– రాహుల్‌గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం :బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్ల అంశంతోపాటు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు జరగకముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ఆయన వెంటనే ఈ అంశంపైన పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో గళం లేవనెత్తాలని కోరారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామనీ, గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకెళ్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల నిధులను కేటాయించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామని అన్నారు. బీజేపీ పదేపదే బీసీల మాట చెబుతుంది కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకుని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ చేస్తున్న మోసాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ వెంటే బీసీలు : హరీశ్‌రావు
రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని అన్నారు. కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకుని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును గుర్తుంచుకున్నారని వివరించారు. వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాశ్, మధుసూదనాచారి, వి శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నే ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.
బీసీలకు కాంగ్రెస్ ద్రోహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



