వివిధ ప్రాంతాల్లో నోటిఫికేషన్ కాపీలు దహనం
ఈ నెల 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు
కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరుకు సిద్ధం అయ్యాయి. కార్మిక కోడ్‌లను సమర్థించే వారికి గుణపాఠం చెప్తామనీ, వాటిని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఈనెల 26న దేశవ్యాప్తంగా ఆందోళనలకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, స్వతంత్ర పారిశ్రామిక సమాఖ్యల ఐక్య ఉద్యమం పిలుపునిచ్చింది. కేంద్రం నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకొచ్చిన 24 గంట ల్లోనే వేలాది మంది కార్మికులు ఆగ్రహంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల గేట్లు, పని ప్రదేశాల వద్ద నోటిఫికేషన్ కాపీలను దహనం చేశారు. లేబర్ కోడ్‌లను నిరసిస్తూ సైప్రస్‌లో జరిగే యూఐటీబీబీ ప్రపంచ కాంగ్రెస్ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ మోసపూరిత వాదనలకు సీఐటీయూ ఖండన
కేంద్రం చేసిన మోసపూరిత వాదనలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రకటన విడుదల చేశారు. ఈ కోడ్‌లను ‘కార్మిక అనుకూల, ఆధునికీ కరణ’మైనవిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఇవి రద్దు చేయడం దారుణమన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.
కార్మికుల హక్కులను నీరుగార్చే ప్రయత్నం : ఎస్‌ఎఫ్‌ఐ
కార్మిక వ్యతిరేక కోడ్‌లను అమలు చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం సాజి, శ్రీజన్ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. కార్మిక వర్గంపై బహిరంగంగా భారాలను మోపడమే దీని లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 26న జరిగే ఆందోళనల్లో పాల్గొనాలని దేశంలోని వారు విద్యార్థి లోకానికి పిలుపు ఇచ్చారు.
శ్రామికులకు మరణ శాసనం : ఏఐఏడబ్ల్యూయూ
నాలుగు లేబర్ కోడ్లు శ్రామికులకు, కార్మికులకు మరణ శాసనం లాంటిదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి. వెంకట్ విమర్శించారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, ఈనెల 26న జరిగే ఆందోళనల్లో వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ బిల్లుల కాపీలను దహనం
చేయాలని కోరారు.
రైతులు లేబర్ కోడ్ కాపీలను తగలబెట్టాలి : ఏఐకేఎస్ పిలుపు
గ్రామాల్లో నాలుగు లేబర్ కోడ్ కాపీలను తగలబెట్టాలని రైతులు, వ్యవసాయ కార్మికులకు ఏఐకేఎస్ పిలుపునిచ్చింది. ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, విజూ కృష్ణన్ ప్రకటన విడుదల చేశారు. ఈ కోడ్‌లు పని దినాన్ని 12 గంటలకు పొడిగించడానికి అనుమతిస్తాయని, కఠినమైన నిబంధనలు కార్మిక సంఘాల ఏర్పాటు, వేతనం కోసం చర్చలు, సమ్మె హక్కును దాదాపు అసాధ్యం చేస్తాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం వెంటనే తిరోగమన కార్మిక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, కార్మికులకు, యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని జరిగే పోరాటానికి ఏఐకేఎస్ పూర్తి మద్దతును అందిస్తుందనీ, 26న జరిగే రాష్ట్ర, జిల్లాస్థాయి ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.



