Sunday, November 16, 2025
E-PAPER
Homeసోపతిదాశరథి కథ చెప్పిన రాపోలు సుదర్శన్‌

దాశరథి కథ చెప్పిన రాపోలు సుదర్శన్‌

- Advertisement -

”పిల్లల్లారా, పాపల్లారా/ రేపటి భారత పౌరుల్లారా / పెద్దలకే ఒక దారినిచూపే పిన్నల్లారా! / మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు / పొంచి ఉన్నాడు / మీ మనసులో దేవుడు కొలువై ఉన్నాడు…” అంటూ మనం రేడియోలో వందలాదిసార్లు విన్న ఈ పాటను వ్రాసింది డాక్టర్‌ దాశరథి. అదే పిల్లలూ! ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఎలుగెత్తి నినదించింది కూడా ఈ మహాకవియే. వీరి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య ‘దాశరథి’గా ప్రసిద్ధులు. గతంలో మనం వీరి గురించి, వీరి బాల గేయాలు, సినీ బాల గీతాల గురించి ఇక్కడే చదువుకున్నాం. ఇవ్వాళ ఈ దాశరథి కథను మీ కోసం రాసిన డా. రాపోలు సుదర్శన్‌ ను పరిచయం చేసుకుందాం. కవులు, వీరుల గురించి ఇలాంటి కథలు రావడం ఎంత మంచి పనో కదా! మీకు తెలుసా నేను 2017 లో ‘పిల్లల కోసం సినారె కథ’ రాశాను. ఇవ్వాళ్ళ ఇలా మహాకవి డాక్టర్‌ దాశరథి గారి జీవిత చరిత్ర రావడం బాగుందర్రా!

‘ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జీవిత చరిత్ర (బాలల కోసం)’ రాసిన డా. రాపోలు సుదర్శన్‌ హైదరాబాద్‌లోని నింబోలి అడ్డలో పుట్టి పెరిగారు. మార్చి 3, 1958లో పుట్టిన వీరు నింబోలీఅడ్డ, సుల్తాన్‌ బజార్‌ బడుల్లో చదివి, సారస్వత పరిషత్తులో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘శ్రీశ్రీ పీఠికలు’పై ఎం.ఫిల్‌., ‘శ్రీశ్రీ వచన రచనలు’పై తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి చేశారు. బరంపురం విశ్వవిద్యాలయం నుండి డి.లిట్‌ పట్టా అందుకున్నారు. తపాలాశాఖలో డిప్యూటి మేనేజర్‌గా పనిచేశారు. తొలినుండి పలు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సన్నిహితంగా ఉన్న రాపోలు పరిషత్తు సంచిక ‘నెలవంక’కు సంపాదకులు.

‘ఉపాలి’, ‘పునాస’ సంపాదకవర్గాల్లో, ‘తెలుగు పరిశోధన’, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఉద్యోగుల సావనీర్‌ సంపాదకవర్గంలోనూ పాలుపంచుకున్నారు. డా.రాపోలు తొలుత కవి, విమర్శకుడు, పరిశోధకుడు, కార్యకర్త, కావ్యకర్త. సమాంతర సాహిత్య వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరైన వీరు మిత్ర బాలల సంక్షేమ సంఘం వ్యవస్థాప అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రధానకార్యదర్శిగా సేవలను అదించారు. సారస్వత పరిషత్తు విదార్థి సంఘం అధ్యక్షులు, కార్యదర్శిగా చేశారు. గత ఐడేండ్లుగా అనాధ శవాల దహన సంస్కారాలు నిర్వహించే హరిశ్చంద్ర సంస్థకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ పాఠ్యరచనలు చేశారు. కతార్‌లో సరిగిన సాహిత్య సమ్మేళనంలో ‘మహాకవి దాశరథి జీవితం-సాహిత్యం’ అంశంపై ప్రసంగం చేశారు.

