– ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి
– రైతులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, పత్తి పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రక్రియ మొత్తం సజావుగా జరగాలనీ, ప్రతి గింజను రక్షిస్తూ, రైతులకు సమయానికి చెల్లింపులు జరపాలని సూచించారు. వర్షాలు, పరిపాలనా ఆలస్యాలతో రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. ధాన్యం తడవకుండా ప్రతి కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలనీ, ప్రతి రోజు వాతావరణ హెచ్చరికలను తెలపాలనీ, కొనుగోళ్లు వేగవంతం చేసి నిల్వ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలనీ, వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, బాయిల్డ్ రైస్ కోటా కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలని దిశానిర్దేశం చేశారు. అదనంగా తగిన గోదాంలు, స్థానిక హమాలీ సిబ్బందిని సమకూర్చి కొనుగోలు ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు. తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని కోరారు.
గతేడాది కన్నా ఎక్కువ
గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఇదే సమయానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈ ఏడాది 8.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశంలోనే తొలిసారిగా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం నాటికి 3.95 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 4.59 లక్షల మెట్రిక్ టన్నుల పెద్ద ధాన్యాన్ని 1,21,960 (గతేడాది 55,493) మంది రైతుల నుంచి సేకరించినట్టు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.2,041.44 కోట్లు (గతేడాది రూ.915.05 కోట్లు) కాగా ఇప్పటికే రైతులకు రూ.832.90 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ.1,208.54 కోట్లు ఓపీఎంఎస్ ద్వారా నమోదు తర్వాత 48 గంటల్లో చెల్లించనున్నట్టు మంత్రి వెల్లడించారు. సన్నాలకు బోనస్ రూ.197.73 కోట్లు (గతేడాది రూ.43.02 కోట్లు) కాగా అందులో రూ.35.72 కోట్లు చెల్లించినట్టు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నవంబర్ నెలను పంటల సేకరణకు అత్యంత కీలకమైన కాలంగా తెలిపారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు కొనుగోలు పరిమితిని 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్లకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై సంతృప్తిగా ఉన్నారని కలెక్టర్లు తెలిపారు. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త ఎల్1, ఎల్2 నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్లు వివరించారు. దీనిపై స్పందించిన తుమ్మల, పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని ఆయన తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. వ్యవసాయశాఖ రూపొందించిన పంట నష్టం నివేదికను కేంద్రానికి పంపామనీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ధాన్య్టం తేమ శాతం నిబంధనలను సడలించమని కేంద్రాన్ని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



