Tuesday, November 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికుల క్రూరత్వాన్ని అరికట్టలేమా?

కుల క్రూరత్వాన్ని అరికట్టలేమా?

- Advertisement -

భారత్‌ చంద్రయాన్‌ ప్రయోగంలో విజయవంతమైంది. రోజురోజుకూ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతున్నది. కానీ, దేశంలో కుల క్రూరత్వం మధ్యయుగాలను మరిపిస్తున్నది. నరనరాన కులోన్మాద విద్వేషం పెరగడం ఒకింతా ఆందోళన కలిగిస్తున్నది. మతోన్మాదులు తమ మతం ప్రమాదంలో ఉందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ప్రమాదంలో ఉన్నది దళిత వర్గాలు. ముస్లింలు, క్రైస్తవుల వల్ల దళితులపై దాడులు జరగడం లేదు. హిందూమతంలో ఉన్న అగ్ర కులోన్మాదుల వల్లే లైంగికదాడులు, హత్యలు పెట్రేగిపోతున్నాయి. ఉత్తర భారతంలో కాపు పంచాయితీల పేరిట దౌర్జన్యాలు జరుగుతుంటే, తెలంగాణలో మాత్రం కుల దురహంకార హత్యలు ఆయా కుటుంబాల్లో తీరనిశోకాన్ని నింపుతున్నాయి. ఈ పదేండ్ల కాలంలో వాటి సంఖ్య 142కు చేరి అగ్రకుల మీసాలను మెలి తిప్పుతున్నాయి.అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదు. వీటిని అరికట్టేందుకు ముందస్తు చర్యలగానీ, కులదురహంకార, హింసాప్రవృత్తిని విడనాడే విధంగా ప్రజలకు అవగహన కల్పించడానికి ముందుకు రాకపోవడం శోచనీయం. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు కుల హత్యల్లో ప్రధాన పాత్ర పోషించింది కులమే. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో మామనే మానవ మృగంలా ప్రవర్తించి కోడల్ని బలి తీసుకున్నాడు. ఈ హత్య స్థానికంగానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓవైపు దీనిపై చర్చ నడుస్తుండగానే రంగారెడ్డి జిల్లాలో కూతురును పెండ్లి చేసుకునేందుకు సహకరించాడని యువకుని అన్నను హత్యచేశారు. ఈ వరుస ఘటనల పట్ల ప్రభుత్వం సీరియెస్‌గా స్పందించకపోవడం ఏలికల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుంది.

షాద్‌నగర్‌ నియోజక వర్గం, ఫరూక్‌ నగర్‌ మండలం, ఎల్లంపల్లి గ్రామ దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ తమ్ముడి ప్రేమ వివాహానికి సహకరించాడనే నెపంతో ఈ నెల పన్నెండున కులదురహంకార హత్యకు గురయ్యాడు.ఈ ఘాతుకానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితుల్లో ప్రధాన ముద్దాయి యువతి తండ్రి వెంకటేశ్‌. ఒక ప్లాస్టిక్‌ డబ్బాలో ఆరు లీటర్ల పెట్రోల్‌, నైలాన్‌ తాడు కొనుగోలు చేసి ‘మాట్లాడుకుందాం..రా’ అని రాజశేఖర్‌ను పిలిచి ఇన్నోవా కారులోనే హత్యచేసి నవాబుపేట అటవీప్రాంతంలో సజీవ దహనం చేశారు. ఈ విషయమై పోలీసులకు వెంకటేశ్‌ కూతురు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. అయినప్పటికీ బాధిత కుటుంబాన్నే పోలీసులు వేధించారు. హత్య జరుగుతుందని తెలిసీ పోలీసులు విచారణలో జాప్యం చేశారు. ‘మాది ఎక్కువ కులం,మీది తక్కువ కులమే’నన్న కుల దురహంకారమే హత్యకు మూలం. నిందితులు పోలీసులు కూడబలుక్కుని చేసిన హత్యలాగే ఉంది. మృతుడు రాజశేఖర్‌ది కూడా కులాంతర వివాహమే. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ కల్పించడం లేదని అర్థమవుతోంది. బాధిత కుటుంబాన్ని ఇంతవరకు ప్రజా ప్రతినిధులు పరామర్శించకపోవడం కూడా ఆధిపత్య ధోరణిని తెలుపుతోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి హత్యలు జరుగుతున్నా ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? పాలకులు బాధితుల పక్షాన నిలబడతారా? నేరస్తుల పక్షాన ఉంటారా? ఇలాంటి ఘాతుకాల పట్ల వెంటనే అప్రమత్తమై చర్యలకు దిగితే మరో ఘటన పునరావృతమయ్యేది కాదు.కానీ అలా చేయకపోవడం వల్లే వరుస హత్యలు చోటుచేసుకుంటున్నాయి.