‘శ్రీశ్రీ పీఠికలు-పరిశీలన’, ‘శ్రీశ్రీ వచన విన్యాసం’ అచ్చయిన డా. రాపోలు పరిశోథనా గ్రంథాలు. కవిగా ‘సంప్రోక్షణ’ వచన కవితా సంపుటిని తెచ్చారు. మహాకవి దాశరథి గురించి ‘దాశరథీ(య)ం’ దీర్ఘ కవితను రాసి ప్రచురించారు. వీరు వ్రాసిన ‘హైదరాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర’ తెలంగాణ సాహిత్య అకాడమిలో ప్రచురణలో ఉంది. బాలల కోసం రాసిన వాటిలో ‘ప్రజాకవి దాశరథి కృష్ణమా చార్య జీవిత చరిత్ర’. డా. రాపోలుకు తొలి నుండి దాశరథి అంటే మక్కువ… అంతకు మించి అభిమానం. బహుశ అదే ఆయనను అభ్యుదపథంవైపుకు నడిపించి ఉండొచ్చు. దాశరథి జీవిత చరిత్రను పిల్లల కోసం చెప్పిన రచయిత దానిని పదకొండు భాగాలుగా విభజన చేసుకున్నారు. తొలి అధ్యాయం ‘ఆరంభం’. ఈ ఆరంభం పిల్లల ప్రస్తావనతో ప్రారంభించారు రాపోలు.

తెలంగాణలో సినిమా పాట అంటే తొలినాళ్ళలో తెలిసింది రెండే పేర్లు, ఒకటి డా. దాశరథి, రెండవది డా. సినారె. దానిని దృష్టిలో ఉంచుకుని రేడియోలో వచ్చిన ఒక పాట నేపథ్యంగా తన మనవలు, మనవరాండ్లకు తాత చెప్సిన కథ ఇది. తరువాత ‘జననం’లో దాశరథి, జననం, విద్యాభ్యాసం, సంప్రదాయ కుటుంబ వాతావరణంలో ఎదుగుదల వంటివి చెబుతూ బాల్యం నుండే వారిపై ప్రభావం చూపిన వివిధ ఉద్యమాలను ఈ సందర్భంగా పరిచయం చేశారు. నిజాం పాలనలో జరుతున్న దురాగతాలను నిరసిస్తూ జరిగిన కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రభావితమైన దాశరథి పదిహేడేండ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఇందులో అవన్నీ చెబుతారు దాశరథి. తరువాతి అధ్యాయాలు ‘కుటుంబం’, ఆయన చేసిన ‘ఉద్యోగాలు’, వివిధ సంస్థలతో ఆయనకున్న అనుబంధం, సంబంధాలను ‘సంస్థలు-పదవులు’లో చెబుతారు రచయిత.

దాశరథి కవి, సినీ గేయకవి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అస్థానకవి. పిల్లల కోసం ”రావే రావే చేమంతీ / రావే రావే పూబంతీ / బంగరు వన్నెల చేమంతీ / బంగరు నవ్వుల పూబంతీ / జడలో చేరవె చేమంతీ / జిగెల్‌న మెరువవె పూబంతీ..”, ”మూడు రంగుల జండా / మురిసిపోయే ఊరి నిండా” అంటూ పాడిన బాలల గీతాలను, ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నినదించిన విధానాన్ని చెబుతారు. మరో అధ్యాయంలో ”ఖుషీ ఖుషీగా నవ్వుతూ / చలాకీ మాటలు రువ్వుతూ”, ”నడిరేయి ఏజాములో / స్వామి నినుచేర దిగివచ్చెనో”, ”పాపాయి నవ్వాలి / పండుగే రావాలి” అంటూ దాశరథి రాసిన సినిమా పాటలను పిల్లలకు చక్కగా పరిచయం చేశారు రచయిత. మహాకవి దాశరథికి లభించిన పురస్కారాలతో పాటు ఆయనను తెలుగుజాతి ఎలా గౌరవించుకుందో ‘బిరుదులు-పురస్కారాలు’ అధ్యాయంలో మనకు పరిచయం చేస్తారు రచయిత. ‘కొండ అద్దమందు’ అన్నట్టు సాహితీవిరాణ్ముర్తి అయిన మహాకవి దాశరథిని పిల్లల కోసం వాళ్ళ స్థాయికి ఎదిగి పరిచయం చేయడం రచయిత సాధించిన విజయం. బాలల కోసం చక్కని పుస్తకాన్ని తాయిలంగా అందించిన ఆత్మీయుడు డా. రాపోలు సుదర్శన్‌ అన్నకు అభినందనలు. ఈ కోవలో మరి కొందరు తెలుగు వెలుగులను పరియయం చేసే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ అభినందనలు. జయహౌ! బాల సాహిత్యం!

  • డా|| పత్తిపాక మోహన్‌
    9966229548
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -