Thursday, November 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికేంద్రం వైఖరి- ఓ వడ కథ

కేంద్రం వైఖరి- ఓ వడ కథ

- Advertisement -

‘రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి నిధులివ్వండి.. ఫ్యూచర్‌ సిటీకి మద్దతివ్వండి…’ పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్‌ కేంద్రానికి చేసిన అభ్యర్థన ఇది. ‘రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు బలమైన పాత్రను పోషించాలి.. కీలక రంగాలకు విరివిగా నిధులివ్వండి…’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు చేసిన విజ్ఞప్తి ఇది. తాజాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులు, వాటికి నిధులు, ఆదాయ వనరులపై చర్చించిన అంశాలివి. సీఎం పాల్గొన్న కార్యక్రమం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరగ్గా.. డిప్యూటీ సీఎం హాజరైన సమావేశంలో పాల్గొన్న బ్యాంకర్లందరూ రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలకు లోబడే పని చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ గమ్మత్తేమిటంటే… పైన పేర్కొన్న రెండు అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఆజ్ఞ లేకుండా చిల్లిగవ్వ కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.. ఉండబోదు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేండ్ల కాలంలో కేంద్ర ఆర్థిక, ద్రవ్య సంస్థలన్నీ రాష్ట్రాలను…’బీజేపీ పాలిత, బీజేపీయేతర ప్రభుత్వాలు’గా చూస్తున్నాయి. ఆ కోణంలోంచే నిధులు, గ్రాంట్లు, ఆర్థిక సాయాలు చేస్తూ వస్తున్నాయి. ఇది రాష్ట్రాల హక్కులకు, సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు, దానికి అనుసంధానంగా ఏర్పడ్డ ప్రణాళికా సంఘాలు… రాష్ట్రాల స్వరూప స్వభావాలుగా పూర్తిగా మార్చేశాయి. దేశంలోని వివిధ భౌగోళిక స్వరూపాలు, రాష్ట్రాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిధుల పంపిణీ జరిగేది. దాంతో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనా రంగాల్లో దేశం అనతికాలంలోనే చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించింది.

కానీ ‘మిత్రోన్‌…’ అంటూ గద్దెనెక్కిన మోడీ…గతంలోని ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ‘నిటి అయోగ్‌’ను తెచ్చారు. తద్వారా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ‘నీతి’ని అమలు చేస్తూ… రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయిస్తున్నారు. ఇక్కడ 14వ, 15వ ఆర్థిక సంఘా(ఫైనాన్స్‌ కమిషన్లు)ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 14వ ఆర్థిక సంఘం నాటికి రాష్ట్రాలన్నింటికీ కలిపి కేంద్రం 32 శాతం నిధులను విడుదల చేసేది. 15వ ఆర్థిక సంఘం నాటికి ఆ శాతాన్ని 42కు పెంచామన్నది ఎన్డీయే ప్రభుత్వ పెద్దల వాదన. ఇందులోంచి జమ్మూ కాశ్మీర్‌ (జమ్మూను రాష్ట్రంగా విడగొట్టి.. కాశ్మీర్‌ను, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన కారణంగా)కు ఒకశాతం నిధులను వెచ్చిస్తున్నామని వారు ‘ఎంతో గర్వంగా’ చెప్పుకోవటం విచిత్రం. అదిపోను మిగతా 41 శాతాన్ని తాము రాష్ట్రాలకు పంచుతున్నామన్నది విత్తమంత్రి నిర్మలమ్మ ఉవాచ. వినటానికి ఎంతో వినసొంపుగా ఉన్న ఈ మాటల వెనుక ఓ మర్మం దాగుంది.

అంతకుముందు సెస్‌ల రూపంలో వచ్చే ఇరవై శాతం నిధులు, రాష్ట్రాలకు దక్కేవి. కానీ ఇప్పుడు మోడీ సర్కార్‌ వాటిని తన జేబులో వేసుకోవటం గమనార్హం. అంటే నిర్మలమ్మ చెబుతున్న 41 శాతంలో ఇప్పుడు రాష్ట్రాలకు నికరంగా వచ్చేది 21 శాతమేనన్నమాట. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల(సెంట్రల్లీ స్పాన్షర్‌డ్‌ స్కీమ్స్‌-సీఎస్‌ఎస్‌) కింద కేంద్రం తన వాటాగా చెల్లించాల్సిన 50 శాతం నిధులను…25 శాతానికి తగ్గించుకోవటం మోడీ సర్కారు ఘనతే. దాంతో గతంలో యాభై శాతం నిధులనే భరించే రాష్ట్రాలు.. ఇప్పుడు ఏకంగా 75 శాతాన్ని భరించాల్సి రావటంతో అవి లబోదిబోమనటం ఎన్డీయే ఆర్థిక విధానాలకు పరాకాష్టగాక మరేమిటి? ఇక విద్యా రంగానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పీఎమ్‌ శ్రీ పథకం నిధులు కావాలంటే.. రాష్ట్రాలన్నీ విధిగా తాము ప్రతిపాదించిన నూతన విద్యా విధానా(ఎన్‌ఈపీ)న్ని అమలు చేయాల్సిందేనంటూ వాటి మెడ మీద కత్తి పెట్టటం బీజేపీకే చెల్లింది.

ఏతావాతా తేలిందేమంటే… సీఎం అభ్యర్థించినా, డిప్యూటీ సీఎం మొరపెట్టుకున్నా, నేటి మోడీ సర్కారు తాను అనుకున్న రాష్ట్రాలకే, అనుకున్నంత స్థాయిలోనే నిధులను విడుదల చేస్తుంది తప్ప దీనికి సమాఖ్య విలువలు పట్టనే పట్టవు. దీన్ని ఓ చిన్న ఉదాహరణతో పోలుస్తూ ఆర్థికశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కుండబద్ధలు కొట్టారు. ‘రెండు టిఫిన్‌ సెంటర్లు పక్కపక్కనే ఉన్నాయి. ఉప్పులు, పప్పులు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మొదటి టిఫిన్‌ సెంటర్‌ వాడు వడ రేటును విపరీతంగా పెంచాడు. కానీ రెండోవాడు అదే వడ ధరను ఒక్కపైసా కూడా పెంచలేదు. ఎందుకంటే.. వాడు రేటు పెంచకుండా, దాని రంధ్రం సైజును పెంచుతూ పోతున్నాడు.. ఇప్పటి మోడీ సర్కారుది కూడా రాష్ట్రాల పట్ల అదే విధానం…’ అంటూ ఆయన ముక్తాయింపునిచ్చారు. ఆ విధానాలు మారాలంటే రాష్ట్రాలు పిడికిలి బిగించాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -