Wednesday, November 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఐసీడీఎస్‌ నిర్వీర్యానికి కేంద్రం కుట్రలు

ఐసీడీఎస్‌ నిర్వీర్యానికి కేంద్రం కుట్రలు

- Advertisement -

– ‘మోడీ’ అబద్ధపు ప్రచారంపై పోరాటం చేయాలి
– ఆరోగ్యవంతమైన దేశం కోసం అంగన్‌వాడీల కృషి : అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌యూనియన్‌(సీఐటీయూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధు
– ఆదిలాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన యూనియన్‌ రాష్ట్ర 5వ మహాసభ
– నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

దేశంలో పేదవాడి పొట్టగొడుతూ.. అబద్ధపు ప్రచారం చేస్తున్న మోడీ సర్కారుపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాటం చేయాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధు పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం కృషి చేస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థ(ఐసీడీఎస్‌)ను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర మహాసభ మంగళవారం ఆదిలాబాద్‌లో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో 50 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారని, వారికి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్న అంగన్‌వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో 60శాతం పన్నులు చెల్లిస్తోంది సామాన్యులేనని, కేవలం 3శాతం పన్నులు చెల్లిస్తున్న ధనికులకు ప్రధాని మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. పౌష్టికాహార లేపం లేదని ఐసీడీఎస్‌ను ఎత్తేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయిస్తోందని తెలిపారు. 1975 అక్టోబర్‌ 2న ప్రారంభమైన ఐసీడీఎస్‌ వ్యవస్థ 50 ఏండ్లు పూర్తి చేసుకుందని, అర్ధ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సంబంధిత కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవిని కోరగా ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు. వలసల పేరుతో దేశ వ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న కోటి 25 లక్షల మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని తెలి పారు. పోషన్‌ ట్రాకర్‌, ఎఫ్‌ఆర్‌ఎస్‌ లాంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టి అంగన్‌ వాడీలను ఇబ్బందుల పాల్జేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగన్‌ వాడీలకు కేవలం రూ.2250 నెలవారీ వేతనం ఇస్తోందని, మిగతాది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తు న్నాయని వివరించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించి అందరికీ ఒకే మాదిరిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

లేబర్‌ కోడ్‌ల పరిధిలోకి అంగన్‌వాడీలు రారు : సాయిబాబు
29 కార్మిక చట్టాలను తొలగించి సులభతరమైన కార్మిక చట్టాలతో కార్మికులందరికీ న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల పరిధిలోకి అంగన్‌వాడీలు రారని సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు తెలిపారు. అంగన్‌వాడీలతోపాటు ఆశా, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్‌ వర్కర్స్‌ కార్మికులు కారా? అని ప్రశ్నించారు. ంగన్‌వాడీలకు గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ వ్యవస్థను కాపాడుకోవడానికి అంగన్‌వాడీలు ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు సునీత, జయలక్ష్మి, కోశాధికారి మంగ, సీఐటీయూ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాల సీఐటీయూ ప్రధాన కార్యదర్శులు బొమ్మెన సురేష్‌, దుంపల రంజిత్‌, ముంజం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -