భయాందోళనకు గురవుతున్న స్థానిక ప్రజలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, మరింత వకాలను ఆపాలని సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం దక్షిణ మండల ఎంఆర్ఓ బాలరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కమిటీ కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..నాగారం రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ వెనక నిన్న రాత్రి నుంచి మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు.
దీనివల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఎందుకంటే గతంలో ఈ మొరం తవ్వకాల కారణంగా స్కూల్ పిల్లలు ఆ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు పిల్లల ప్రాణాలు కోల్పోయారని మరోసారి గుర్తుచేశారు. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రులకు అండగా సీపీఐ(ఎం) నిలిచి అక్కడ తవ్విన గుంటను మూసివేసే వరకు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా ఆందోళనను చేసిందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొరం కారణంగా మళ్ళీ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. అందుచేత ఎమ్మార్వో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొరం తవ్వకాలు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని సీపీఐ(ఎం) నగర కమిటీ కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నరసయ్య అడివాలా అనిత, పార్టీ సభ్యులు ఎస్ కే శంషు పాల్గొన్నారు.



