జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలోని యువత తమలో దాగి ఉన్న కళను ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలుర పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనవరి, 12న జరిగే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లోని యువత కళను వెలికి తీసి ఉత్తమంగా రాణించిన కళాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పంపించేందుకు నిర్వహిస్తున్న యువజనోత్సవ కార్యక్రమంలో ఫోక్ డ్యాన్స్, చిత్ర లేఖనం, పాటలు, వక్తృవ, ఉపన్యాస పోటీలు తదితర 7 రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అలుపెరగకుండా సాధన వైపు దూసుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని యువత తమ అత్యుత్తమ కళా ప్రదర్శన ద్వారా డిసెంబర్ లో జరిగే రాష్ట్ర స్థాయి, జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవ వేడుకల్లో రాణించి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్థానికంగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని యువత సద్వినియోగం చేసుకొని, శారీరక దృఢత్వంతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్ రెడ్డి యువజనోత్సవాల ప్రాధాన్యతను యువతకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి అబ్దుల్ ఘని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిప్యూటీ కలెక్టర్ శ్రావ్య, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆనంద్, పి.డి సురేందర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



