2025 నవంబర్ 1న, భారత దేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఒకే ఒక రాష్ట్రంగాను , మొత్తం ప్రపంచంలో ఇదే ఘనతను సాధించిన రెండవ ప్రాంతంగాను కేరళ రాష్ట్రం చరిత్రను సృష్టించింది. మే 21, 2021న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తిరిగి మరొకసారి ఎన్నుకున్న తరువాత, అదే రోజున జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏరాడికేషన్ ప్రోగ్రాం ఈపిఈపి) ప్రకటించిన దరిమిలా ఈ నాలుగున్నారేండ్ల కృషి ఫలితంగా ఇది సాధించబడింది. ఈ కార్యక్రమం కింద 1032 స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ సంస్థల నుంచి 64,006 కుటుంబాలకు చెందిన 1,03,099 లబ్ధిదారులను సర్వే చేసి అత్యంత పేదవారిగా గుర్తించింది. ఈ ప్రాథమిక జాబితా నుండి చనిపోయిన వారిని, ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లిన వారిని, సూక్ష్మ ప్రణాళిక అవసరం పడని వారిని, జాబితాలో రెండుసార్లు వచ్చిన పేర్లను తొలగించింది. మిగిలిన అందరిని వారికి అవసరమైన దస్తావేజులు, భూమి, గృహవసతి, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యత, పరిశ్రమలు పెట్టుకోవటానికి కావలసిన సహాయము మొదలైనవి అందించి అత్యంత పేదరికం నుంచి బయటకు తీసింది.
అయితే, అత్యంత పేదరికం నుంచి కేరళ బయటపడిందని ప్రకటించటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలనుంచి కేవలం స్వార్ధ రాజకీయ కురచబుద్దితో ప్రతిపక్షం వాకౌట్ చేసింది. ఏ విధానప్రక్రియ ద్వారా అత్యంత పేదరికాన్ని గుర్తించారు అనే అర్ధంలేని ప్రశ్నలను ప్రతిపక్షం వేస్తున్నది. ఇప్పటికీ కేరళలో అత్యంత పేదరికంలో వున్న ప్రజలు కనపడుతున్నారంటున్నది. కొంతమంది విజ్ఞానవంతులు, సంస్థలు ఈ ప్రతిపక్ష రాజకీయ విన్యాసాల ఒరవడిలో కొట్టుకుపోతున్నాయి. అందుచేత, కేరళ 70వ పిరవి (ఆవిర్భావ) దినోత్సవ సందర్భంగా చేసిన ఈ ప్రకటన ముందు జరిగిన ప్రక్రియను పరిశీలించటం తక్షణ అవసరంగా ఉంది. కేరళలోని తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం స్థానిక ప్రభుత్వ సంస్థల నాయకత్వంలో నడిచింది. కేరళలో 941 గ్రామపంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం 1,034. మొదట పేర్కొన్నట్టుగా ఈ 1,032 స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి అత్యంత పేద కుటుంబాలను గుర్తించే కార్యక్రమం పకడ్భందీగా చేసింది. ఇది దాదాపు నూటికి నూరు శాతం.
కేరళలో ఉన్న స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ సంస్థలలో 41 శాతం సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్డిఎఫ్ కు ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ పాలన కింద ఉన్నాయి. అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం యుడిఎఫ్ నాయకత్వం కింద ఉన్న స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ సంస్థలలో కూడా హృదయపూర్వకంగా అమలు చేసింది. వీటిలో కొన్నింటిని సీపీఐ(ఎం) పార్టీ సభ్యుడిగా ఉన్న స్థానిక స్వపరిపాలన సంస్థల శాఖా మంత్రి నిర్వహించిన తీవ్ర పేదరికం నుంచి స్వేచ్ఛను పొందామనే ప్రకటనను విడుదల చేసే సమావేశానికి ఆహ్వానించింది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడంలో హేతుబద్ధంగాలేని ఆవేదన వెళ్లగక్కటం ద్వారా, వారి పాలనలో వున్న స్థానిక సంస్థలు చేసిన ఆదర్శవంతమైన పనితీరును ఈ విధంగా ప్రతిపక్షం విస్మరించింది. తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం నాలుగున్నరేండ్లుగా నడుస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమంలో విజయం సాధించామనే ప్రకటన చేస్తున్న సందర్భంలోనే కేరళ ప్రతిపక్ష నాయకుడ ప్రశ్నలు లేవనెత్తాడు.
