– ప్రజలకు గుదిబండగా రేవంత్ రెడ్డి పాలన
– నివాస నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలి
– మాజీ ఎమ్మెల్యే తాటి డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
హైద్రాబాద్ లో హైడ్రా తో – అశ్వారావుపేట లో జేసీ బీ తో పేదల ఇళ్ళను కూల్చటమే కాంగ్రెస్ సర్కార్ పాలన అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రైవేట్ స్థలాలను కొనుక్కోలేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుంటే కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే తెల్లవారుజామున రెవెన్యూ, పోలీసు,మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి గుడిసెలు నేలమట్టం చేయటం అత్యంత దారుణమని అవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అధికారులు కూల్చిన గుడిసెలను బుధవారం ఆయన పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
వారితో మాట్లాడి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించి నందుకు ఇళ్ళు కూల్చి తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బాధితులు శాపనార్థాలు పెట్టారు. కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డా కనికరం చూపని అధికారులు ఇళ్ళు కూల్చి నిలువ నీడ లేకుండా రోడ్డున పడేశారని బోరున విలపించారు. అనంతరం తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ హస్తం అంటేనే మొండి చెయ్యి అని దోచుకోవడం తప్పు ప్రజా సంక్షేమం పట్టదని ద్వజమెత్తారు.కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే పేదలపై ఇంత దౌర్జన్యం చేస్తారా అని నిలదీశారు. ఆసలు పేదలు చేసిన తప్పు ఏమిటీ.?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుడిసెలు నిర్మించుకోవడం మే తప్పా, స్వార్థ రాజకీయాల కోసం కూల్చివేశారా అని ప్రశ్నించారు.పేదలపై రాజకీయాలు చేయటం సరికాదంటూ హితవు పలికారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అదే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుదిబండగా మారిందని విమర్శించారు. పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు అలాంటి ప్రభుత్వం పేదలకు గూడు కల్పించక పోగా ఉన్న గుడిసెలను తొలిగించి తీరని అన్యాయమని, వెంటనే బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఇళ్ళ స్థలాల తో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి ఆదుకోవాలని సూచించారు.అక్కడ నుండి తాహశీల్ధార్ కార్యాలయానికి చేరుకుని, కార్యాలయంలో తహశీల్దార్ అందుబాటులో లేకపోవటంతో ఫోన్ చేసి మాట్లాడారు.పేదలు ఇబ్బందులను తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్ళారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారమే గుడిసెలు తొలగించినట్లు తహశీల్దార్ సమాదానం ఇచ్చారు. అసలు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేశారని ప్రశ్నిస్తుండగానే తహశీల్దార్ ఫోన్ పెట్టేయటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. నేరుగా కలెక్టర్ తోనే మాట్లాడతానని బాధితులకు భరోసా ఇచ్చారు.ఆయన వెంట అంకత మల్లిఖార్జునరావు, సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీమ్ ఉన్నారు.



