Tuesday, November 25, 2025
E-PAPER
Homeఆటలుకబడ్డీ ప్రపంచ కప్‌ మనదే..

కబడ్డీ ప్రపంచ కప్‌ మనదే..

- Advertisement -

భారత మహిళల జట్టు ఛాంపియన్‌ చైనీస్‌ తైపీపై గెలుపు
ఢాకా:
మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టైటిల్‌ను భారతజట్టు వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారతజట్టు 35-28పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీని చిత్తుచేసింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి భారత్‌ 20-16తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఆ తర్వాత అదేస్థాయి ప్రదర్శనను కనబర్చింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా భారత్‌ 29-24తో నిలిచింది. సంజూ దేవి సూపర్‌ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా.. సారథి రీతూ నేగి ట్యాకిల్‌కు యత్నించి గాయపడింది. ఇక సెకండాఫ్‌లోనూ భారత్‌ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే, చైనీస్‌ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. చివరకు ఏడు పాయింట్ల తేడాతో గెలిచిన భారత్‌ వరుసగా రెండో టైటిల్‌ను దక్కించుకుంది. సమయం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్‌ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే, భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్‌ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఓవరాల్‌గా ఐదు ప్రపంచకప్‌ టోర్నీ (3 పురుష, 2 మహిళలు)లు జరుగగా ఐదింట భారత్‌దే విజయం. తొలిసారిగా 2012లో నిర్వహించగా అప్పుడు కూడా భారత జట్టే ఛాంపియన్‌గా నిలిచింది.

ఆఖరి వరకు అజేయంగా..
గ్రూప్‌ దశలో భారత్‌ అన్ని మ్యాచుల్లోనూ గెలిచింది. గ్రూప్‌-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్‌-‘బి’లో చైనీస్‌ తైపీ సైతం ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచింది. ఇక సెమీ ఫైనల్లో భారత్‌ ఇరాన్‌ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా.. మరో సెమీస్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ బంగ్లాదేశ్‌పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్‌ చేరగా భారత్‌-చైనీస్‌ తైపీపై గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి. ఆసియా నుంచి భారత్‌, ఇరాన్‌, బంగ్లాదేశ్‌, చైనీస్‌ తైపీ, నేపాల్‌, థారులాండ్‌ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్‌.. యూరోప్‌ నుంచి పోలాండ్‌, జర్మనీ.. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా పాల్గొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -