బీహార్ శాసనసభ ఎన్నికలు మన దేశ ఎన్నికల చరిత్రలో చెరగని గుర్తులుగా వుంటాయి. జూన్ 25న ప్రకటించిన ప్రత్యేక సమగ్ర పరిశీలన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు వయోజన ఓటింగుకు సరికొత్త కొలబద్దలను నిర్ణయించాయి.రాజ్యాంగాన్ని రూపొందించిన నాటి రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రజాస్వామ్యం వుండాలని ఆకాంక్షించాయి. దానికి పునాది ఎన్నికల ప్రజాస్వామ్యమే. పౌరుల పాత్రనే కీలక పునాదిగా నొక్కి చెప్పిన స్వాతంత్య్ర పోరాట వారసత్వ భావనతో ఈ విధమైన నిర్ణయం జరిగింది. కులం, మతం, భాష, సంస్కృతి, మూలం వంటి తేడాలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ ఒక్కో ఓటు వుండాలి. ఈ ఏర్పాటును గట్టిగా కొనసాగించడం కోసం ఎన్నికల కమిషన్‌కు నిజమైన శక్తిగల సంస్థగా స్వతంత్ర రాజ్యాంగ విభాగంగా సాధికారత కల్పించబడింది.
భారత ప్రజాస్వామ్య భవిష్యత్తునూ, దాని రాజకీయ వ్యవస్థనూ నిర్ణయించే అవకాశం పౌరులకు కల్పించాలని భావించబడింది. ఇందుకు చాలా సులభతరమైన రెండు సూత్రాలు రూపొందించారు. మొదటిది-రాజకీయ పార్టీల, ప్రభుత్వాల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషనే ఓటర్ల జాబితాలను తయారు చేయాలి. అందువల్ల ఈసీఐ యంత్రాంగమే తుది ఓటరు జాబితాలను ప్రచురించాలిగానీ వ్యక్తిగతంగా పౌరులపై ఆ భారం మోపలేదు. రెండవది-భారత పౌరులు ఓటరు జాబితాలో ఓటర్లుగా కనిపించే మాట నిజమే అయినప్పటికీ పౌరసత్వ నిర్ణయ బాధ్యత ఎన్నికల సంఘానికి అప్పగించలేదు. ఒకవేళ ఏదైనా తేడావస్తే హోంశాఖతో సంప్రదించి పరిష్కరించుకోవలసి వుంటుంది.
పునాది సూత్రాల ఉల్లంఘన
అయితే మొదటిసారిగా బీహార్‌లో ‘సర్’ ఈ రెండు సూత్రాల పునాదిని ఉల్లంఘించింది. ఎలాంటి వివాదం లేకున్నా సరే ఓటర్లు ఒక దరఖాస్తు భర్తీ చేయడం ద్వారా తమ ప్రవేశానికి హామీ పొందాలనేది ‘సర్’ భావనగా సాగింది. ఓటుకు అర్హతగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలను వారు సమర్పించాల్సి వచ్చింది. ఇది రెండో సూత్రంతో ముడిపడింది కూడా. ఈసీఐ నిర్దేశించిన అధికార పత్రాలు అచ్చంగా పౌరసత్వ సవరణ చట్టం కింద జాతీయ పౌరసత్వ రిజిస్టరు అవసరాలకు సరిపోయేవిగా వున్నాయి.
ఈ విధంగా అంతకు ముందు పౌరసత్వంపై ఏ వివాదమైతే విస్ఫోటనం చెందిందో, అంతుతేలని ప్రశ్నల వల్ల ప్రతిష్టంభనలో పడిపోయిందో దాన్నే దొడ్డిదోవన తీసుకు వచ్చినట్టయింది. ఇది బీహార్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది. దేశమంతటా చర్చ చెలరేగింది. ప్రధాన సమస్య ఏమంటే పౌరసత్వం కోసం ఏ ఒక్క పత్రమూ అధికారికంగా గుర్తించ బడలేదు. ఈ ప్రతిపాదిత ‘సర్’ మాత్రం విభజన నాటి విషాదాన్ని లోలోపల తిరిగి తీసుకొచ్చి నట్టయింది. లోతుగా ప్రశ్నించినప్పుడు పౌరసత్వానికి ఓటరు జాబితా ఖరారు చేయడానికి మధ్యలో ఏ సంబంధం లేదని ఇసిఐ ఖండిస్తుంది. అయితే వాస్తవంలో ఈ విధమైన కేంద్రీకరణ తేటతెల్లమవుతూనే వుంది.
