హిందూ సంస్థలో ముస్లింలను చేర్చుకోవడమేమిటని వితండవాదం
న్యూఢిల్లీ : సంఘ్ పరివార్ మత రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో ఉన్న మాతా వైష్ణోదేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో మొదటి బ్యాచ్ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి ప్రకటించిన జాబితాను రద్దు చేయాలంటూ సంఘ్ పరివార్ అనుబంధ సంఘాలు ఆందోళనలు మొదలు పెట్టాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులలో ముస్లింలు ఉండడమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. వైష్ణోదేవి మందిరానికి భక్తులు అందించే విరాళాలతో విద్యా సంస్థ నడుస్తోందని, అయితే అందులో చేరిన విద్యార్థులలో 90 శాతం మంది కాశ్మీర్ ముస్లింలేనని, కాబట్టి ప్రవేశాల జాబితాను రద్దు చేయాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, యువ రాజ్‌పుత్ర సభ, మూవ్‌మెంట్ కల్కి డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల విరాళాలతో ఏర్పడిన విద్యాసంస్థలో ముస్లింలను చేర్చుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విద్యా సంస్థలో సీట్లను హిందువులకే రిజర్వ్ చేయాలని పట్టుపట్టాయి.
వైష్ణోదేవి మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 50 మంది విద్యార్థుల ప్రవేశానికి జమ్మూకాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనుమతి ఇవ్వడంతో సంఫ్‌ు పరివార్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులలో 42 మంది కాశ్మీర్‌కు, ఎనిమిది మంది జమ్మూకు చెందిన వారు. ఇప్పటి వరకూ కాశ్మీర్ నుంచి 36 మంది, జమ్మూ నుంచి ముగ్గురు ప్రవేశాలు పొందారు. ‘వేరే ఇతర వైద్య కళాశాలల్లో కాశ్మీర్ అభ్యర్థులు ప్రవేశాలు పొందితే మాకు అభ్యంతరమేమీ లేదు. కానీ వైష్ణోదేవి కళాశాలలోని సీట్లను హిందూ అభ్యర్థులకే కేటాయించాలి. ఎందుకంటే ఆ కళాశాల వైష్ణోదేవి మందిరానికి వచ్చిన విరాళాలతో నడుస్తోంది’ అని బజరంగ్‌దళ్ జమ్మూకాశ్మీర్ విభాగం అధ్యక్షుడు రాకేష్ బజరంగి చెప్పారు. 2025-26 సంవత్సరానికి జరిపిన అడ్మిషన్లను పక్కన పెట్టాలని వీహెచ్‌పీ జమ్మూకాశ్మీర్ శాఖ అధ్యక్షుడు రాజేష్ గుప్తా డిమాండ్ చేశారు. వైద్య కళాశాలను ఇస్లాం సంస్థగా మార్చేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
నిబంధనల మేరకే ప్రవేశాలు
కళాశాలలో ప్రవేశాలు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల మేరకు నిబంధనల ప్రకారమే జరిగాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని 13 వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం 1,685 సీట్లను నీట్ జాబితా ప్రకారమే భర్తీ చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను జమ్మూకాశ్మీర్ అభ్యర్థులతోనే భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 15 శాతం సీట్లను దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులతో నింపడం జరుగుతుందని వారు వివరించారు.
లెఫ్టినెంట్ గవర్నరును కలిసిన బీజేపీ ప్రతినిధులు
శ్రీ మాతా వైష్ణోదేవి కళాశాలలో ప్రవేశాలు పొందిన వారి జాబితాను సమీక్షించాలని బీజేపీ శాసనసభ్యులతో కూడిన ప్రతినిధి బృందం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హాను కోరింది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు పొందిన యాభై మందిలో 42 మంది ముస్లింలేనని బీజేపీ శాసనసభ్యులు ఎల్జీ దృష్టికి తెచ్చారు. జమ్మూకాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం ఎల్జీతో సమావేశమైంది. జాబితాను సరిదిద్దాలని, ప్రవేశ నిబంధనలను సమీక్షించాలని కోరింది. వైద్య కళాశాల పూర్తిగా మత స్వభావాన్ని కలిగి ఉన్నదని, కోట్లాది ప్రజల భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్నదని బీజేపీ వాదిస్తోంది. మందిర బోర్డుకు అధ్యక్షత వహిస్తున్న ఎల్జీ సిన్హా జోక్యం చేసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తానని, తగిన నిర్ణయం తీసుకుంటానని బీజేపీ ప్రతినిధి బృందానికి ఎల్జీ హామీ ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.



