– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
– 26న దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు
– మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి
– ఏపీ సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ గుట్టు విప్పాలి
విజయవాడ: నాలుగు లేబర్‌కోడ్‌ల అమలు కోసం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం శ్రామికవర్గంపై దాడి అని, దీన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి చేయడం అప్రజాస్వామికమని, హక్కులనూ కాలరాయడ మేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. యాజమాన్యాలకు పూర్తి అనుకూలంగా లేబర్‌కోడ్‌లు తెచ్చి, అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తూ కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కోడ్‌లు కార్మికవర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని తెలిపారు. ఈ లేబర్‌కోడ్‌లలో కనీసవేతనం నిర్వచనాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. కార్మిక యూనియన్లకు సమ్మె చేసే హక్కును, వేతనాల కోసం యజమాన్యంతో చర్చించే హక్కునూ లేకుండా చేశారని విమర్శించారు. కార్మికశాఖను పనికిరాని సంస్థగా మార్చేశారని, అధికారులను ఫెసిలిటేటర్లుగా పేర్కొన్నారని తెలిపారు. గిగ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించలేదని తెలిపారు. కార్మికరంగం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, దాన్ని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంటోందని విమర్శించారు. కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి అప్రజాస్వామిక చట్టాలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తోందని, వీటిని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్మికవర్గంపై దాడి చేయడం అంటే మొత్తం ప్రజలపైదాడి చేయడమేనని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 26న కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనను సీపీఐ(ఎం) పూర్తిగా సమర్థిస్తుందని తెలిపారు.
ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులపై దాడి
ఎన్‌కౌంటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులను కాల్చి చంపుతోందని, ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజన ప్రజానీకంపై యుద్ధం చేస్తోం దని రాఘవులు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు అడవి, సహజ వనరులు, ఖనిజాల పై కన్నేశాయని, వాటికోసం మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పేరుతో గిరిజనులను తరిమేసి, అడవులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కేంద్రం చేస్తున్న కుట్రల్లో భాగమే మావోయిస్టుల హత్యలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ బూటకమని, వేర్వేరు చోట్ల తలదాచుకున్న వారందరినీ పట్టుకెళ్లి కాల్చిచంపు తున్నారని తెలిపారు. గతంలో మావోయి స్టులు సీపీఐ(ఎం) నాయకులను కాల్చిచంపారని, అయినా రాజకీయంగా విభేదిస్తూనే వారిపై జరిగే దాడిని వ్యతిరే కిస్తామని తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. చర్చలకు సిద్ధమన్న వారిని పట్టుకుని చంపుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఎన్‌కౌంటర్లకు ఏపీ అనువైన ప్రాంతంగా గుర్తించారని, చంద్రబాబు ప్రభుత్వం బీజేపీ క్రూరత్వానికి ప్రతినిధిగా నిలుస్తోందని అన్నారు. దేశాల మధ్య యుద్ధరంగ ంలో సైనికులు దొరికితే వారిని మర్యాదగా చూసుకుని ఆయా దేశాలకు తిరిగి అప్పగిస్తారని, కానీ పోలీసులు మాత్రం మావోయిస్టులను పట్టుకుని కాల్చిచంపు తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కస్టడీలో ఉన్న మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
గూగుల్ డేటా సెంటర్ వివరాలను ఏపీ సర్కార్ బయటపెట్టాలి
విశాఖపట్నం దగ్గరలోని తర్లువాడలో పెడుతున్న అదానీ గూగుల్ డేటా సెంటర్ వివరాలను వెంటనే బయటపెట్టాలని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఉపయోగమే అయితే వివరాలు ఎందుకు బయపెట్టడం లేదని ప్రశ్నించారు. అక్కడ 49 మంది దళిత రైతుల నుంచి 100 ఎకరాలు డీఫారం పట్టా భూములు వద్దని వ్యతిరేకిస్తున్నా బలవంతంగా తీసుకుంటున్నారని అన్నారు. రూ.1.50 లక్షల కోట్లతో కంపెనీ పెడుతున్న గూగుల్ అక్కడ రైతుల నుంచి తీసుకుంటున్న భూములకు భూమిని ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. దానికి ఎంత నీరు, విద్యుత్ కావాలనే విషయాలనూ బయట పెట్టాలన్నారు. నీటిని ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పాలన్నారు. డేటా సెంటర్‌కు వాడే విద్యుత్‌తో విశాఖపట్నానికి ఏడాది మొత్తం ఉచితంగా సరఫరా చేయొచ్చని తెలిపారు. వాతావరణం దెబ్బతింటుందని, ప్రపంచంలో చాలా దేశాలు వ్యతిరేక ిస్తున్నాయని అన్నారు. అలాంటి డేటా సెంటర్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారో చెప్పాలని తెలిపారు. దీనిపై కనీసం సామాజిక పర్యావరణ అధ్యయన నివేదిక హొకూడా బయటపెట్టలేదని, అసలు పర్యావరణ ప్రభావం అంచనా వేశారా లేదా చెప్పాలన్నారు. లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న ప్పుడు అక్కడ స్థానికులకు ఎందుకు ఉపాధి కల్పించడం లేదని ప్రశ్నించారు.
సంజీవని పేరుతో ప్రయివేటుకే వైద్య సేవలు
ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన ‘సంజీవని’ని అమలు చేయడమంటే ఆరోగ్య సేవలను ప్రయివేటుపరం చేయడమేనని రాఘవులు విమర్శించారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం దాచేస్తోందని తెలిపారు. గత బడ్జెట్లో రూ.19000 కోట్లు కేటాయించారని అదంతా ఖర్చు చేస్తే ఆరోగ్యరంగం పెద్దఎత్తున అభివద్ధి చెందేదని తెలిపారు. ఆరోగ్యరంగాన్ని పూర్తిగా ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం కోసమే దీన్ని పెట్టారని, దీనివల్ల కార్పొరేట్లకు లబ్ది తప్ప పేదలకు ఏమీ ఉండదని పేర్కొన్నా రు. దీనిలో టీసీఎస్, బిల్‌గేట్స్ మిలిందా ఫౌండేషన్ భాగస్వాములని తెలిపారు. దీనివల్ల ప్రజల ఆరోగ్య డేటా మొత్తం ప్రయివేటు మందుల కంపె నీలకు, పరిశోధనా సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు లబ్ది కలిగిస్తుందని, వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్పొరేట్ల లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
లేబర్ కోడ్‌ల పేరుతో శ్రామికవర్గంపై దాడి
- Advertisement -
- Advertisement -



