Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
– ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తారు?: ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌
– రవాణా శాఖ కార్యాలయం ఎదుట మహాధర్నా
– భారీగా తరలివచ్చిన ట్రాన్స్‌పోర్టు కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేటు రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ -సీఐటీయూ) అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర రావాణా శాఖ కార్యాలయం (ఖైరతాబాద్‌) ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకిచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అమలుకాని హామీలను తాము నెరవేరుస్తామని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. వారి సమస్యలను ఏ మాత్రం పరిష్కరించలేదని చెప్పారు. ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. ఆటో మోటార్‌ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిందని తెలిపారు. అవన్నీ ఉత్తిత్తి మాటలేనని తేలిపోయిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం ద్వారా, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని తెలిపారు. నష్టపోయిన డ్రైవర్లను ఆదుకుంటామని సీఎం, రవాణా శాఖామంత్రి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల పేరుతో ఆటోడ్రైవర్ల జీవితాలతో చెలగాట మాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రాష్ట్రంలో జరిగే ప్రాజెక్టులు, కాంట్రాక్టులు యధావిధిగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అక్కడ గుర్తుకురాని ఆర్థిక సమస్యలు, స్వయం ఉపాధి మీద ఆధారపడి జీవించే ఆటోడ్రైవర్ల విషయంలో ఎందుకు గుర్తుకొస్తున్నవని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి, రవాణా రంగ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినడం వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వారిని వెంటనే ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాద బీమా స్కీమ్‌ను వెంటనే రెన్యు వల్‌ చేసి, రూ.పది లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పెరుగు తున్న పెట్రోల్‌, డీజిల్‌, ఆయిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలకను గుణంగా ఆటో మీటర్‌ ఛార్జీలు పెంచాలని కోరారు. ఓలా, ఉబెర్‌, ర్యాపిడో, పోర్టల్‌ లాంటి ఆన్‌ లైన్‌ యాప్‌ల స్థానంలో ప్రభుత్వమే అన్‌లైన్‌ యాప్‌ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఆటోడ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు , ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, హైదరాబాద్‌ నగరంలో ఆటోస్టాండ్లను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
ధర్నా అనంతరం రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తికి వినతి పత్రం అందజేశారు. మహాధర్నా కార్యక్రమానికి ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌.కోటయ్య అధ్యక్షతన వహించగా.. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ కార్యదర్శి వి.ఎస్‌. రావు, సీఐటీయూ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మీనా, మీసాల శ్రావణ్‌ కుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి అజరుబాబు, ఫెడరెషన్‌ నాయకులు నాగేశ్వరరావు, కిషన్‌, రాంకుమార్‌, కృష్ణ, బాబర్‌ ఖాన్‌, యాకుబ్‌, బాబా, చుక్క నర్సింహా, కృష్ణ ,అజరు బాబు, స్వామి, ఖదీర్‌, కలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -