం, కొత్త ఐడీయాలను పరీక్షించటం కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. ఇక ఉద్యోగులలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. స్కిల్ నొమాడిజం.. అంటే తరచూ ఉద్యోగాలు, నైపుణ్యాలు మార్చుకుంటూ ఉండే పద్ధతి కనిపించింది. కొంత మంది మైక్రో రిటైర్మెంట్స్.. అంటే చిన్న విరామాలు తీసుకొని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, వ్యక్తిగత ప్రాజెక్టులు చేయటం వంటివి కూడా చేస్తున్నారు. ఇంకొందరు మూన్‌లైటింగ్.. అంటే ప్రధాన ఉద్యోగంతో పాటు సైడ్ జాబ్స్ చేసుకోవడం వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ‘బేర్ మినిమమ్ మండేస్’ అనే పద్దతిని అవలంబించి వారంలో మొదటి రోజును నెమ్మదిగా ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ధోరణులు ఎక్కువగా యువతలో కనిపిస్తున్నాయి.
68 శాతం మంది జూనియర్ స్థాయి ఉద్యోగులు కొత్త కెరీర్ వ్యూహాలను పరీక్షిస్తున్నారు. ఉద్యోగులో 62 శాతం మంది ఈ మార్పులను ‘పరిణాత్మక’ దిశగా చూస్తున్నారు. కానీ.. 42 శాతం మంది యజమానులు (ఎంప్లాయర్స్) మాత్రం వీటిని ‘ఉత్సాహం తగ్గిపోవడం’గా భావిస్తున్నారు. ఉద్యోగులలో 43 శాతం మంది పనిలో స్వేచ్ఛ (ఫ్లెక్సిబిలిటీ)ను, 37 శాతం మంది ఒత్తిడి తగ్గడాన్ని, 30 శాతం మంది భద్రతను ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ముఖ్యంగా యువ ఉద్యోగులు జీతం, పదోన్నతి కంటే ‘అభ్యాసం, అనుకూలత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్’లను విజయ సూచికలుగా భావిస్తున్నారు. ఉద్యోగులు పనులను సమర్థవంతంగా చేయడమే కాకుండా.. కెరీర్ దిశను నిర్ణయించుకోవడంలో కూడా ఏఐపై ఆధారపడుతున్నారు.
ఏఐకే ప్రాధాన్యం
- Advertisement -
- Advertisement -



