తెలంగాణ పౌర హక్కుల సంఘం
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఏపీ అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్ ఒక బూటకమని తెలంగాణ పౌర హక్కుల సంఘం తెలిపింది. శనివారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మడివి హిడ్మాతో పాటు మరో ఐదుగురిని భద్రతా బలగాలు హత్య చేశాయని ఆరోపించారు. హిడ్మాను పోలీసులు నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని, అదుపులో ఉన్న ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండా ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారని ప్రశ్నించారు. నిజ నిర్దారణ కోసం ఏపీకి వెళ్తే తమను అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. గత 22 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో 84 బూటకపు ఎన్‌కౌంటర్‌లలో 780 మందిని కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని పౌర సమాజం ఖండించాలన్నారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి, ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.



