– తీవ్ర ఒత్తిడిలో టీమ్ ఇండియా
– దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489/10
– ముత్తుసామి సెంచరీ, రాణించిన యాన్సెన్
– భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
దక్షిణాఫ్రికా దంచికొట్టింది. ఆల్‌రౌండర్ ముత్తుసామి (109), టెయిలెండర్ మార్కో యాన్సెన్ (93) ఆఖర్లో అద్భుతం చేయటంతో గువహటి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి రోజు సమవుజ్జీగా నిలిచిన భారత్.. రెండో రోజు ఆటలో తేలిపోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9/0తో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకో 480 పరుగుల వెనుకంజలో నిలిచింది.
నవతెలంగాణ-గువహటి
ఆల్‌రౌండర్ సెనురన్ ముత్తుసామి (109, 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్ తొలి శతకంతో చెలరేగగా.. టెయిలెండర్ మార్కో యాన్సెన్ (93, 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెరీర్ ఉత్తమ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. మరో టెయిలెండర్ కైల్ వెరెనె (45, 122 బంతుల్లో 5 ఫోర్లు) సైతం రాణించటంతో చివరి ఐదు వికెట్లకు ఏకంగా 288 పరుగులు జోడించిన దక్షిణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండు రోజుల పాటు 151.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. గువహటి టెస్టుపై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 450 ప్లస్ పరుగులు చేసిన జట్టు భారత్‌లో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌లో ఓడిన చరిత్ర లేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ (4/115), రవీంద్ర జడేజా (2/94), జశ్‌ప్రీత్ బుమ్రా (2/75), మహ్మద్ సిరాజ్ (2/106) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 9/0తో ఆడుతోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (7 నాటౌట్), కెఎల్ రాహుల్ (2 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో మార్కో యాన్సెన్ మూడు మెయిడిన్ ఓవర్లతో ఓపెనర్లపై ఒత్తిడి పెంచాడు.
తోక ప్రతాపం
ఓవర్‌నైట్ స్కోరు 247/6తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా.. 489 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై రిషబ్ పంత్ బౌలింగ్ ప్రణాళికలు మార్చుకుని ఎత్తులు వేసినా ఫలితం దక్కలేదు. తొలి ఐదు వికెట్లను 201 పరుగులకే కోల్పోయిన దక్షిణాఫ్రికా..చివరి ఐదు వికెట్లకు 288 పరుగులు చేసింది. టాప్-5 బ్యాటర్లు 67.2 ఓవర్లు ఆడగా.. ఆఖరు-5 బ్యాటర్లు 88 ఓవర్ల పాటు క్రీజులో నిలిచారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు ముత్తుసామి (109), వెరెనె (45) ఏడో వికెట్‌కు 88 పరుగులు చేశారు. ముత్తుసామి, వెరెనె బౌలర్ల సహనాన్ని పరీక్షించినా.. వేగంగా పరుగులు సాధించలేదు. కానీ ముత్తుసామికి యాన్సెన్ జత కలవటంతో సఫారీ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో విశ్వరూపం చూపించిన యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులు పిండుకున్నాడు. 121 బంతుల్లో ఐదు ఫోర్లలో ముత్తుసామి అర్థ సెంచరీ చేయగా.. యాన్సెన్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. ముత్తుసామి, యాన్సెన్ జోడీ ఎనిమిదో వికెట్‌కు 107 బంతుల్లోనే 97 పరుగులు జోడించింది. దీంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ముత్తుసామి కెరీర్ తొలి సెంచరీ నమోదు చేయగా.. యాన్సెన్ శతకానికి ఏడు పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. భారత బౌలర్లలో ఎవరూ రెండో రోజు ఆశించిన ప్రభావం చూపించలేదు. టాప్-5 బ్యాటర్లు నిష్క్రమించినా.. తోక బ్యాటర్లు భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 151.1 ఓవర్లలో 489 పరుగులు చేసింది.
మనోళ్లు ఏం చేస్తారో?
సొంతగడ్డపై 12 ఏండ్లలో సిరీస్ ఓటమి చూడని టీమ్ ఇండియా.. గత 12 నెలల్లోనే రెండు సిరీస్ పరాజయాలు చవిచూసే ప్రమాదంలో పడింది. గువహటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. పట్టు బిగించింది. ఓటమి భయం వీడిన దక్షిణాఫ్రికా.. భారత్ గట్టిగా పోరాడినా డ్రా చేసుకునే స్థితిలో నిలిచింది. మూడో రోజు నుంచి పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. ఈ సమయంలో భారత్ బ్యాటింగ్‌కు వచ్చి తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు దీటుగా బదులివ్వాల్సి ఉంది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ స్పిన్‌పై బాగా ఆడగలడు. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో రాణించగలరు. దీంతో భారత్ తొలుత తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాల్సి ఉంది. లేదంటే, గువహటి టెస్టులోనూ ఓటమి నుంచి తప్పించుకోవటం గగనమే అవుతుంది. తుది జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లు తక్కువగా ఉండటం మరోసారి ఆతిథ్య జట్టుకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : ఎడెన్ మార్‌క్రామ్ (బి) బుమ్రా 38, రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్‌దీప్ 35, ట్రిస్టన్ స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్‌దీప్ 49, తెంబ బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41, టోనీ (సి) పంత్ (బి) సిరాజ్ 28, ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్‌దీప్ 13, ముత్తుసామి (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 109, యాన్సెన్ (బి) కుల్‌దీప్ 93, సైమన్ హార్మర్ (బి) బుమ్రా 5, కేశవ్ మహరాజ్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 21, మొత్తం : (151.1 ఓవర్లలో ఆలౌట్) 489.
వికెట్ల పతనం : 1-82, 2-82, 3-166, 4-187, 5-201, 6-246, 7-334, 8-431, 9-462, 10-489.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 32-10-75-2, మహ్మద్ సిరాజ్ 30-5-106-2, నితీశ్ కుమార్ రెడ్డి 6-0-25-0, వాషింగ్టన్ సుందర్ 26-5-58-0, కుల్‌దీప్ యాదవ్ 29.1-4-115-4, రవీంద్ర జడేజా 28-2-94-2.
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ నాటౌట్ 7, కెఎల్ రాహుల్ నాటౌట్ 2, మొత్తం : (6.1 ఓవర్లలో) 9.
బౌలింగ్ : మార్కో యాన్సెన్ 3.1-1-9-0, వియాన్ ముల్డర్ 3-3-0-0.



