– నల్లధనం నేరగాళ్లను దేశం దాటించారు
– రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు
– రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ పక్కా
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
– మహేశ్వరంలో మెడికల్ కాలేజీ, కల్వకుర్తిలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
నవతెలంగాణ-కందుకూరు/కల్వకుర్తి
ప్రధాని మోడీ చెప్పేవన్నీ కల్లబొల్లి కథలేనని, చేసేదేమీ లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. విదేశాల్లో నుంచి నల్లధనం తెచ్చి, ఒక్కో అకౌంట్‌లో రూ.15లక్షలు వేస్తానని చెప్పిన మోడీ, దేశాన్ని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించాడని విమర్శించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు, ఆమనగల్, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలాల్లో ఆయన పర్యటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో రూ.150 కోట్ల నిధులతో మెడికల్ కళాశాల, 450 పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణం, టీఎస్‌ఐఐసీ రూ.143.70 కోట్ల నిధులతో ఫార్మాసిటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 99 సర్వే నెంబర్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆయన ఆదివారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో గతంలో 2,088 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ప్రస్తుతం 10,000 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తారని అంటున్నారని ఆరోపించారు. మూడు గంటల కరెంటు కావాలా.. మూడు పంటలు పండించే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా.. అని ప్రజలు తెల్చుకోవాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో మహేశ్వరం, ఇబ్రహీంప ట్నం నియోజకవర్గాలకు సాగు నీరు అందుతుంద న్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. నియోజకవర్గంలోని ఆమనగ ల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలను కేసీఆర్ నాయకత్వం లో ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని వారి గురించి పట్టించుకునే అవసర ం లేదన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు. కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.