Saturday, November 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం

రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం

- Advertisement -

హైదరాబాద్‌లో విలువైన భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను
9,292 ఎకరాల భూమిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర
హెచ్‌ఐఎల్‌టీపీ విధానం దేశ చరిత్రలోనే పెద్ద స్కాం
ఆ భూములను పారిశ్రామికవేత్తలు తీసుకోవద్దు
ఎవరు తీసుకున్నా మా ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు తప్పవు
దీనిపై న్యాయపోరాటం చేస్తాం
ఆ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి
ఫార్ములా ఈ కారు రేస్‌లో నా తప్పులేదు
లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమే : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో విలువైన భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్ను పడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. రూ.ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హెచ్‌ఐఎల్‌టీపీ) పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.ఐదు లక్షల కోట్ల భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమని కేటీఆర్‌ అభివర్ణించారు.

ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్‌ ఎస్టేట్‌ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టీపీ వాస్త వానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ-ఉపయోగ విలువైన రియల్‌ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించబడిందని అన్నారు. ఇది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదనీ, రూ.ఐదు లక్షల కోట్ల కుంభకోణం కోసం రూపొందించిన బ్లూప్రింట్‌ ఆరోపించారు. దీనిద్వారా సీఎం రేవంత్‌రెడ్డి రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు కొల్లగొట్టాలని చూస్తున్నారని వివరించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్‌రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని అన్నారు.

ఆ భూములకు బహిరంగవేలం నిర్వహించాలి
హైదరాబాద్‌లోని బాలానగర్‌, జీడిమెట్ల, సనత్‌నగర్‌, అజామాబాద్‌తోసహా కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ విధానాన్ని ప్రభుత్వం తెచ్చిందని కేటీఆర్‌ చెప్పారు. ఈ భూముల మార్కెట్‌ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉందని వివరించారు. దీని విలువ మొత్తం రూ.4.50 లక్షల కోట్ల నుంచి రూ.ఐదు లక్షల కోట్ల మధ్య ఉంటుందని చెప్పారు. ఆ భూములను రేవంత్‌రెడ్డి కేవలం ప్రభుత్వ విలువలో 30 శాతానికే అప్పగించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అజామాబాద్‌ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరిం చినప్పుడు, ఎస్‌ఆర్‌ఓ రేట్ల కంటే 100 శాతం నుంచి 200 శాతానికి అధికంగా వసూలు చేయాలని చట్టం చేశామని గుర్తు చేశారు.

ఆ చట్టాన్ని సవరించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 30 శాతానికే కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి లాభం చేకూర్చడానికి? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మార్కెట్‌ ధరలు, ఎస్‌ఆర్‌ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కనీసం ఎస్‌ఆర్‌ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదన్నారు. ప్రభుత్వానికి డబ్బు అవసరమైతే ఆ భూములను బహిరంగ వేలం వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు.

ముందస్తు ఒప్పందంలో భాగమే ఈ విధానం
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని కేటీఆర్‌ అన్నారు. అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని చెప్పారు. ప్రభుత్వ భూమిని ప్రయివేట్‌ వ్యక్తుల ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేమన్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఏడు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ, ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. రూ.లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హెచ్‌ఐఎల్‌టీపీని ఏటీఎంగా మార్చిందన్నారు. దీనివెనుక ఉన్న ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదనీ, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్దఎత్తున ధనవంతులుగా మార్చడమేనని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన కంటే రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, మెట్రోరైల్‌, హెచ్‌సీయూ భూములు ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల రేవంత్‌రెడ్డి దృష్టిసారించారని వివరించారు.

నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు
ఫార్ములా ఈ కారు రేస్‌కు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్‌ చిట్‌చాట్‌లో అన్నారు. లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనని గతంలోనే ప్రకటించానని గుర్తు చేశారు. తనను అరెస్టు చేసే ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డి చేయబోరని చెప్పారు. ఆ కేసులో ఏమీ లేదని తెలుసన్నారు. విచారణకు గవర్నర్‌ అనుమతి అవసరం లేకున్నా పంపించారని అన్నారు. గవర్నర్‌ లీగల్‌ ఓపీనియన్‌ ఓసం పంపడంతో పది వారాల సమయం పట్టిందన్నారు. ఈ అంశాన్ని సాగదీయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని చెప్పారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేయించి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు.

బీజేపీ స్పందించాలి
ఇందిరమ్మ ఇండ్లు, స్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్‌లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగిస్తోందని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని సూచించారు. లేదంటే ముంబయి మాదిరిగా బహిరంగ వేలం వేయాలని కోరారు. ప్రభుత్వం 50 శాతం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, మిగిలిన 50 శాతం క్రమబద్ధీకరించాలని అన్నారు. కానీ కాంగ్రెస్‌ వంద శాతం భూమిని చౌక ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తోందన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ అంశంపై స్పందించాలని బీజేపీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీన్ని వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.ఐదు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ఈ భూములపై ప్రజల్లో చైతన్యం పెంచుతూనే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, నాయకులు తుల ఉమ, క్రిశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -