ముగిసిన ఎన్నికల ప్రచారం
బరిలో 1302 మంది అభ్యర్థులు
3.70 కోట్ల మందికి పైనే ఓటర్లు..
పిప్రా అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి రాజమంగల్ ప్రసాద్ కుష్వాహా ప్రచారం
రాంచీ: బీహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల 11న(మంగళ వారం)) 20 జిల్లాల పరిధిలోని మిగితా 122 సీట్లకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.70 కోట్లకుపైగా ఓటర్ల చేతిలో భవితవ్యం తేలనున్నది. రెండో విడత జరగనున్న పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 1650 భద్రతాబలగాల కంపెనీలను మోహరించనున్నట్టు బీహార్ డీజీపీ వివరించారు. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్ జరిగింది. ఈసారి అధికార ఎన్డీయే, మహాగట్ బంధన్ మధ్య గట్టిపోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హౌరా హౌరీగా ప్రచారం నిర్వహించాయి.
ఎన్డీయే తరఫున ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. మహాగట్ బంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకా గాంధీ, ఆర్జేడీ అగ్రనేత, మహాగట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. చివరిరోజు సీపీఐ(ఎం) అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. అభ్యర్థుల వెంట పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలతో..సీపీఐ(ఎం) గెలిస్తే…ప్రజాసమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని ఓటర్లను అభ్యర్థించారు. ఈనెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
సరే అనేది ఓట్‌చోరీని కప్పిపుచ్చే ప్రయత్నం ఈసీ,బీజేపీ కలిసి వేసిన స్కెచ్ ఇది : రాహుల్ గాంధీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ అనేది ఓట్ల చోరీని కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు. దీంతో ఓట్ల చోరీని సంస్థాగతం చేస్తున్నారని తెలిపారు. హర్యానాలో మాదిరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు చేశారు.
‘ఓట్ల దొంగతనం ఒక ప్రధాన సమస్య. ఇప్పుడు సర్ ప్రక్రియ దానిని కప్పిపుచ్చి, అధికారికంగా గుర్తింపు ఇవ్వడానికే ఉద్దేశించింది. కొద్ది రోజుల క్రితం నేను హరియాణా ఎన్నికలపై ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. అక్కడ ఓటు చోరీ జరిగినట్టు నేను స్పష్టంగా చూశా. సుమారు 25 లక్షల ఓట్లు దొంగలించారు.అంటే ప్రతి 8 ఓట్లలో ఒకరిది నకిలీ ఓటు. ఆ డేటా చూసిన తర్వాత నేను నమ్ముతున్నా. అదే విధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఓటు దోపిడీ జరిగింది. ఇది బీజేపీ, ఈసీ కలిసి రూపొందించిన వ్యవస్థ. మా వద్ద ఇంకా చాలా వివరణాత్మక సమాచారం ఉంది. ఇప్పటివరకు కొంత మాత్రమే చూపించాం. తగిన సమయానికి మిగతా ఆధారాలను కూడా బయటపెడతాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం
‘ప్రజాస్వామ్యంపై సర్‌తో నేరుగా దాడి జరుగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కలిసి ఈ చర్యను సమన్వయం చేస్తున్నారు. ఫలితంగా దేశం తీవ్రంగా నష్టపోతోంది. భారత మాతకు నష్టం జరుగుతోంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బీహార్? మార్పు కోసమే ప్రజలు ఓటు వేశారు : తేజస్వీ యాదవ్
బీహర్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ విజయం సాధిస్తుం దని సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు మార్పు కోసం ఓటేశారని, నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో కూడా అదే చేస్తారని అన్నారు. చివరి రోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో తేజస్వీ యావద్ మాట్లాడుతూ ప్రధాని మోడీని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉన్న 17 నెలల సమయంలో ఇచ్చిన రిజర్వేషన్ గురించి ప్రధాని గానీ, మరెవరైనా మంత్రులు గానీ మాట్లాడటం లేదని అన్నారు. ప్రజలకు లభించాల్సిన 65 శాతం రిజర్వేషన్‌ను ప్రధాని ఇవ్వలేదని విమర్శించారు. ఆయన బీహార్‌కు, గుజరాత్‌కు ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘బీహార్‌లో చొరబాటుదారుల కారిడార్ ప్రతిపక్షాలపై అమిత్ షా ఆరోపణ
బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ప్రతిపపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ బీహార్‌లో పారిశ్రామిక కారిడార్ నిర్మించాలని అనుకుంటూ ఉంటే, మహాగట్‌బంధన్ కూటమి మాత్రం చొరబాటుదారుల కోసం కారిడార్ నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ”ఇటీవల రాహుల్ గాంధీ, లాలూ కుమారుడు (తేజస్వి యాదవ్?) బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టారు. దీని ప్రధాన లక్ష్యం బిహార్?లో నివసిస్తున్న పేదలు, దళితులు, ఈబీసీల జీవితాల్లో మార్పు తీసుకురావడం కాదు, కేవలం చొరబాటుదారులను రక్షించడం. వాస్తవానికి ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. అని అమిత్‌షా ఆరోపించారు.



