జాతీయ కార్మిక సంఘాలు
కార్మిక కోడ్‌ల రద్దుకు 26న ఇందిరా పార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ-హిమాయత్ నగర్
నాలుగు కార్మిక కోడ్‌లను కార్మికుల సంక్షేమానికి తెచ్చామని కేంద్ర ప్రభుత్వం పత్రికల్లో మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నదనీ, వీటిని కార్మికవర్గం నమ్మాల్సిన అవసరం లేదని, ఈ లేబర్ కోడ్‌లు యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని జాతీయ కార్మిక సంఘాలు స్పష్టంచేశాయి. ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ.యూసఫ్ అధ్యక్షతన జాతీయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు జె.వెంకటేష్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కనీస వేతనాల సలహా మండలి బోర్డు చైర్మెన్ జనకప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు విజరు కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు కృష్ణ, విజరు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు భరత్ హాజరై కోడ్‌ల రద్దుకు అవలంబించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
మహిళలకు రాత్రిపూట డ్యూటీ చేసుకునే అవకాశం కల్పించామని కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నదని, గత చట్టాల్లో ఉన్న కొన్ని అంశాలను కోడ్‌లలో పొందుపరిచామని చెప్తున్నారని, వీటిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులు యాజమాన్యాల ముందు బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. కోడ్‌లలో 12 గంటల పని విధానం ఉందని, చట్టబద్ధంగా సమ్మె చేసే హక్కు లేదని తెలిపారు. కాలపరిమితితో కూడుకున్న ఉద్యోగ నియామకాల అంశం ఉందని, పర్మినెంట్ ఉద్యోగాలు లేవని, ఉద్యోగ కాలాన్ని నిర్ణయించే అధికారం యాజమాన్యాలకు కల్పించటం దుర్మార్గమని అన్నారు. యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని చెప్పారు. యాజమాన్యం యూనియన్‌ను గుర్తించాలంటే కంపెనీలో పని చేస్తున్న కార్మికుల్లో 52 శాతం సంతకాలు పెడితేనే యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుందని కోడ్‌లో పొందుపరిచారన్నారు.
ఈ నిబంధనతో ఒక్క కంపెనీలో ఒక్క యూనియన్ గుర్తింపు పొందే అవకాశం లేదన్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించటానికి ఒక సంక్షేమ కమిటీ వేస్తామని, ఆ కమిటీకి అధ్యక్షునిగా ఉండాల్సిన వ్యక్తిని యాజమాన్యం నియమిస్తుందని కోడ్‌లలో పొందుపరచడం సిగ్గు చేట్టన్నారు. గతంలో వ్యాపార సంస్థల్లో కార్మికుల సంక్షేమం, జీతభత్యాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా? అనే అంశాలపై లేబర్ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారని, ఇప్పుడు వారిని ఫెసిలిటేటర్ కమ్ ఇన్‌స్పెక్టర్‌గా పేరుమార్చి వారికున్న అధికారాలు కత్తిరించారని విమర్శించారు. గత చట్టాల్లో ఉన్న సామాజిక భద్రతను తగ్గించారని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో చాప్టర్ 5బీలో 100 మంది కంటే ఎక్కువ కార్మికులున్న పరిశ్రమను మూసి వేయాలన్నా, కార్మికుల్ని తొలగించాలన్నా, లే ఆఫ్ ఇవ్వాలన్నా, ఆ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, కానీ ఈ సంఖ్యను 100 నుంచి 300లకు పెంచుకునే అవకాశాన్ని యాజమాన్యాలకే కట్టబెట్టారని అన్నారు.
కోర్టుకు పోయే హక్కును సైతం తొలగించి ఇద్దరు సభ్యుల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. ఈ అంశాల వల్ల కార్మికుల హక్కులు పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుందని, యూనియన్లు భవిష్యత్తులో ఉండే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ ఉనికిలో లేకుంటే కార్మికులు స్వతంత్రంగా పోరాటం చేయలేరని తెలిపారు. యూనియన్లే లేకుండా చేస్తే యాజమాన్యాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చునని కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ ప్రయత్నాలకు ప్రతిఘటనగా ఈ నెల 26వ తేదీన ఇందిరా పార్కు వద్ద సంయుక్త రైతు సంఘాలతో కలిసి అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.



