Sunday, November 23, 2025
E-PAPER
Homeజోష్టైం బ్యాంక్‌లో టైం దాచుకుందాం

టైం బ్యాంక్‌లో టైం దాచుకుందాం

- Advertisement -

‘బ్యాంక్‌’ అనగానే మనకు డబ్బులే గుర్తుకొస్తాయి. ఆర్థిక లావాదేవీల క్రెడిట్‌, డెబిట్‌లే కళ్లెదుట మెదులుతుంది. ఈ కొత్త బ్యాంక్‌లో అస్సలు పైసలతో పనే ఉండదు. క్రెడిట్‌, డెబిట్‌ లావాదేవీలన్ని ‘టైం’ రూపంలోనే జరుగుతాయి. అవును సమయం చాలా విలువైనది. ఒకసారి చేజారితే ఇక తిరిగి రాదు. ఈ మాటలు ముమ్మాటికీ నిజమైనప్పటికీ, మీ సమయాన్ని ముందు రోజుల కోసం కొద్దికొద్దిగా దాచుకునే అవకాశం ఒకటి ఉంది. దాన్ని తిరిగి వాడుకునే వెసులుబాటూ ఉంది. అదెలా సాధ్యం అంటారా… మీరు యవ్వనంలో ఉండగా వద్ధులతో గడిపిన సమయాన్ని మీకు అవసరం ఉన్నప్పుడు తిరిగివ్వడమే ‘టైం బ్యాంక్‌’ సిద్ధాంతం. ఇంతకీ ఎమిటీ ‘టైం బ్యాంక్‌’? ఇది ఎక్కడుంది? ఎలా పనిచేస్తుంది? దీనిలో ఎవరైనా ఖాతాను తెరవొచ్చా?ఇలా అనేక ప్రశ్నలు రావడం సహజమే. జపాన్‌ నుంచి తీసుకున్న ఈ విధానం ఇప్పుడు కేరళలో అమలుకానుంది. కథనం మీకోసం.

సమాజ సేవ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని భావించే వారు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సేవా సంస్థల్లో చేరుతుంటారు. ఆయా స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగమై ఆత్మ సంతప్తిని పొందుతుంటారు. ఈ విధంగా సమాజ సేవకు, మానవ సేవకు సమయాన్ని కేటాయించేందుకు ముందుకొచ్చే మానవతావాదులను ప్రోత్సహించాలనే గొప్ప సంకల్పంతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక బ్యాంక్‌ ఏర్పాటైంది. దాదాపు 20 మందికిపైగా సమాజ సేవకులు కలిసి ‘టైమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (Time Bank ofIndia)ను స్థాపించారు.

జపాన్‌ కాన్సెప్ట్‌తో ‘టైమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’
‘టైం బ్యాంక్‌’ అనే కాన్సెప్ట్‌ తొలుత 1973 సంవత్సరంలో జపాన్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఓల్డ్‌ ఏజ్‌ హోంలలో ఉంటున్న వయో వద్ధులకు సేవ చేయడానికి సమయాన్ని కేటాయించగలిగే వారు జపాన్‌లోని టైం బ్యాంక్‌లలో చేరేవారు. తదుపరి కాలంలో ఈ కాన్సెప్ట్‌ ఇతర దేశాలకూ వ్యాపించింది. కొన్ని దేశాల్లోనైతే టైం బ్యాంకులకు ప్రభుత్వాలు ఏటా నిధులను కేటాయిస్తుంటాయి. తద్వారా సమాజ సేవ దిశగా వాటికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

కేరళ మోడల్‌:
వయసు పెద్దదవుతున్న కొద్దీ కుటుంబం చిన్నదవుతుంది. అప్పటి దాకా దగ్గర ఉండే పిల్లలు రెక్కలొచ్చి దూరంగా ఎగిరిపోతారు. మాటవరసకో మనస్ఫూర్తిగానో తమ దగ్గరికి రమ్మన్న పిలుపు వినిపించినా, ఉన్న ఊరిని వదిలి వెళ్లడానికి ప్రాణం ఒప్పదు. అందుకే మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒంటరి వద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. అయితే వాళ్ల బాగోగులు చూసుకునేందుకు ఒక మంచి మార్గం ఎంచాలనుకుంది కేరళ రాష్ట్రం. ప్రపంచంలోనే అత్యధిక వయోవద్ధుల సంఖ్య కలిగిన జపాన్‌ దేశంలో వీళ్ల బాగోగులు చూసుకోవడం కోసం తీసుకొచ్చిన టైం బ్యాంకు కాన్సెప్టును ఇందుకోసం ఎంచుకున్నారు. కేరళ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజిక్‌ కౌన్సిల్‌ దీన్ని అక్కడి కొట్టాయం జిల్లా ఎలికులం గ్రామ పంచాయతీలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశ పెడుతున్నది.

