పాత్రికేయులకు ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి
హైదరాబాద్ అదనపు కలెక్టర్‌కు హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్ వినతి
త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం
అడ్‌హక్ కమిటీ కన్వీనర్ రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ అదనపు కలెక్టర్ కదిరవన్ పళనిని అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, హెచ్‌యూజే కార్యదర్శి బి జగదీశ్వర్ నేతృత్వంలో కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.
అనంతరం మీడియాతో రాంచందర్, బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచించారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును మూడు నెలలకోసారి పొడగించడం సరైంది కాదని అన్నారు. స్టిక్కర్ విధానం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు దాదాపు 40 వేల హెల్త్ కార్డులు ఉన్నాయని వివరించారు. వాటిని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు అనుమతించడం లేదన్నారు. హైదరాబాద్‌లో కేవలం నిమ్స్ ఆస్పత్రిలోనే పాక్షికంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు కొత్త విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనీ, అదే విధానాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కంట్రీబ్యూషన్ మాత్రం ప్రభుత్వమే భరించాలని సూచించారు. జర్నలిస్టులపై ఇటీవల దాడులు పెరిగాయనీ, వాటి నిరోధానికి వెంటనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీస్, న్యాయ, రెవెన్యూ, సమాచార, జీఏడీ శాఖలతో కలిపి హైపవర్ కమిటీలను నియమించాలని కోరారు.
కార్మికశాఖ పరిధిలో ఉన్న త్రైపాక్షిక కమిటీలను ప్రకటించి, సమావేశాలు ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలనీ, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, మాణిక్ ప్రభు, రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్, హెచ్‌యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి రాజశేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు చిట్యాల మధుకర్, ఉపాధ్యక్షులు బి కాలేబ్, జి రేణయ్య, సంయుక్త కార్యదర్శులు వంగాల రమేష్, కే నర్సింహ, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ మురహరి, కే వెంకటస్వామి, టీ బ్రహ్మయ్య, నాయకులు విశాల్ తదితరులు పాల్గొన్నారు.