అందువల్ల ఈ కసరత్తు కొంత కాలం సాగిన తర్వాత ఇది ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు ఉద్దేశించినది కాదనీ, సామూహిక తొలగింపులకూ ఓటు హక్కు తొలగించడానికి ఉద్దేశించిందని తేలిపోయింది. ఓటరు జాబితాల ముసాయిదాలు, వాటి తుది రూపం ప్రచురించాక వివాదం ఇంకా ముదిరింది. ఓటర్ల జాబితా తగ్గిపోవడం కళ్ల ముందు కనిపించింది. ‘సర్’ ప్రక్రియ రాజ్యాంగ ఆంతర్యాలు ఇంకా సుప్రీంకోర్టు నిర్ధారణగా చెప్పవలసే వుంది. ఈ ప్రక్రియ మొత్తం గణనీయమైన సంఖ్యలో ఓటర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేసిందనేది సుస్పష్టం. వలస కార్మికుల నిష్పత్తి చాలా ఎక్కువగా వుండటం, అందుబాటులో వున్న సమయం అత్యంత తక్కువ కావడం కారణంగా ఇది తథ్యంగా జరిగింది. ఓటరు జాబితాలలో మహిళా ఓటర్ల పేర్లు భారీగా తొలగించబడ్డాయి. సరిహద్దు జిల్లాల్లో మైనార్టీలు నివసించే ప్రాంతాలలోనూ ఈ తొలగింపు అధికంగా జరిగింది.
ముందస్తుగా తాయిలాలు
అలాగే ఈసీఐ పాత్రేమిటన్న స్పష్టమైన ప్రశ్న కూడా కీలకంగా ఆందోళనకు కారణమైంది. ఈసీఐ వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా పారదర్శకతా రతహింగా వుండటమే గాక పాలక పార్టీకి మేలు చేసే దిశలో పక్షపాత వైఖరి చాలా స్పష్టంగా గోచరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని ఈసీఐ అమలు చేసే విషయంలోనూ ఈ ధోరణి కానవచ్చింది. ఎన్నికల ప్రకటనకు కాస్త ముందుగా బీహార్‌లోని బీజేపీ,జేడీయూ ప్రభుత్వం కోటి మంది మహిళలకు తలకు పది వేల రూపాయలు జమచేస్తూ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన తీసుకొచ్చింది. ఈ భారీ లబ్ధి పథకం కింద ఎన్నికలు బాగా దగ్గరకొచ్చిన తరుణంలో 14వేల కోట్ల రూపాయలు వెనువెంటనే బట్వాడా అయ్యాయి. ‘ప్రభుత్వ సొమ్ముతో దాతృత్వం’ వంటి ఈ చర్య ఓటర్లను ప్రభావితం చేయకుండా వుండలేకపోయింది. ఆయా పార్టీలు, వ్యక్తులు రాజకీయ ఎంపికలను శాసించే పద్ధతిలో పేదలు గ్రహీతలుగా వుండిన గత పరిస్థితికి భిన్నం ఇది.
ఇదేగాక పాలక కూటమి 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, సామాజిక భద్రతా పింఛన్లు మూడింతలు చేయడం, కోటి ఉద్యోగాల కల్పన వాగ్దానాలు కూడా చేయకపోలేదు. తాయిలం రాజకీయాల గురించీ, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించీ ప్రధానమంత్రి మోడీ చెప్పే మాటలకూ ఇలాంటి వాగ్దానాలకూ పొసగదన్న మాట సరే. అలాంటి వాగ్దానాల ప్రకటనకూ వాస్తవంగా ఎన్నికల నిర్వహణకూ మధ్య తగినంత వ్యవధి వుండేలా ఎంసీసీని తిరగరాయాలన్న చర్చ ఇప్పటికే నడుస్తున్నది. అలాంటి చర్యలు ప్రజల దీర్ఘకాలిక శ్రేయస్సుకు సంబంధించిన అంశాల నుంచి దృష్టి మళ్లించాయనేది సుస్పష్టం, ప్రజల ఆలోచనల్లో మార్పు తేవడానికీ, మరీ ముఖ్యంగా అత్యంత దుర్భర పరిస్థితుల్లో వున్నవారిని తిప్పుకోవడానికీ ఉద్దేశించిన చర్యలివి.
