రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదాలు
ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న అధికారులు
నవతెలంగాణ- విలేకరులు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు పలు జిల్లాల్లో అకస్మిక తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మేడ్చల్‌లో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏసీబీ అధికారులు మేడ్చల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొని తనిఖీ చేశారు. అయితే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వారు మాత్రమే ఆఫీసులో ఉండాల్సి ఉండగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు ఉండటాన్ని అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయని, డబ్బులు దొరకలేదని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఆ డాక్యుమెంట్ సంబంధించిన వారిని పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉన్న 10 డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లను విచారిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం కవిత కాంప్లెక్స్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అన్ని రకాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు కార్యాలయ లావాదేవీ రిజిస్టర్‌లను పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడానికి ముందు డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించి డాక్యుమెంటేషన్ చార్జీల వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన ఆకస్మిక తనిఖీలతో ఉద్యోగులంతా ఉలిక్కిపడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్లు పక్కనపడేసి, షెట్టర్లకు తాళాలువేసి పరారయ్యారు. అధికారులను చూసి అప్రమత్తమై పారిపోతున్న కొందరు డాక్యుమెంట్ రైటర్లు, కిందిస్థాయి కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారించారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ చంద్ర ఆధ్వర్యంలో ఆకస్మాత్తుగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడుల సమయంలో రికార్డులు, దస్తావేజులు స్వాధీన పరుచుకున్నామన్నారు. తనిఖీల సమయంలో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారని, వీరితో పాటు ఆరుగురు డాక్యుమెంట్ రైటర్లు, మరో ఆరుగురు వారి అసిస్టెంట్లు ఉన్నారని చెప్పారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న, ఆధారాలు లేని రూ.63,160 నగదును సీజ్ చేసినట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్ అయిన 19 దస్తావేజులు క్లయింట్స్‌కు ఇవ్వకపోవడంతో కార్యాలయంలోనే ఉన్నాయన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



