Saturday, August 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం

ఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం

- Advertisement -

​‘ఫీజు’ కోసం ఏటా రూ.2,400 కోట్లు
దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే విద్యార్థుల ఖాతాల్లో జమ
పిల్లలను కుల వృత్తులకే పరిమితం చేసేందుకు యత్నించిన బీఆర్‌ఎస్‌
ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా ఫూలే విధానాలతో తమ ప్రభుత్వం ముందుకెళుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులెవరూ ఇబ్బంది పడకుండా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ముందుగానే రూ.2,400 కోట్లను కేటాయించామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ విద్యార్థికి నెల రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని భరోసానిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పిల్లలను ఆయా కులవృత్తులకే పరిమితం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. అందుకు భిన్నంగా ఆయా వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. అంటరానితనం, ఆకలికేకలు, మూఢ నమ్మకాలు, మహిళకు చదువు అనేది ఊహకందని కాలంలోనే ఫూలే చదువుకోవటమేగాక, తన సతీమణిని కూడా చదివించారని సీఎం గుర్తు చేశారు. చదువు విలువ తెలిసిన ఫూలే దంపతులు భవిష్యత్తును ముందుగానే ఊహించి, చిరస్మరణీయులయ్యారని కొనియాడారు.

కుల నిర్మూలనకు సామాజిక చైతన్యం అవసరమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాల పిల్లలు వేర్వేరుగా కుండా ఒకే దగ్గర చదివేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూపకల్పన చేయబోతోందని తెలిపారు. చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అలాంటి వారికి జర్మనీ, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల్లో అవకాశాలను ఇప్పించే బాధ్యత తమదని ప్రకటించారు. క్రీడల్లో రాణించే వారికి నగదు నజరానాలతో పాటు ఉద్యోగాలిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణాయేనని చెప్పారు. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత మళ్లీ కులగణన చేసిన ప్రభుత్వం కూడా తమదేనని వివరించారు. శాస్త్రీయ సర్వేతో బలహీనవర్గాల లెక్కలు తేల్చి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరామని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కోర్టుల ద్వారా ఆపాలని ప్రయత్నించినా, అసెంబ్లీలో ఆటంకాలు సృష్టించినా తాము వెనుకడుగు వేయలేదన్నారు.

గొప్పలు చెప్పుకునే మోడీ గుజరాత్ లో వర్గీకరణను అమలు చేయలేదని విమర్శించారు. దేశంలో జనగణనతో పాటు కుల సర్వే చేయడాన్ని తాము తప్పనిసరి చేశామన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిస్తున్నట్టు తెలిపారు. ‘చదువు తలరాతను మారుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. దేశ ప్రతిష్టను ప్రపంచంలో పెంచుతుంది. ఫూలే చెప్పిందిదే. నాణ్యమైన విద్యనందించే బాధ్యత నాదే. తల్లిదండ్రులకు భారం కానివ్వకుండా విద్యార్థులు చదివినంత మేరకు చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం…’ అని సీఎం హామీ ఇచ్చారు. ఈ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు విహెచ్, కేకే, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -