అనేక దేశాల్లో యుద్ద్ధ వాతావరణం
ఇండియాలో పెరిగిన ఆర్థిక అసమానతలు, పేదరికం
స్థానిక పోరాటాలతోనే పార్టీ బలోపేతం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పార్టీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విస్తృత సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం, ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారీ విధానాలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ కమలానగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్-పాలస్తీనా మీద చేస్తున్న దాడుల్లో మహిళలు, పసిపిల్లలు చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. కాల్పుల ఒప్పందం చేసుకుని కూడా ఇజ్రాయిల్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మూడేండ్లుగా కొనసాగుతున్నదని తెలిపారు. ఉక్రెయిన్ నాటో దేశాల్లో కలవకుండా ఉంటే యుద్ధం ఆపేస్తామని రష్యా చెప్పిందనీ, సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
అమెరికాలో ఆర్థిక సంక్షోభం, ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నారు. అమెరికా అనేక దేశాల మీద ఆంక్షలను విధిస్తూ అవి అమలు చేయకపోతే ఆ దేశాల మీద అధికంగా సుంకాలు మోపుతూ తమ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాపై కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయరాదని ఆంక్షలు విధించిందనీ, దానికి మోడీ ప్రభుత్వం భయపడి రష్యా నుంచి ఆయిల్ కొనకుండా అమెరికా నుంచి కొంటుందన్నారు. చైనా మీద కూడా ఆంక్షలు విధిస్తే అంతే ఘాటుగా చైనా స్పందించిందని తెలిపారు. భారత్‌లోనూ ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయని జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
దేశంలో తీవ్రమైన పేదరికం కొనసాగుతోందని, ఆర్థిక అసమానతల నిర్మూలనకు ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. నిరుద్యోగం పెరుగుతోందనీ, వ్యవసాయ పనులకు నిధుల కొరత ఉందనీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు నిధులు తగ్గించారనీ, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందనీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వారికి అనుకూలంగా పని చేస్తుందన్నారు. ‘సర్’ పేరు పేరిట బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించడంతోనే బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందన్నారు. అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియని చేపడుతున్నామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడాన్ని తమిళనాడు, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ భావాలతో హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మోడీ ప్రభుత్వం ట్రంపునకు పూర్తిగా లొంగిపోయి మనకు అవసరం లేకున్నా పత్తి, సోయాబీన్, పాలు ఇంకా అనేక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటామని ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇక్కడి రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్‌లో ఉన్న ఖనిజాలు, భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగారు పేరుతో కుట్ర జరుగుతోందన్నారు. మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారనీ, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన అంత ఆశాజనకంగా లేదన్నారు. హామీల అమలులో విఫలం కావడంతో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతోన్మాద అంశాలను బీజేపీ వాడుకునేందుకు ప్రయత్నం చేసిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రమాదం పెరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు ఏ.అశోక్, ఎం.వినోద, జి. శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ఫ్రాక్షన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



