Tuesday, May 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

- Advertisement -

ప్రభుత్వానిది మొద్దు నిద్ర
కరీంనగర్‌ దోపిడీ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
మంత్రులెక్కడీ బండి సంజరు వైఖరిపై విమర్శ

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, నేరాల్లో రాష్ట్రం బీహార్‌, ఉత్తరప్రదేశ్‌తో పోటీ పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన దోపిడీ, కాల్పుల నేపథ్యంలో సోమవారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ”ప్రభుత్వం, పోలీసులు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, సోషల్‌ మీడియా పోస్టులకు వేధించడంపై చూపే శ్రద్ధ.. ప్రజల భద్రతపై చూపడం లేదు. కరీంనగర్‌లో పట్టపగలు తుపాకులతో వచ్చి దోపిడీ చేయడం అత్యంత దుర్మార్గం. ఘటన జరిగి 32 గంటలైనా నిందితులను పట్టుకోకపోవడం పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం’ అని విమర్మించారు. కేసీఆర్‌ హయాంలో కరీంనగర్‌ను సేఫ్‌ సిటీగా మార్చేందుకు 769 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించామని, గంగుల కమలాకర్‌ చొరవతో వేల సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నేడు నేరగాళ్లకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని, దుండగులు పారిపోయింది పోలీసుల భయంతో కాదనీ.. షాపు సిబ్బంది చనిపోయారని భావించి మాత్రమే’ అని అన్నారు.

బండి సంజయ్ వైఖరిపై ప్రశ్నలు
‘నగల దుకాణంలో నలుగురు సిబ్బందికి తుపాకీ గాయాలైతే, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒక్కరికైనా బాధితులను చూసే సమయం లేదా? కేంద్ర మంత్రి బండి సంజరుకి శవాల మీద రాజకీయాలు తప్ప ఏమీ తెలియదు. రాష్ట్రంలో దోపిడీ జరిగితే హోంశాఖను, రేవంత్‌రెడ్డిని నిలదీయాల్సింది పోయి బీఆర్‌ఎస్‌పై పడతారేంటి? రేవంత్‌రెడ్డిపై సంజరుకి అంత ప్రేమ ఎందుకు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పోలీసులు 20 ఏండ్ల నాటి కేసులను తవ్వి తీసి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు కాపాడలేని పోలీస్‌ వ్యవస్థ ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కూర్చోవడం కాదని, శాంతి భద్రతలను కమాండ్‌ చేయడం నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, దోపిడీ దొంగలను వెంటనే పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకే రవిశంకర్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -