అలా అని నిరవధిక జాప్యం కుదరదు
కారణం చూపకుండా బిల్లును తిరస్కరించొద్దు
దానిపై న్యాయ సమీక్ష జరపొచ్చు
వారి ‘విచక్షణ’పై విచారించలేం : రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానమిచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు నిర్దిష్ట కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలిపే విషయంపై రాష్ట్రపతి లేవనెత్తిన 14 నిర్దిష్ట సందేహాలను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం నివృత్తి చేసింది. తద్వారా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న శాసన సంబంధమైన వివాదాలకు ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవారు మరో రెండు రోజులలో పదవీ విరమణ చేయనుండగా ఆయన నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. బిల్లుల ఆమోదానికి రాజ్యాంగ వ్యవస్థలపై కచ్చితమైన కాలపరిమితి విధించలేమని చెబుతూనే గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా వాటిని తమ వద్ద నిరవధికంగా అట్టే పెట్టుకోజాలరని స్పష్టం చేసింది. రాష్ట్రపతి లేవనెత్తిన వివిధ అంశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాలు…
కారణం చెప్పాల్సిందే
‘రాష్ట్ర శాసనసభలు ఆమోదించి న బిల్లులకు ఆమోదం తెలపడానికి గవర్నర్ అనుసరించాల్సిన రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియను ఆర్టికల్ 200 వివరించింది. తన ముందుకు ఏదైనా బిల్లు వచ్చినప్పుడు గవర్నర్ మూడు మార్గాలను ఎంచుకోవచ్చు. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతి పరిశీలన కోసం దానిని రిజర్వ్ చేయడం, బిల్లు ను ఆమోదించకుండా తన వ్యాఖ్యలతో పున్ణపరిశీలన కోసం తిరిగి శాసన సభకు పంపడం. ఏ కారణం చూపకుండా బిల్లును నిరాకరిం చే అవకాశం లేదు. బిల్లుపై సంతకం చేసేందుకు నిరాకరించి దానిని పెండింగ్‌లో ఉంచకూడదు. బిల్లును ఆమోదించని పక్షంలో దానిని విధిగా తిరిగి సభకు పంపాల్సి ఉంటుంది.
న్యాయ సమీక్ష జరపొచ్చు
గవర్నర్ తీసుకునే నిర్ణయాలలోని విజ్ఞతను కోర్టులు సమీక్షించలేవు. అయితే ‘సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోయినా, అందుకు కారణం చెప్పకపోయినా, నిరవధికంగా నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించినా అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లును తన వద్ద దీర్ఘకాలం అట్టే పెట్టుకుంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోర్టు ఆదేశించవచ్చు.
ఆర్టికల్ 361తో రక్షణ పొందలేరు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 రాష్ట్రపతి, గవర్నర్లకు వ్యక్తిగత రక్షణ ఇస్తోంది. వారు తమ విధి నిర్వహణలో ఏ న్యాయస్థానానికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని అది చెబుతోంది. ఈ ఆర్టికల్ ఆయా వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన నిష్క్రియాపరత్వానికి సంబంధించిన విషయాలలో న్యాయ సమీక్ష నుంచి గవర్నర్ కార్యాలయాన్ని కాపాడలేదు. నిరవధిక జాప్యాల నుంచి రక్షణ పొందడానికి ఈ అధికరణను ఉపయోగించుకోలేదు.
కాలపరిమితికి నో
ఆర్టికల్ 200 కింద తనకు లభించినచట్టపరమైన అధికారాలను వినియోగిం చుకోవడానికి గవర్నర్లకు కాల పరిమితి విధించవచ్చా అని రాష్ట్రపతి సందేహాన్ని వ్యక్తం చేయగా చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లకు ఏప్రిల్‌లో నిర్దేశించిన మూడు నెలల కాలపరిమితిని తోసిపుచ్చింది. ‘నిర్దిష్ట కాలపరిమితి’కి బదులుగా ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పద ప్రయోగాన్ని ఆర్టికల్ 200 చేసినందున కచ్చితమైన కాల పరిమితిని విధించడం న్యాయవ్యవస్థకు తగని పని అని అభిప్రాయపడింది.
రాష్ట్రపతి విచక్షణను విచారించలేం
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి తన రాజ్యాంగపరమైన విచక్షణను ఉపయోగించడాన్ని విచారించలేము. ఈ నిబంధన రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు రిజర్వ్ చేసే బిల్ల్లులకు సంబంధించినది. రాష్ట్రాల బిల్లులను ఆమోదించాలా లేక దానిని నిలిపివేయాలా అనే అంశంపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు నిలబడదు.
డెడ్‌లైన్ విధించలేం
ఆర్టికల్ 201 కింద విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి కాలపరిమితి ఏదీ విధించకూడదు. రాష్ట్ర బిల్లులను తమ పరిశీలన కోసం రిజర్వ్ చేసినప్పుడు న్యాయస్థానాలు నిర్దేశించే కాలపరిమి తికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు
చట్టపరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిపై సుప్రీంకోర్టును సంప్రదించేందుకు ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తోంది. బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదు.
చట్టాలపైనే న్యాయ సమీక్ష
చట్టం అమలులోకి రాకముందు గవర్నర్ లేదా రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు న్యాయబద్ధత ఉండదు. న్యాయ సమీక్ష అనేది చట్టాలకు మాత్రమే వర్తి స్తుంది. అంటే అమలులోకి వచ్చిన చట్టాలకే వర్తిస్తుంది. బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారడానికి ముందు కోర్టులు వాటి చెల్లుబాటుపై తీర్పు చెప్పలేవు.
ఆలస్యమైతే ఆమోదం పొందినట్టు కాదు
రాష్ట్రపతి లేదా గవర్నర్ తన రాజ్యాంగబద్ధమైన అధికారాలను వినియోగించుకోవడాన్ని ఆర్టికల్ 142 భర్తీ చేయలేదు. పూర్తిగా న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అధికారం ఇచ్చింది. ఆలస్యం జరిగితే బిల్లు ఆమోదం పొందినట్లేనంటూ ఏప్రిల్‌లో ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పు సరి కాదు.
ఆమోదం పొందితేనే చట్టం
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ అనుమతి పొందకుండా చట్టం కాదు. గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే బిల్లు చట్ట రూపం దాలుస్తుంది.
ధర్మాసనం కూర్పుపై…
రాజ్యాంగ నిబంధనలపై వివరణ ఇవ్వాల్సిన ముఖ్యమైన సందర్భాలలో కనీసం ఐదుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 145 (3) నిర్దేశిస్తోంది. కాగా రాజ్యాంగంలోని 142, 131 అధికరణలపై రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
విచక్షణను ఉపయోగించొచ్చు
బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు గవర్నర్ విధిగా మంత్రిమండలి సాయం, సలహా తీసుకోవాలని రాజ్యాంగంలోని 163వ అధికరణ నిర్దేశిస్తోంది. అయితే రాజ్యాంగం ప్రకారం విచక్షణను ఉపయోగించాల్సిన సందర్భాలలో దీనిని పాటించాల్సిన అవసరం లేదు. బిల్లులకు ఆమోదం తెలిపే సందర్భంలో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించవచ్చు. క్యాబినెట్ సలహాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నర్ మంత్రిమండలి నిర్ణయానుసారం వ్యవహరిస్తే బిల్లును పున:పరిశీలన కోసం ఎన్నడూ పంపకూడదు. ఏ ప్రభుత్వం కూడా తాను రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా సలహా ఇవ్వదు.



