– కార్మికులకు ఉరిగా లేబర్ కోడ్‌లు
– మోడీ ప్రభుత్వం చర్య అప్రజాస్వామికం
– స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు :సీఐటీయూ జిల్లా మహాసభలో జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ-మణుగూరు
దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తోందని, దాని కారణంగా దేశం ఆర్థిక సంక్షోభంలో పడిందని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చిందని, వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలు కూకట్ల శంకర్ నగర్‌లోని కిన్నెర కళ్యాణమండపంలో(ఎర్ర శ్రీకాంత్ ప్రాంగణం) ప్రారంభమయ్యాయి. ముందుగా సీఐటీయూ సీనియర్ నాయకులు ఎంవీ అప్పారావు జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులు కూకట్ల శంకర్, ఎర్ర శ్రీకాంత్‌కు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొలగాని కె.బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో 50 కోట్ల కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారి హక్కులను హరించేందుకు మోడీ ప్రభుత్వం కోడ్‌లను తీసుకొచ్చిందని అన్నారు. 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో కార్మికుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా వ్యవహరించడం తగదని చెప్పారు. స్వతంత్రానికి ముందు ఆ తర్వాత పొందుతున్న హక్కులపై మోడీ ప్రభుత్వం గొడ్డలివేటు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు మరింత హీనస్థాయికి చేరే ప్రమాదం ఉందని అన్నారు. కార్మికులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏజే.రమేష్, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లూరి నాగేశ్వరరావు, రుద్ర నాగరాజు, చిట్టిబాబు, కోశాధికారి సత్ర పల్లి సాంబశివరావు, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి పోతురాజు శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దూకుడుగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



