Monday, November 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో తేలియాడే కృత్రిమ ద్వీపం

చైనాలో తేలియాడే కృత్రిమ ద్వీపం

- Advertisement -

ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణం

నీటిపై తేలియాడే కృత్రిమ ద్వీపం… ఆ ఊహే అద్భుతం. అలాంటి అద్భుతాన్ని చైనా సృష్టిస్తోంది. అణుబాంబులు వేసినా, ఈ నగరం తట్టుకొని నిలబడి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనేక అధునాతన, సాంకేతిక నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతున్న చైనా అద్భుత సృష్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

బీజింగ్‌ : సముద్ర తీరాల్లోనో..మధ్యలోనో ద్వీపాలను చూస్తుంటాం. ఇది సర్వసాధారణం. కానీ అందుకు భిన్నంగా చైనా డిజైన్‌ చేసిన కృత్రిమ ద్వీపం 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అత్యంత బలమైన తు˜పానులను తట్టుకోగల స్థాయిలో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ (ఎస్‌సీఎంపీ) నివేదిక ప్రకారం అణు విస్ఫోటనం నుంచి బయటపడటానికి నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే మొబైల్‌ కృత్రిమ ద్వీపంగా చైనా దీన్ని నిర్మిస్తోంది. 78వేల టన్నుల సెమీ-సబ్‌మెర్సిబుల్‌ ప్లాట్‌ఫామ్‌తో, లోతైన సముద్ర పరిశోధనలతో దీనికి రూపకల్పన చేస్తున్నారు. 2028లో ఈ కృత్రిమ ద్వీపం వినియోగంలోకి వస్తుందని అంచనా. ఈ ద్వీపం మరో ప్రత్యేకత 238 మందికి ఎలాంటి సామాగ్రి అవసరం లేకుండా 4 నెలలపాటు వసతి కల్పిస్తుంది. ఈ డిజైన్‌లో అరుదైన అణు-పేలుడు-నిరోధక వ్యవస్థ ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

షాంఘై జియావో టోంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ యాంగ్‌ డెకింగ్‌ రాసిన ఒక పత్రం ప్రకారం, ఈ ద్వీపం అన్నిరకాల వాతావరణాలకు తట్టుకొని దీర్ఘకాలిక నివాసం కోసం నిర్మించబడింది . అత్యవసర విద్యుత్‌, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ కోసం ఉపయోగించే కీలకమైన ప్రాంతాలను దీనినుంచి రక్షించొచ్చు. ఈ ద్వీపం చలనశీలత స్థిర పరిశోధన స్థావరాల నుంచి వేరు చేస్తుందని యాంగ్‌ బృందం చైనీస్‌ జర్నల్‌ ఆఫ్‌ షిప్‌ రీసెర్చ్‌లో నివేదించింది. లోతైన సముద్ర పర్యవేక్షణ, పరికరాల పరీక్ష వంటి నిరంతర శాస్త్రీయ పనుల్ని సముద్రంలో కదులుతూనే చేసుకొనే సౌకర్యం ఈ ద్వీపం ప్రత్యేకత. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న మరో సీనియర్‌ విద్యావేత్త లిన్‌ జోంగ్‌కిన్‌ గత సంవత్సరం చైనా మీడియాతో మాట్లాడుతూ మెటామెటీరియల్స్‌తో తయారు చేయబడిన ప్లాట్‌ఫారమ్‌ ‘శాండ్‌విచ్‌’ ప్యానెల్‌ను ఈ ద్వీప నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్యానెల్‌ ఆకస్మిక షాక్‌వేవ్‌ను నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది.

కుదింపు నియంత్రిత, నిర్మాణ వైఫల్య ప్రమాదాన్ని తగ్గించేలా రూపకల్పన చేశారని ఆయన వివరించారు. ద్వీప నిర్మాణం కోసం ఉపయోగించే ప్యానెల్‌ కోసం మెటల్‌ ట్యూబ్‌లకు ఉత్తమ ఆకారం, మందాన్ని కనుగొనడానికి పరిశోధకులు వేలాది కంప్యూటర్‌ మోడళ్లను పరీక్షించారు. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ చైనా 14వ పంచవర్ష ప్రణాళిక కింద జాతీయ శాస్త్రీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా జాబితా చేయబడింది. దాని స్పెసిఫికేషన్‌లు అణు రక్షణ కోసం చైనా సైనిక ప్రమాణాన్ని సూచిస్తాయనీ, ఇది ద్వంద్వ వినియోగ అనువర్తనాలను సూచిస్తుందని పేర్కొంది. తేలియాడే ద్వీపం దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో పనిచేస్తుంది. తక్కువ ఖర్చు, సులభమైన కదలిక , తక్కువ దౌత్య ఉద్రిక్తతలతో సహా భూ పునరుద్ధరణ కంటే మొబైల్‌ ప్లాట్‌ఫారమ్‌ ప్రయోజనాలను అందిస్తుందని దీనికి సంబంధించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సముద్ర శాస్త్రంలో సామర్థ్యాలను విస్తరిస్తూ, మరింత లోతైన సముద్ర పరిశోధన, సాంకేతికత, వనరుల అన్వేషణలో భాగంగా చైనా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -