మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లో దిగజారిన ధర
కిలో రూ.1కి పతనం
మద్దతు ఊసెత్తని డబుల్ ఇంజిన్ సర్కార్
భోపాల్ : మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఉల్లి పంట పండించిన అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికే పాత ఉల్లి పంట నిల్వలు ఉండగా..ఇప్పుడు కొత్త పంట కూడా మార్కెట్‌లోకి రావడం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు ఎగుమతులు నిలిపివేయడం వంటి కారణాల మూలాన ధరలు అమాంతం పడిపోయాయి. మంగళవారం కిలో రూ.2కు పడిపోయిన ధరలు బుధవారం రూ.1 కంటే దిగువకు పడిపోయాయి. కనీసం రవాణా ఛార్జీలు కూడా దక్కకపోవడంతో రైతు మార్కెట్‌లోనే కంటతడి పెడుతున్నారు.
ఉల్లి ప్రధాన మార్కెట్లలో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో మంగళవారం కిలో ఉల్లి ధర రూ.2గా ఉంది. బుధవారం మరో ప్రధానమార్కెట్ అయిన మంద్‌సౌర్‌లో కిలో ఉల్లి ధర రూ.1కి, అంతకంటే దిగువకు పడిపోయింది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మాల్వాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక రాజస్థాన్‌లోని అల్వార్‌లోనూ ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ కూడా కిలో ఉల్లి రూ.1 నుంచి రూ.5 మధ్యనే పలుకుతోంది. నాణ్యత మరీ అధికంగా ఉంటే కిలో రూ.8 చొప్పున కొంటున్నారు.
ఇక ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి పాయల మార్కెట్‌గా పేరొందిన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలోనూ ఉల్లి రైతు గోడు అంతాఇంత కాదు. చాలా చోట్ల రైతులు ఉల్లి పంటను మార్కెట్‌కు తీసుకెళ్లితే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని, పొలాల్లోనే వాటిని వదిలేస్తున్నారు. కొన్ని మాసాల నుంచే అక్కడి రైతులు మద్దతు ధర కోసం వివిధ రూపాల్లో పోరాడుతూనేవుంది. కొత్త, పాత ఉల్లిపాయల నిల్వలు ఒకేసారి మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలోనే ఉల్లి పాయల ధరలు పడిపోయినట్లు ప్రకటించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని బిజెపి నేతృత్వ డబుల్ ఇంజిన్ సర్కార్లు చేతులు దులిపేసుకుంటున్నాయి. అన్నదాతలకు కనీస మద్దతు కూడా ఇవ్వకుండా పరిహాసమాడుతున్నాయి.
ప్రభుత్వం తక్షణమే ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించి..ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసినా..డబుల్ ఇంజిన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దాదాపు ఆరు నెలలుగా తమ ఉత్పత్తులను నిల్వ చేసినప్పటికీ.. సరైన ధర లభించడం లేదని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. వెల్లుల్లి ధరలు కూడా భారీ స్థాయిలో పడిపోవడంతో అక్కడి రైతన్నలు ఆక్రందనకు గురౌతున్నారు. వాతావరణ పరిస్థితులు, నిల్వ చేయడానికి అవసరమైన గోడాన్లు లేకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ఉల్లి పంట సాగు చేసే రైతన్నలను సంక్షోభంలోకి నెట్టేశాయని మహారాష్ట్ర స్టేట్ ఆనియన్ ప్రొడ్యూసర్స్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు భరత్ డిఘోలే అన్నారు. సంక్షోభ నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రవాణా ఖర్చు కూడా రావట్లే
రత్లాం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర కేవలం రూ.600గా ఉంది. పొలం నుంచి మార్కెట్‌కు ఉల్లిని తరలించడానికి రవాణాకు అయిన ఖర్చు కూడా రావడం లేదని నగ్రా గ్రామానికి చెందిన ఓ అన్నదాత వాపోయాడు. ’30 క్వింటాళ్ల ఉల్లిపాయలను మార్కెట్‌కు తరలించేందుకు రూ.2 వేలు అయ్యింది. మార్కెట్‌లో అమ్మగా క్వింటాల్‌కు రూ.250లే వచ్చాయి. తీవ్రంగా నష్టపోయాం’ అని దుంఖం నిండిన కండ్లతో ఆ రైతు అన్నారు.



