Tuesday, November 11, 2025
E-PAPER
Homeఆటలుసూపర్‌కింగ్స్‌కు సంజు శాంసన్‌?

సూపర్‌కింగ్స్‌కు సంజు శాంసన్‌?

- Advertisement -

రాయల్స్‌కు రవీంద్ర జడేజా, శామ్‌ కరణ్‌!
ఐపీఎల్‌లో అతిపెద్ద డీల్‌కు రంగం సిద్ధం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అతిపెద్ద ఆటగాళ్ల ట్రేడ్‌ డీల్‌కు రంగం సిద్ధమైంది. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజు శాంసన్‌.. 2012 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో అంతర్బాగమైన రవీంద్ర జడేజాలు 2026 ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త ప్రాంఛైజీ తరఫున బరిలోకి దిగనున్నారు. సంజు శాంసన్‌ను తీసుకోనున్న సూపర్‌కింగ్స్‌.. బదులుగా రాయల్స్‌కు రవీంద్ర జడేజా, శామ్‌ కరణ్‌ను బదిలీ చేయనుంది. ఈ డీల్‌కు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.

నవతెలంగాణ-ముంబయి
ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాళ్ల ట్రేడ్‌ డీల్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ సంజు శాంసన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇవ్వనున్న రాజస్తాన్‌ రాయల్స్‌.. బదులుగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేస్‌ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరణ్‌లను తీసుకోనుంది. ఇటు చెన్నై సూపర్‌కింగ్స్‌, అటు రాజస్తాన్‌ రాయల్స్‌ తమ ఆటగాళ్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఏ ప్రాంఛైజీ నుంచి అధికారికంగా సమాచారం లేకపోయినా.. ఐపీఎల్‌ ఆటగాళ్ల ట్రేడ్‌ డీల్‌ నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జీసీ ఆమోదం కోసం
ఐపీఎల్‌ ఆటగాళ్ల ట్రేడ్‌ రూల్స్‌ ప్రకారం చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆసక్తివ్యక్తీకరణ వివరాలను ఆటగాళ్ల పేర్లతో తొలుత ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు పంపించాలి. రూల్స్‌ ప్రకారం బదిలీ కానున్న ఆటగాళ్ల లిఖితపూర్వక అంగీకారం పత్రాలను గవర్నింగ్‌ కౌన్సిల్‌కు సమర్పించాలి. ప్రాంఛైజీలు తుది దశ చర్చలు ముగించుకుని.. ట్రేడ్‌ డీల్‌ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి సైతం అంతిమంగా గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి.

భలే మంచి బేరం!
ఐపీఎల్‌ 2025 సీజన్‌ తర్వాత కొత్త ప్రాంఛైజీ తరఫున ఆడాలనే ఆసక్తిని సంజు శాంసన్‌ కనబరిచాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యంతో బదిలీ అంశాన్ని ప్రస్తావించగా.. రాయల్స్‌ అప్పట్నుంచి పలు ప్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ సంజు శాంసన్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌ సంజు శాంసన్‌ను వదులుకుని..మరో ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవాలనే పట్టుదల ప్రదర్శించింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు మరో పేసర్‌, లేదా పేస్‌ ఆల్‌రౌండర్‌ కావాలని రాయల్స్‌ కోరింది.

మతీశ పతిరణ, శివమ్‌ దూబెలను కోరినా.. సూపర్‌కింగ్స్‌ తిరస్కరించింది. రవీంద్ర జడేజాతో పాటు అంతిమంగా శామ్‌ కరణ్‌ను తీసుకునేందుకు రాయల్స్‌ మొగ్గు చూపింది. గత సీజన్‌ ఐపీఎల్‌లో సంజు శాంసన్‌ను రూ.18 కోట్లను రాయల్స్‌ అట్టిపెట్టుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ సైతం రూ.18 కోట్లతో రవీంద్ర జడేజాను రిటెయిన్‌ చేసుకుంది. ఆటగాళ్ల వేలంలో రూ. 2.40 కోట్లకు శామ్‌ కరణ్‌ను చెన్నై కొనుగోలు చేసింది. రూ.18 కోట్ల విలువైన ఆటగాడిని విడుదల చేసి.. రూ.20.40 కోట్ల విలువైన ఇద్దరు ఆటగాళ్లను రాజస్తాన్‌ దక్కించుకుంటోంది.

అభిమానుల భావోద్వేగం
రాయల్స్‌, సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్ల ట్రేడ్‌ డీల్‌ అభిమానుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తోంది. ఎం.ఎస్‌ ధోనితో పాటు రవీంద్ర జడేజాను సూపర్‌కింగ్స్‌ అభిమానులు తమవాడిగా భావించారు. గతంలో సురేశ్‌ రైనాను చిన్న తలాగా అభిమానులు పిలుచుకోగా.. వేలంలో కనీస ధరకు సైతం సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం అతడిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడలేదు. 2022 సీజన్‌లో సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన జడేజా.. ఆశించిన ప్రభావం చూపలేదు. ఆ సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ మళ్లీ ధోనికి ఇచ్చారు. అప్పుడే చెన్నైని వీడేందుకు జడేజా నిర్ణయం తీసుకున్నా.. ధోని చొరవతో ఆగిపోయాడు!. జడేజా రాయల్స్‌కు బదిలీ కానుండటంతో సూపర్‌కింగ్స్‌ అభిమానుల్లో భావోద్వేగానికి గురవుతున్నారు. 19 ఏండ్ల వయసులో రాయల్స్‌ తరఫున 2008లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన జడేజా.. ఆ జట్టుకు రెండు సీజన్లు ఆడాడు.

నేరుగా ముంబయి ఇండియన్స్‌తో సంప్రదింపులు చేయటంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. 2011లో కొచి టస్కర్స్‌కు ఆడిన జడేజా.. 2012 నుంచి సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో 254 మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా 3260 పరుగులు, 170 వికెట్లు పడగొట్టాడు. 2013లో రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సంజు శాసన్‌ 177 మ్యాచుల్లో 4704 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 26 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌ కెరీర్‌లో జడేజా 4 జట్లకు (చెన్నై, రాయల్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కొచ్చి టస్కర్స్‌) ఆడగా.. సంజు శాంసన్‌ రాయల్స్‌కు 12 సీజన్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 2 సీజన్లు ఆడాడు. శామ్‌ కరణ్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తరఫున 64 మ్యాచుల్లో 1879 పరుగులు, 59 వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -