బిల్లుల ఆమోదించడంపై తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై : రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు క్లియర్ చేయడానికి గడువు విధించే వరకూ విశ్రమించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. గవర్నర్లకు కాలపరిమితి నిర్ణయించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను సవరించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానంగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ ఏడాది ఏప్రిల్ 8న అదే కోర్టు వెల్లడించిన ఆదేశాలపై ‘ప్రభావం చూపదు’ అని కూడా స్టాలిన్ తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి నిరవధికంగా నిలిపివేసిన పది బిల్లులు ఆమోదం పొందినట్టుగానే భావించాలని ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రాల హక్కులు, నిజమైన సమాఖ్యవాదం కోసం డీఎంకే పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ ఈ పోస్టులో స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర గవర్నర్ రవి యొక్క ”పాకెట్ వీటో సిద్ధాంతం”, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాజ్ భవన్ చంపవచ్చు లేదా పూడ్చిపెట్టవచ్చు అనే వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని స్టాలిన్ వివరించారు. ”తమిళనాడు గవర్నర్‌తో సహా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలతో విభేదిస్తున్న దేశంలోని గవర్నర్లపై మా న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఎన్నికైన ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలని, ప్రజా అభీష్టానికి జవాబుదారీగా ఉండాలని గవర్నర్లపై ఒత్తిడి తీసుకొస్తాం’ అని స్టాలిన్ చెప్పారు.
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక రోజు తర్వాత స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్ రవితో అనేక అంశాలపై, ముఖ్యంగా ఉన్నత విద్య, రాష్ట్ర నిధులతో నడిచే విశ్వవిద్యాలయాల విషయాలపై సంఘర్షణ పడుతుంది. అలాగే గవర్నర్ పది బిల్లులను నిరవధికంగా నిలిపిఉంచడంపై సుప్రీంకోర్టును స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు చేస్తున్న న్యాయపోరాటంతో బిల్లుల ఆమోదానికి గవర్నర్లు నిరవధికంగా ఆటంకం కలిగిస్తే, తాము చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించుకునే అవకాశం న్యాయస్థానాలకు లభించింది.
ఎన్నికైన ప్రభుత్వం డ్రైవర్ సీటులో ఉండాలని, రాష్ట్రంలో రెండు కార్యనిర్వాహక అధికార కేంద్రాలు ఉండకూడదని, రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నవారు రాజ్యాంగ చట్రంలోనే వ్యవహరించాలని, రాజ్యాంగానికి అతీతంగా వ్యహరించకూడదని ధర్మాసనం పునరుద్ఘాటించిందని స్టాలిన్ తన ప్రకటన తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రద్దు చేయడానికి లేదా పాకెట్ వీటోను ఉపయోగించడానికి గవర్నర్‌కు నాలుగో ఎంపిక లేదని కూడా సుప్రీంకోర్టు కూడా పునరుద్ఘాటించిందని స్టాలిన్ తెలిపారు. ‘బిల్లులపై చర్య తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా జాప్యం చేయలేరు.
గవర్నర్ సుదీర్ఘమైన, నిరవధిక జాప్యం చేసిన సందర్భాల్లో, రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చు’ అని స్టాలిన్ అన్నారు. ఏ రాజ్యాంగ అధికారం కూడా రాజ్యాంగానికి అతీతంగా కాదని తాను నమ్ముతున్నానని, రాజ్యాంగం ద్వారా ఎన్నికలైన అధికారులే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, కోర్టులు తలుపులు మూసివేయకూడదని స్టాలిన్ తెలిపారు. ‘రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరించే గవర్నర్ల చర్యలు రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రోత్సహిస్తాయి. ప్రజాస్వామ్యంలో చట్ట పాలనను దెబ్బతీస్తాయి. కాబట్టి తమిళనాడు ప్రజల అభీష్టం చట్టం ద్వారా నెరవేరే వరకు, ఈ దేశంలోని ప్రతి రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసేలా చూస్తామని హామీ ఇస్తున్నాను’ అని స్టాలిన్ ఈ ప్రకటనలో తెలిపారు.



