ట్రంప్ కొత్త ప్లాన్
హార్ముజ్‌లో ప్రవేశిస్తే అమెరికా బలగాలపై దాడి చేస్తాం : ఇరాన్ సైన్యం హెచ్చరిక
వాష్టింగ్టన్, టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించారు. యుద్ధ కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఓడలను ఈ ప్లాన్ కింద అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ప్లాన్ సోమవారం ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. ”ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఓడలు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని మమ్మల్ని అభ్యర్థించాయి. మేము వాటిని సురక్షితంగా గైడ్ చేస్తాం. ఈ ప్రక్రియలో ఎవరైనా అడ్డుపడితే బలప్రయోగం చేసి ఎదుర్కొంటాం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. ఈ ప్లాన్ ప్రకారం నిష్పాక్షిక దేశాల ఓడలకు మాత్రమే సహాయం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ ఆపరేషన్‌లో గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు, వందకి పైగా విమానాలు, డ్రోన్లు, 15,000 మంది సైనికులు పాల్గొంటారు. ఇది పూర్తి ఎస్కార్ట్ మిషన్ కాదని, గైడెన్స్, కోఆర్డినేషన్ ఆధారితమని అధికారులు చెప్పారు. విశ్లేషకులు మాత్రం ఈ ప్లాన్ ను కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనగా విమర్శిస్తున్నారు. ఈ ప్లాన్ తో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ లో పాలనను ఉక్కిరిబిక్కిరి చేస్తామని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధింపై అమెరికా చేస్తున్న దిగ్బంధనం విస్తృత ఆర్థిక ఆంక్షలలో ఒక భాగం మాత్రమే అని అన్నారు.
హార్ముజ్ భద్రత ఇరాన్ సైన్యం నియంత్రణలోనే…
హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తే అమెరికా బలగాలపై దాడి చేస్తామని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరిక చేసింది. ఈ జలసంధిలో అమెరికా జోక్యం చేసుకుంటే అది కాల్పుల విరమణ ఉల్లంఘనగా భావిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ”ఏ విదేశీ సాయుధ దళం, ముఖ్యంగా దూకుడు స్వభావం గల అమెరికా సైన్యం హార్ముజ్ జలసంధిని సమీపించడానికి లేదా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, వాటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాం” అని ఇరాన్ సైన్యం సెంట్రల్ కమాండ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ”హార్ముజ్ జలసంధి భద్రత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల నియంత్రణలో ఉందని మేము పదేపదే చెబుతున్నాం. అన్ని పరిస్థితుల్లో, ఏ సురక్షితమైన ప్రయాణం కోసమైనా ఈ దళాలతో సమన్వయం చేసుకోవాలి” అని వివరించారు.
ప్రాజెక్ట్ ఫ్రీడమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