నాలుగున్నరేండ్లు నడిచిన ఈ కార్యక్రమంలో ఒక్కసారి కూడా అటు ప్రతిపక్ష నాయకుడు గానీ, ఇటు అతని మూలకంగా దారి తప్పిన వారు గానీ, తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం అమలులో ఆందోళనను, లేక సలహాని గానీ ఇవ్వలేదు. ఈ కార్యక్రమంపై 2023లో మధ్యంతర నివేదికను ఇచ్చింది. గత నాలుగేండ్లుగా శ్రమ తీసుకుని ఈ కార్యక్రమం వివరాలను ఆర్థిక సమీక్షలో పేర్కొంది. వారు ఇప్పుడు వెలిబుచ్చుతున్న ‘ ఆందోళనల’లోని నిజాయితీని కేరళ ప్రజలు అందుకే సందేహిస్తున్నారు. అయితే, పేదరికం, తీవ్ర పేదరికం మధ్య తేడా ఏమిటనే సందేహం సాధారణ ప్రజల్లో ఉంది. దాని గురించి చెప్పాల్సి వుంది. పేదలు అంటే రోజువారి అవసరాలను తీర్చుకోవటానికి కూడా కష్టపడేవాళ్లు. వారి జీతాలు ఇంటి అవసరాలకు బొటా బొటిగా సరిపోతాయి. సొంతింటిని నిర్మించు కోలేరు, ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించలేరు. వీరు గాక, మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నప్పటికీ స్థిరమైన ఆదాయంలేక బతికే ఒక పోరాటంగా గడిపేవారు ఉన్నారు. వీరి గురించే పేదరిక నిర్మూలన పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది, బతుకుతెరువుకు అవకాశాలు కల్పిస్తుంది.
వార్షిక ప్రణాళికల తయారుచేసేటప్పుడు ప్రభుత్వాలు వీటినిలెక్కలోకి తీసుకుని పొందుపరుస్తాయి. మరో రకం ప్రజానీకం వుంది- మనుగడ సాగించటం అసాధ్యమైన వారు, పని చేయలేని స్థితిలో వున్న వారు, పనిచేయగలిగినప్పటికీ, తమపై ఆధారపడి మంచం పట్టిన వారి సంరక్షణ దగ్గరుండి చూడవల్సిన వారు, తమ అవసరాలను నోరువిప్పి ఇతరులను అడగలేనివారు, గ్రామ సభలంటేనే తెలియని వారు, తెలిసిన వాటికి హాజరుకాలేని వారు, ఒకవేళ పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపికైనప్పటికీ వాటిని పొండటానికి అవసరమైన పత్రాలు లేనివారు. వీరు తీవ్ర పేదరికంలో వున్న ప్రజలు- బయటనుంచి సహాయం లేకపోతే వీరికి మనుగడ అసాధ్యమవుతుంది. కేరళ ప్రభుత్వం తీవ్ర పేదరికం నిర్మూలన కార్యక్రమంలో లబ్ధి పొందిన ఒకరిని ఉదాహరించి దీన్ని మరింత వివరించవచ్చు. శివకుమార్, ఒక ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో పని చేసేవాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటింటికి దినపత్రికలు వేసే పనిచేసేవాడు.
అయితే, డయాబెటిస్ తీవ్రత వల్ల వేళ్లల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. రెండు కాళ్లల్లో మోకాళ్ల కింద నుంచి సర్జరీ చేసి తొలగించారు. అతను పదో తరగతి చదువుతున్న కొడుకుతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఒకే గదిలో నివసిస్తున్నాడు. మూడు పూటలా ఒకటే ఆహారం- -రొట్టెలు. ఏ రోజుకారోజు ప్రతిరోజు ఉదయాన్నే రొట్టెలు కొని తెచ్చుకుంటారు. శివకుమార్‌ది కులాంతర వివాహం కావడంతో, అతని బంధువులను నుంచి ఎటువంటి సహాయం దొరికేది కాదు. శివకుమార్ భార్య అనేక వ్యాధులతో బాధపడుతుండేది. శివ కుమార్ ఆమె సంరక్షణ చూసుకోలేక తప్పనిసరై ఆమెను పుట్టింటికి పంపించాడు. ఆ విధంగా తను, కొడుకు ఆ చిన్నగదిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్కూల్ అయిపోయిన తర్వాత, ఆ పిల్లవాడు ఒక పూల దుకాణంలో దండలు అల్లేవాడు. అలా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే తిండి ఖర్చులు, స్కూల్ ఫీజులు ఎలాగో సర్దుబాటు చేసుకునేవాళ్లు.
