ప్చ్‌…

Ph...– పట్టణ స్థానిక సంస్థల పనితీరుపై కాగ్‌ ఆందోళన
– వనరులు-వ్యయం మధ్య అంతరం 42 శాతం
– అభివృద్ధి పనులకు వెళ్లేది 29 శాతమే
– సిబ్బందిలో సగటున 37 శాతం ఖాళీలు
– తెలుగు రాష్ట్రాలతో సహా 18 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో పరిస్థితులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. వనరులకు వ్యయానికి మధ్య తీవ్ర అంతరాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని పట్టణ స్థానిక సంస్థల్లో ఈ అంతరం 42 శాతంగా ఉన్నదని గుర్తించింది. ఇవి చేసే వ్యయంలో 29 శాతం మాత్రమే ప్రణాళికాబద్దమైన అభివృద్ధి పనికి వెళ్తున్నదని వివరించింది. దేశంలో పట్టణ స్థానిక సంస్థలకు అధికారాన్ని కల్పించే 74వ రాజ్యాంగ సవరణ 1993లో అమలులోకి వచ్చింది. అయితే, 31 ఏండ్ల తర్వాత కూడా ఈ 18 రాష్ట్రాలు ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయటం లేదని కాగ్‌ గుర్తించింది. 18 రాష్ట్రాల్లో 74వ రాజ్యాంగ సవరణ అమలు విషయంలో ఆడిట్‌ నివేదికల కంపెండియంను కాగ్‌ ఇటీవల విడుదల చేసింది. తెలంగాణ, ఏపీలతో పాటు అసోం, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని మొత్తం 393 పట్టణ స్థానిక సంస్థ(యూఎల్‌ఎస్‌జీ)లను ఇది కవర్‌ చేసింది.
కాగ్‌ సమాచారం ప్రకారం.. పట్టణ సంస్థలు సగటున 32 శాతం రెవెన్యూను స్వంతంగా సమకూర్చు కుంటున్నాయి. మిగతాది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నది. సంస్థల ప్రస్తుత వ్యయంలో 29 శాతం మాత్రమే అభివృద్ధి పనులకు వెళ్తున్నాయి. ఇక, వీటిలో సిబ్బంది కొరత కూడా ఆందోళన కలిగిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థల్లో మంజూరైన పోస్టులలో 37 శాతం ఖాళీలు ఉన్నాయి. 16 రాష్ట్రాల్లోని పట్టణ సంస్థలకు నియామకాల విషయంలో ఎలాంటి అధికారమూ లేకపోవటం గమనార్హం.
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్రాలు.. పట్టణ స్థానిక సంస్థలకు 18 పనులను పంపిణీ చేయాలి. ఇందులో పట్టణ ప్రణాళిక, భూమి వినియోగం, నిర్మాణ నియంత్రణ, నీటి సరఫరా, ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళిక, ప్రజారోగ్యం వంటివి ఇందులో ఉంటాయి. అయితే, ఈ 18లో 17 పనుల పంపిణీ జరిగిందని కాగ్‌ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిశా, పంజాబ్‌, త్రిపుర వంటి తొమ్మిది రాష్ట్రాల్లో పూర్తిగా 18 పనుల పంపిణీ జరిగింది. పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక సేవలు అనేవి చట్టం చేత తక్కువగా పంపిణీ చేయబడిన విధులుగా కాగ్‌ క్లుప్తీకరించింది. రాష్ట్రాలు 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన ‘స్ఫూరి’్త సరిగా గ్రహించలేదని కాగ్‌ వివరించింది. పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించబడిన విధుల్లో నాలుగు మాత్రమే ‘పూర్తి స్వయం ప్రతిపత్తి’తో ఉన్నాయని పేర్కొన్నది. ప్రణాళిక వంటి కీలకమైన విధుల్లో రాష్ట్రాలు.. పట్టణ స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయాలని కాగ్‌ సిఫారసు చేసింది.

Spread the love