ఆ పంచాయతీ పరిధిలో 7,000 మందికి పైగా వద్ధులు ఉండటంతో ముందస్తుగా టైం బ్యాంకు సేవల్ని అక్కడికే తీసుకొస్తున్నారు. ఈ సేవల్ని వినియోగించుకునేందుకు వివిధ సంస్థల ద్వారా వద్ధుల వివరాలు, అవసరాలను నమోదు చేస్తున్నది ప్రభుత్వం. అలాగే వాళ్లకు సేవలందించ దలచుకున్న వాళ్లనీ పేర్ల నమోదుకు ఆహ్వానించింది. కేవలం యువకులనే కాదు, ఏదైనా సాయం చేయగలిగిన పెద్దలూ ఇందులో భాగస్వాములు అవ్వచ్చు. ఇంతకీ వీళ్లు ఏం చేయాలంటే, పెద్ద వాళ్లను మార్కెట్‌కు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి వెళ్లి బ్యాంకు పనులు ఉంటే చేసి పెట్టడంలాంటివి చేయొచ్చు. ఆసుపత్రులకు తోడు, ఇంటి పనిలో సాయంలాంటివీ ఇందులో భాగమే. ఇవేవీ కాదు, వాళ్లతో కాసేపు కూర్చుని ముచ్చట్లు చెప్పినా సరే!



‘టైమ్‌ బ్యాంక్‌’లో ఖాతా తెరవడం ఎలా?
ప్రస్తుతం ‘టైమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లో 7వేల మందికిపైగా భారతీయులు ఖాతాదారులుగా ఉన్నారు. సేవా భావంతో ఒకరికి ఒకరు ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకునేందుకు రెడీగా ఉండేవారే ఇందులో ఖాతాను తెరవాలి. ఆసక్తి కలిగిన వారు తొలుత ‘టైం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
ఈ క్రమంలో ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు వివరాలను సమర్పించాలి. ఆధార్‌ కార్డుకు బదులుగా ఏదైనా ఇతర అడ్రస్‌ ప్రూఫ్‌ను సమర్పించొచ్చు. తదుపరిగా ఈ వివరాలను బ్యాంకు నిర్వాహకులు వేరిఫై చేసి, ‘నో యువర్‌ కస్టమర్‌’ (ఖ్‌జ) ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇదంతా జరిగాక టైం బ్యాంక్‌ ఖాతా మంజూరు అవుతుంది. ఈ అకౌంటును తెరవడానికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ ద్వారానే యూపీలోని కాన్పూర్‌లో ఎంతోమంది టైం బ్యాంకులో ఖాతాలు తెరిచారు.

‘టైమ్‌ బ్యాంక్‌’ ఎలా పనిచేస్తుంది?
‘టైమ్‌ బ్యాంక్‌’లో ఖాతాను తెరిచిన వారు తమ తీరిక సమయాల్లో సేవా కార్యక్రమాల కోసం కొంత సమయాన్ని కేటాయించొచ్చు. ఈ బ్యాంకులో ఖాతా కలిగిన వయో వద్ధులు, స్వచ్ఛంద సేవకులు, రిటైర్డ్‌ ఉద్యోగులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. వారికి తమవంతు సహాయాన్ని కూడా అందించొచ్చు. ‘టైమ్‌ బ్యాంక్‌’లో ఖాతా కలిగిన వారు ఇతరులకు సేవ చేసేందుకు ఎంతైతే ‘టైం’ను కేటాయిస్తారో, ఆ ‘టైం’ను పాస్‌బుక్‌లో ‘జమ’ (క్రెడిట్‌) చేస్తారు.

అకౌంట్‌లో క్రెడిట్‌లు
పెద్దవాళ్లు ఓ పోర్టల్‌ ద్వారా తమ అవసరాలను తెలియజేస్తారు. అప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వలంటీర్లు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయొచ్చు. లేదా చేయకపోనూ వచ్చు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాళ్లు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా తాము ఎంత సేపు వాళ్ల కోసం పనిచేసింది నమోదు చేస్తారు. అంటే ఆ గంట లేదా రెండు గంటల సమయం ఆ వలంటీర్‌ ఖాతాలో జమ అవుతుంది. తమ దగ్గరి వాళ్ల కోసం కానీ, తామే పెద్దయ్యాక అవసరం ఉన్నప్పుడు కానీ వీళ్లు ఈ వలంటీర్‌ సేవల్ని తిరిగి పొందొచ్చు. ఇక్కడ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు అస్సలు ఉండవు. సమాజం పెద్దల పట్ల బాధ్యత చూపుతూ, ముందు తరాలకూ సామాజిక భద్రతను అందించే ఈ టైం బ్యాంక్‌ నిజంగా మంచి ఆలోచన కదూ!
ఉదాహరణకు ఒక ఖాతాదారుడు మరొక ఖాతాదారుడికి సేవ చేసేందుకు 2 గంటల సమయాన్ని కేటాయిస్తే, ఈ టైంను పాస్‌బుక్‌లోని జమ సెక్షన్‌లోకి ఎంటర్‌ చేస్తారు. ‘టైమ్‌ బ్యాంక్‌’లో ఖాతా కలిగిన ఓ వ్యక్తి, మరొక ఖాతాదారుడి నుంచి కొన్ని గంటల సేవను పొందితే ఆ టైం (గంటలు) సమాచారాన్ని పాస్‌బుక్‌లోని ‘ఖర్చు’ (డెబిట్‌) సెక్షన్‌లోకి చేరుస్తారు. ఈవిధంగా ‘టైం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లోని ఖాతాదారులు క్రెడిట్‌, డెబిట్‌ లావాదేవీలు చేస్తుంటారు. ఈ వివరాలను ఖాతాదారులు ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సమాజ సేవకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం అనే దానిపై వారికి స్పష్టమైన క్లారిటీ ఉంటుంది.

  • అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -