నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో, రైస్ మిల్లులు ఏర్పాటు మహిళల కోసం, ఉచిత బస్సు సౌకర్యం, బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రైస్ మిల్లుల కొరతను దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్లులను నిర్వహించే బాధ్యతను కూడా వారికి అప్పగించాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణం మంజూరు చేసి ఆర్ అండ్ బి శాఖ ద్వారా రైస్ మిల్లులు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.
శనివారం అయన నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీకార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పైలెట్ పద్ధతిన నల్లగొండ జిల్లాలో మహిళల చేత రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లుల కొరతను ఈ విధంగా తీరుస్తామని తెలిపారు. ఇందుకుగాను వారికి ముందుగా రుణాలు అందజేసి రైస్ మిల్లులను వారే నిర్వహించుకునేలా దానిపై వచ్చే లాభం ద్వారా ప్రతినెల తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా, తద్వారా లాభం పొందే విధంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.
ఇందుకుగాను అవసరమైన స్థలాలను చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లులు ఏర్పాటు చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేలా చూస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కు ఉచిత బస్సు సౌకర్యాన్ని, బస్సులను వారే నిర్వహించుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కేటాయింపు, బడి పిల్లల యూనిఫామ్ లు కుట్టే బాధ్యత అప్పగించామని తెలిపారు. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారి నిలబడినమే కాకుండా, కుటుంబాలను పోషించుకుంటూ ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు. మహిళలు స్వయంకృషితో పైకి వచ్చేందుకు పెట్రోల్ పంపులు కేటాయించామని, నల్గొండ జిల్లాలో రద్దీ ప్రాంతంలో ఎస్ఎల్బీసీలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ద్వారా ప్రతినెల 10 లక్షల ఆదాయం పొందడానికి అవకాశం ఉందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరానికి తగ్గట్టుగా మహిళా సంఘాల కే కాక రాష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం చీరల డిజైన్ కు ఏడాది పాటు ఆలోచించి మంచి నాణ్యమైన చీరలను మహిళలకు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరలకు గాను, ప్రస్తుతం 65 లక్షలు రావడం జరిగిందని ,మరో 35 లక్షలు రాగానే పట్టణాలలోని మహిళలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిజిహెచ్ , మెడికల్ కళాశాలలు ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. జిజిహెచ్ లో ప్రతినెల 800 డెలివరీలతో పాటు, అత్యాధునిక శస్త్ర చికిత్సలు కూడా చేస్తున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షల పెంచామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, తాను సొంత నిధులతో ఏఎంఆర్పి కాలువలను బాగు చేయించానని వెల్లడించారు.
మహిళలు పిల్లల్ని బాగా చదివించుకోవాలని, వారు కుట్టుమిషన్ ల ద్వారా శిక్షణ పొందేందుకు, ఇతర నైపుణ్యాల అభివృద్ధి కోసం న్యాక్ ద్వారా భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తయితాయని, మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో నల్లగొండ నియోజకవర్గంలో పదివేల ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.29 వేల కోట్లను ఇందిరమ్మ ఇండ్లపై ఖర్చు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రూ.400 కోట్లతో నల్లగొండ జిల్లాలో డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట చేస్తున్నదని, ఇందులో బాగానే మంచి నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు ,ఉచిత బస్సు, బస్సు నిర్వహణ వంటి సౌకర్యాలు కలగజేసామని ,వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఇందిరా మహిళల శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఇవి మంచి సిల్క్, కాటన్ చీరలని, సిరిసిల్లలో తయారైనవని, అర్హులైన ప్రతి ఒక్కరికి చీర అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాలు గ్రామాలలో నిర్వహించే సమావేశాలలో ఆర్థిక అంశాల తో పాటు, సామాజిక అంశాలను కూడా చర్చించాలని అన్నారు. ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఆర్థికంగా సహాయం చేసి మహిళలు బాగుపడేందుకు సహకారం అందిస్తామని, మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతకుముందు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి జిల్లా మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
రూ. 2 కోట్ల 20 లక్షల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ తో పాటు, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి రూ. 2 కోట్ల 20 లక్షల విలువచేసే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, , అధికారులు పాల్గొన్నారు.




