సీజన్‌తో సంబంధం లేకుండా లభించే వాటిల్లో బొప్పాయి ఒకటి. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండును తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో అనేక సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ కాలంలో బొప్పాయి తినడం వల్ల ఉబ్బసం, చర్మం, జుట్టు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి అలాంటి బొప్పాయితో చేసే కొన్ని వంటకాల గురించి ఈరోజు తెలుసుకుందాం…
బొప్పాయి హల్వా
కావల్సిన పదార్థాలు: దోరగా పండిన బొప్పాయి తురుము – నాలుగు కప్పులు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, పంచదార – ఐటు టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి – అర టీ స్పూను, బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి తురమాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు వేయించాలి. బాగా ఉడికిన తర్వాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి. బాదం పప్పుల పొడి జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. జీడిపప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి. కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది.
బొప్పాయి కర్రీ
కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు, ఉడికించిన ఆలూ – ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూను, పనీర్ తురుము – టేబుల్ స్పూను, మెంతులు – టీ స్పూను, జీలకర్ర – టీ స్పూను, నూనె – టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత.
పేస్ట్ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రేకలు – పది, అల్లం – చిన్న ముక్క, మిరపకారం – టీ స్పూను, పసుపు – పావు టీ స్పూను, ధనియాలు – అర టీ స్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగం – ఒకటి.
తయారు చేసే విధానం: ఒక పాత్రలో ఉప్పు వేసి తరిగిన బొప్పాయి ముక్కలు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, నీరు ఒంపేయాలి. ఉడికించిన ఆలూ చిన్న చిన్న ముక్కలు చేయాలి. చిన్న గిన్నెలో మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాక, నీళ్లు ఒంపేసి మెంతులను బొప్పాయి ముక్కలకు జత చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలను మెత్తగా ముద్దలా చేసి, జీలకర్ర వేగిన తర్వాత జత చేయాలి. ఉప్పు, అరకప్పు నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి. బొప్పాయి ముక్కలు, ఆలూ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, మంట బాగా తగ్గించి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. బొప్పాయి ముక్కలు బాగా మెత్తపడి, గ్రేవీ చిక్కగా అవ్వగానే దింపేసి కొత్తిమీరతో అలంకరించాలి. ఇది చపాతీ, పరాఠా, అన్నంలోకి రుచిగా ఉంటుంది.
మసాలా కూర
కావల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు – రెండు కప్పులు, పచ్చి బఠాణీ – టేబుల్ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెమ్మలు, పచ్చి సెనగ పప్పు – టీ స్పూను, మినప్పప్పు – టీ స్పూను, పల్లీలు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, జీలకర్ర – టీ స్పూను, నువ్వులు – టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి పొడి – టేబుల్ స్పూను, నూనె – టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, పసుపు – కొద్దిగా, ఆవాలు – టీ స్పూను.
తయారు చేసే విధానం: ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పువేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పల్లీలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి. నువ్వులు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఎండు కొబ్బరి పొడి జత చేసి మరోమారు వేయించాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి. ఉప్పు జత చేసి బాగా కలిపి, బొప్పాయి ముక్కలు జత చేయాలి. మెత్తగా పొడి చేసిన మసాలా పొడి వేసి మరోమారు కలపాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత దింపేయాలి. అన్నంలోకి రుచిగా ఉంటుంది.
పెరుగు పచ్చడి
కావల్సిన పదార్థాలు: పచ్చి బొబ్బాయి తురుము – కప్పు, పెరుగు – మూడు కప్పులు, తరిగిన పచ్చిమిర్చి – నాలుగు, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర – టీ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను, పసుపు – కొద్దిగా, పచ్చి సెనగ పప్పు – టీ స్పూను, మినప్పప్పు – టీ స్పూను.
తయారు చేసే విధానం: స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఒక గిన్నెలో బొప్పాయి తురుము, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో పెరుగు, పసుపు వేసి గిలకొట్టాలి. ఉడికించిన బొప్పాయి తురుము జత చేసి బాగా కలియబెట్టాలి. వేయించి ఉంచుకున్న పోపు వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి. ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.
బొప్పాయితో కమ్మని రుచులు
- Advertisement -
- Advertisement -