విడ్డూరం విదితం
ఎన్నికల ఫలితాలు నిజంగానే ఆ విడ్డూరాన్ని ప్రతిబింబించాయి. మొత్తం మహిళా ఓటర్ల సంఖ్యనేమో తగ్గింది. అయితే వారు సాపేక్షంగా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. ఫలితంపైన నిర్ణయాత్మక ప్రభావం చూపించారు. ఈ లక్షణం ఇదివరలో కూడా వుండింది. కానీ ఇప్పుడు ‘సర్’ దెబ్బ తోడవడం, సాపేక్షంగా వలస పురుష కార్మికుల ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడంతో దాని ప్రభావం మరింత ప్రస్ఫుటంగా కనిపించింది.
వాస్తవాభివృద్ధి సమస్యలతో సం బంధం లేకుండా పోయిన ఈ పరిస్థితి మరింత బాగా విదితమవుతూ వచ్చింది. ఎందుకంటే వేతనాలు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం తదితర సామాజిక సూచికల్లో భారత దేశంలోని అత్యధిక రాష్ట్రాల కంటే బీహార్ వెనకబడి వుంది. కానీ దేశంలోని కార్పొరేట్ మీడియా మాత్రం నితీష్ కుమార్ ప్రభుత్వం గొప్ప కృషి వల్లనే పాలక కూటమి ఈ కీలక విజయం సాధించిందని చిత్రిస్తున్నది.
‘సర్’ అనేది నిరుపేదలూ దుర్భర జీవితాలు గడుపుతున్న విస్తార వర్గాల ప్రజల్లో ఒక విధమైన భయాందోళన కలిగించింది. పాలక కూటమి కుల, మత ప్రభావం దాన్ని మరింత తీవ్రం చేసిందనేది కూడా వాస్తవం. అమిత్‌షా కనిపెట్టారని చెబుతున్న ఓట్ మేనేజ్‌మెంట్ వ్యవహారం చిన్న పార్టీలనూ స్వతంత్ర అభ్యర్థులనూ మటుమాయం చేసింది. వారు తెచ్చుకునే ఓట్లు పూర్తిగా పాలక కూటమి వైపు మరలేలా చేసింది. కొన్ని చిన్నపార్టీలకు సీట్లపరంగా పెద్ద ప్రభావం చూపలేకపోయినా వారి ఓట్లశాతం ప్రతిపక్షానికే నష్టం కలిగించాయి. భారీ ప్రచారం పొందిన ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్ పార్టీ’, సీమాంచల్‌లో మజ్లిస్ పార్టీ పాత్ర ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
నిరంతర సమరం
ఇవన్నీ ఎన్ని చెప్పినా ఏం చేసినా ‘ఇండియా’ వేదిక పార్టీలు అంతరావలోకనం చేసుకోవలసింది కూడా చాలా వుంది. ప్రజల జీవితాలనూ జీవనోపాధినీ దెబ్బతీసే సమస్యలు చాలా వున్నప్పటికీ ప్రతిపక్షం వాటిపై ప్రజాభిప్రాయాన్ని ప్రజ్వలింపచేయడంలో విఫలమైంది. పాలక కూటమిని వెనక్క కొట్టలేకపోయింది. మరింత లోతుగా మధించవలసిన, కలసి మెలసి పరిశీలించవలసిన అంశాలు అనేకం వున్నాయి. సీపీఐ(ఎం)తో సహా వామపక్షాలు నిర్విరామంగా పనిచేశాయి. గణనీయంగా ఓట్లు కూడా తెచ్చుకున్నాయి. కానీ ఆ ఓట్లు శాసనసభ ప్రాతినిధ్యంగా అనువదించుకోవడంలో సఫలత లేదు. సమస్యలపై ప్రజా పోరాటాలను పునరుధృతం చేయడంలోనే భవిష్యత్తు ఇమిడి వుంది. ప్రభుత్వ కుమ్మక్కుతో, మొత్తం నయా ఫాసిస్టు పోకడలతో హిందూత్వ కార్పొరేట్ ఆక్రమణకు వ్యతిరేకంగా నిరంతర రాజకీయ ఉద్యమం సాగించవలసి ఉంటుంది. సక్రమమైన ఎన్నికల వ్యవస్థ కోసం, న్యాయమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడాలంటే అలాంటి నిరంతర సమరం చేయవలసే వుంటుంది.
(నవంబరు 19 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
బీహార్ ఫలితాల సంకేతం, భవిష్యత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