శివకుమార్ కోసం రూపొందించిన సూక్ష్మ ప్రణాళికలో భాగంగా వారికి భూమి, ఇల్లుతో పాటు వారి చికిత్సకు, పిల్లవాడి చదువుకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. పిల్లవాడు పది, అ తరువాత పన్నెండు తరగతులను మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. భార్య పుట్టింటినుంచి తిరిగి వచ్చింది, కుట్టు మెషిన్ తీసుకుంది. ఈ విధంగా శివకుమార్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే దశ నుంచి, తిరిగి గౌరవప్రదమైన జీవితంలోకి అడుగుపెట్టింది. జీవితంలో రెండవ అవకాశం పొందిన కేరళలోని వేలాది కుటుంబాల్లో ఇప్పుడు శివకుమార్ కుటుంబం కూడా ఒకటిగా వుంది.
సమాజంలోని ఇటువంటి నిస్సహాయ వ్యక్తుల ఉనికిని ప్రభుత్వాలు గుర్తించి, వారిని సంరక్షించడంలోనే ప్రజాస్వామ్యామం అనేదానికి నిజమైన అర్థం ఉంటుంది. తమకోసం తాము మాట్లాడలేని నిశ్శబ్ద, అదృశ్య మైనారిటీని చేరుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సంపూర్ణతను పొందుతుంది.
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిక్కచ్చిగా, గొంతు లేని వారికి గొంతును ఇవ్వటానికి ప్రయత్నిస్తూ, తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దుతున్నది. ఈ తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమమే కేరళను అన్నిటికన్నా మిన్నగా నిలబెట్టింది. దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న వ్యవస్థీకృత పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో, అధికార యంత్రాంగం చూసే ప్రతి సూక్ష్మ దర్శినిలోనూ కనపడకుండా జారిపోయిన అత్యంత నిస్సహాయపు వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం చేరుకోటానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. అలా చేయటంలో, ఎల్డిఎఫ్ ప్రభుత్వం తన అధికార యంత్రాంగాన్ని సాధారణ పద్ధతుల హద్దులు దాటి అత్యంత అణగారిన ప్రజలను గుర్తించి, వారి అవసరాలను తీర్చమని కోరింది.
ఈ ప్రక్రియలో భాగంగా, రాజకీయ నాయకత్వంలోనూ, పౌర సేవల బృందాల్లోనూ, ప్రజల ప్రతినిధుల్లోనూ, మొత్తం ప్రజానీకంలోనూ ఒక నూతన సాంస్కృతి ఆవిర్భవించి, అభివృద్ధి చెందింది.అయితే, కొంతకాలం గడిచిన తర్వాత ఈ తీవ్ర పేదరికం మళ్లీ తలెత్తదా? తిరిగి తలెత్తవచ్చు. ఆ దృష్టితోనే కేరళ ప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం 2.0 తో కొనసాగుతూ, ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, భావితరాలను కూడా ఈ తీవ్ర పేదరికం నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. ప్రభుత్వము, పౌర సమాజం రెండూ చేతులు కలిపి ఆ సూచనను నిజం చేయాలి. దీనితో విస్తారంగా అమ్ముడుపోయే కొన్ని వార్తాపత్రికలు కూడా పేదలకు సంబంధించిన కధనాలు ఇవ్వటంతో, వారి సంరక్షణ చేపట్టటం మొదలయింది. విషయం ఏమైనప్పటికీ, సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ముందుండి నడిపి, తీవ్ర పేదరికం నిర్మూలనలో సాధించిన అసమాన విజయాన్ని తక్కువ అంచనా వేయకూడదు.
ఎం.ఏ. బేబీ