కొమరంభీం అసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ ప్రధాన్‌ గిరిజన తెగకు చెందిన తొమ్మిది నెలల నిండు గర్భిణి శ్రావణితో పాటు పుట్టబోయే బిడ్డ కూడా కుల దురహంకార హత్యకు బలయ్యారు.బెస్త కులానికి చెందిన శేఖర్‌, శ్రావణి ఏడాది కాలంగా ప్రేమించుకుని ప్రేమ పెండ్లి చేసుకున్నారు. కులం తక్కువ ఆదివాసీ తెగకు చెందిన శ్రావణిని నువ్వు ఎట్లా పెండ్లి చేసుకుంటావని శేఖర్‌ కుటుంబసభ్యులు శ్రావణిని కత్తితో పొడిచి గొడ్డలితో నరికారు. మనుషుల్లో క్రూరత్వం పెరిగిందని చెప్పడానికి ఈ రెండు హత్యల ద్వారా తెలుస్తోంది. గిరిజన ఆదివాసి తెగ అయితే ప్రేమించకూడదా, పెండ్లి చేసుకోకూడదా? ఇంతటి దారుణాలకు ఎందుకు తెగబడుతున్నారు? వీరిక అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది? లోకం తెలియని శ్రావణి, కన్ను తెరవడానికి సిద్ధంగా ఉన్న పసిబిడ్డను నరికితే పరువు దక్కుతుందా? ఇది అమానవీయమైన చర్య. దీన్ని మానవత్వం ఉన్న వారంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం నిందితులపై హత్యానేరంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలి. కుల దురహంకారానికి బలైపోయిన శ్రావణి, పసిబిడ్డలు, రెండు ప్రాణాలకు రూ.50 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలి. హత్యల పట్ల సీపీఐ(ఎం) తీవ్రంగా స్పందించింది.రాష్ట్ర కార్యదర్శి జానెవెస్లీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. న్యాయం చేయాలని స్థానికంగా ఉద్యమాలు కూడా నిర్వహించారు.
ఇప్పటివరకు జరిగిన కుల దురహంకార హత్యల్లో బీజేపీ నాయకులు కేవలం ఒకే చోట ముస్లింలు నాగరాజు అనే యువకుడిని మత దుర హంకారంతో హత్య చేసినప్పుడు మాత్రమే స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆ హత్యను ఉపయోగించుకున్నారు కానీ, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు, బీజేపీ అగ్రనేతలు ఒక దళితుడిని అగ్రకులోన్మాదులు చంపితే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి.కులఉన్మాదం పేరిట ఎన్ని హత్యలు జరిగిన బలపరుస్తారా? పాకిస్తాన్‌ టెర్రరిస్టుల చేసిన హత్యల కంటే హిందూ సనాతన ధర్మం పేరు మీద దళితులపై జరిగిన హత్యలే ఎక్కువ. పాకిస్తాన్‌పై విస్తృత విద్వేషప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు ఈ హత్యలు వారి కంటికి కనిపించడం లేదా? హిందూ మతంలో అగ్రకులం వారు నిమ్నకులం వారిని చంపితే మీరు సమర్ధిస్తారా? కుల దురహంకారంతో ఎన్ని హత్యలు గ్యాంగ్‌రేపులు, దౌర్జన్యాలు, దాడులు జరిగినా సమ్మతమేనా? జరుగుతున్న హత్యలపై ఎందుకు స్పందించడం లేదు.

కులదురహంకార హత్యలను అరికట్టాలంటే పౌర సమాజం కూడా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఇలాంటి హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కులాంతర వివాహితుల ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. మేజర్లయితే చట్టబద్ధంగా వివాహాలు జరిపించాలి.ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా కులహత్యల్ని బాధితుల కోణంలో పారదర్శకంగా విచారణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. ఇప్పటివరకు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణగా నిలబడాలి. దళితులపై దాడుల్ని అరికట్టేందుకు, కుల దురహంకార ప్రోత్సహించేందుకు కేరళలో వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా ముందుకు సాగుతోంది. అన్ని ఆలయాల్లో దళితులను పూజారులుగా నియమించింది. కులాంతర వివాహం చేసుకున్న దంపతుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగమిచ్చి వారికి అండగా నిలబడుతోంది. అదే బాటలో తమిళనాడు ప్రభు త్వం కూడా ముందుకు సాగడం హర్షించదగినది. రాజస్థాన్‌ కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వం ఆ వెలుగుల్లో అడుగులు వేయాలి.
టి.స్కైలాబ్‌ బాబు
9177549646

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -